
కేసీఆర్‌లో ఫైర్ ఏమైంది ?
మామూలుగా కేసీఆర్ స్పీచ్ అంటే ప్రత్యర్ధులపై ప్రాసలతోను, సామెతలతో, తిట్లతోను విరుచుకుపడటమే అందరికీ తెలిసింది
జగిత్యాలలో సోమవారం రాత్రి జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ స్పీచ్ విన్న వారందరికీ ఇదే అనుమానం వచ్చింది. మామూలుగా కేసీఆర్ స్పీచ్ అంటే ప్రత్యర్ధులపై ప్రాసలతోను, సామెతలతో, తిట్లతోను విరుచుకుపడటమే అందరికీ తెలిసింది. ప్రత్యర్ధులపైన విరుచుకుపడటం అంటేనే కేసీఆర్ నోటికొచ్చింది మాట్లాడటమే. అలాంటి కేసీఆర్ దాదాపు 45 నిముషాలు బహిరంగసభలో మాట్లాడారు. తనమాటల్లో ఎక్కడా ప్రత్యర్ధులపై మాట తూలిందిలేదు. ఒక్కటంటే ఒక్కమాట కూడా తప్పుగా మాట్లాడలేదు, ప్రత్యర్ధులను తూలనాడలేదు. పొరబాటున కూడా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పేరు ఎత్తలేదు.
అలాగే బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కమాట కూడా మాట్లాడలేదు. విద్యుత్ మీటర్ల అమర్చే ప్రస్తావన తెచ్చినపుడు మాత్రమే ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేరెత్తారంతే. ఇక తెలంగాణలో అయితే ఒక్కసారి కూడా రేవంత్ పేరును కేసీఆర్ ఎత్తలేదు. ఏ మంత్రి పేరుకాని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల పేర్లను కూడా కేసీఆర్ ఎత్తలేదు. మామూలుగా అయితే కేసీఆర్ తన నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతారని అందరికీ తెలిసిందే. అలాంటిది ఈసభలో ప్రత్యర్ధుల పేరు ఎత్తకుండానే తెలంగాణ ప్రభుత్వం అంటు మాట్లాడటమే కాకుండా చాలా గౌరవంగా కూడా మాట్లాడారు.
తన హయాంలో అమలుచేసిన పథకాలు, కార్యక్రమాలను జనాలకు గుర్తుచేసిన కేసీఆర్ ప్రస్తుత ప్రభుత్వానికి ఏమి రోగం వచ్చింది ? ఏమి బీమారొచ్చింది అని సూటిగానే ప్రశ్నించారు. తనహయాంలో విద్యార్ధులు, రైతులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పంచాయతీలు, పేదలు ఇలా అన్నీ వర్గాలకు ఎలాంటి కష్టాలు లేకుండా చూసుకుంటే మరిప్పుడు అందరు ఎందుకింత కష్టాలు పడుతున్నారంటు నిలదీశారు. ఈ ప్రభుత్వానికి పాలన చేతకాదని తేల్చేశారు. తెలంగాణను కాపాడుకోవటానికి మళ్ళీ తెలంగాణ పునర్ నిర్మాణ ఉద్యమం మొదలుపెట్టాల్సిందే అని పిలుపిచ్చారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మొట్టమొదట హైడ్రాను ఎత్తి చెరువులో విసిరేస్తానని ప్రకటించారు. మొత్తంమీద 45 నిముషాల స్పీచ్ లో కేసీఆర్ చాలా జాగ్రత్తగా మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటు మూడు, నాలుగుసార్లు ప్రస్తావించిన కేసీఆర్ పొరబాటున కూడా బీజేపీ పేరు ప్రస్తావించకపోవటం గమనార్హం.

