విజయ్‌కు వీసీకే భేషరతు మద్దతు వెనుక ఏమి జరిగింది ?
x

విజయ్‌కు వీసీకే భేషరతు మద్దతు వెనుక ఏమి జరిగింది ?

విచిత్రం ఏమిటంటే రెండుపార్టీలు కూడా సడెన్ గా శనివారం సాయంత్రం విజయ్ కు భేషరతు మద్దతు తెలుపుతు గవర్నర్ కు లేఖలు రాశాయి


ప్రభుత్వం ఏర్పాటుచేయటానికి టీవీకే చీఫ్ విజయ్ కు లైన్ క్లియర్ అయిపోయింది. విడుతలై చిరుతైగళ్ కట్చి(VCK), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(IUML) పార్టీలు టీవీకే చీఫ్ విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇస్తున్నట్లు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ కు మద్దతు లేఖలు అందించాయి. రెండుపార్టీల మద్దతుతో విజయ్ కు 120 మంది ఎంఎల్ఏల మద్దతు లభించటంతో ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అసెంబ్లీలో బలనిరూపణలో కూడా ఎలాంటి సమస్య లేకపోయింది. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే విజయ్ కు మద్దతు ఇచ్చే ప్రశ్నే లేదని ఐయుఎంఎల్ ఇన్నిరోజులు భీష్మించుకుని కూర్చుంది. అలాగే తమ డిమాండ్లకు విజయ్ అంగీకరిస్తే కాని మద్దతు ఇచ్చేది లేదని వీసీకే పార్టీ చీఫ్ తిరుమావళవన్ తెగేసి చెప్పారు. అయితే విచిత్రం ఏమిటంటే రెండుపార్టీలు కూడా సడెన్ గా శనివారం సాయంత్రం విజయ్ కు భేషరతుగా మద్దతు తెలుపుతు గవర్నర్ కు లేఖలు రాశాయి.

మద్దతు ఇవ్వటానికి విజయ్ ను ఐదు రోజులపాటు ముప్పుతిప్పలు పెట్టిన వీసీకే పార్టీ చీఫ్ తిరుమావళవన్ ఎందుకు భేషరతుగా మద్దతు ప్రకించినట్లు ? తమ పార్టీ మద్దతు కావాలంటే డిప్యుటీ సీఎం పోస్టు కావాలన్నారు. విజయ్ రెండు చోట్ల గెలవటంతో తిరుచ్చి ఈస్ట్ లో రాజీనామా చేశారు. విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గానికి జరగబోయే ఉపఎన్నికలో తమపార్టీ పోటీచేయటానికి అంగీకరించాలన్నారు. ఈ రెండు డిమాండ్లు కాకుండా మంత్రివర్గంలో ఒక మంత్రి పదవి కావాలని అడిగారు. అలాగే కార్పొరేషన్లలో తమపార్టీకి కొన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే 107 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకే ను కేవలం రెండంటే రెండే సీట్లు గెలుచుకున్న వీసీకే పార్టీ చీఫ్ మద్దతు పలకటానికి ఎన్ని డిమాండ్లు చేశాడో. దీన్నే కాలమహిమ అంటారేమో.

డిప్యుటీ సీఎం పదవి తప్ప మిగిలిన డిమాండ్లకు విజయ్ అంగీకరించాడనే ప్రచారం జరిగింది. అయినా వీసీకే పార్టీ మద్దతు ప్రకటించటంపై కావాలనే టెన్షన్ పెట్టింది. ఇంతచేసిన తర్వాత చివరకు డిమాండ్లను ఉపసంహరించుకుని భేషరతుగా వీసీకే మద్దతు ప్రకటించటమే ఆశ్చర్యంగా ఉంది. డిమాండ్లను అర్జంటుగా ఉపసంహరించుకుని భేషరతుగా టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం వీసీకే పార్టీకి ఏమొచ్చింది ?

మొదటికే మోసం

ఏమొచ్చింది అంటే అతిచేస్తే గతి చెడుతుందనే పెద్దల మాట నిజమయ్యేట్లుందనే జ్ఞానం చివరినిమషంలో వీసీకే చీఫ్ కు కలిగినట్లుంది. ఎలాగంటే మద్దతు ఇవ్వటానికి వీసీకే ఒకవైపు ఇబ్బందులు పెడుతుండగానే మరోవైపు ఏఐఏడీఎంకే ఎంఎల్ఏల్లో చీలిక వచ్చేట్లుందనే సంకేతాలు బయటపడ్డాయి. ఏఐఏడీఎంకే తరపున గెలిచిన 47 మంది ఎంఎల్ఏల్లో సుమారు 30 మంది ఎంఎల్ఏలు చీలికవర్గంగా విడిపోయే సూచనలున్నాయని ప్రచారం జరిగింది. ఏఐఏడీఎంకే నుండి విడిపోయి ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ కు మద్దతు ఇచ్చే ఆలోచనలో ఉన్నారని, వీరంతా ఆర్ షణ్ముకం అనే సీనియర్ ఎంఎల్ఏ నాయకత్వంలో భేటీ అయ్యారనే వార్త ఒక్కసారిగా గుప్పుమన్నది. ఇద్దరు ఎంఎల్ఏలున్న వీసీకే పార్టీ మద్దతు ఇవ్వటం కోసం ఇంతగా ఇబ్బంది పెడుతున్నపుడు 30 మంది ఎంఎల్ఏలు మద్దతు ఇస్తామంటే విజయ్ కాదంటాడా ?

వీసీకేని పక్కనపడేసి వెంటనే ఏఐఏడీఎంకేలో చీలికవర్గం ఎంఎల్ఏలతో విజయ్ మంతనాలు మొదలుపెట్టబోతున్నాడనే ప్రచారం ఒక్కసారిగా ఊపందుకున్నది. దాంతో షాక్ తిన్న వీసీకే చీఫ్ తిరుమావళవన్ మొదటికే మోసం వచ్చేట్లుందని గ్రహించి ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాడు. తాము ఎలాంటి డిమాండ్లు చేయటంలేదని భేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించాడు. తర్వాత విజయ్ తో పాటు గవర్నర్ కు కూడా మద్దతు లేఖలు అందించాడు. ఇక ముస్లిం లీగ్ విషయమే అర్ధంకావటంలేదు. వీసీకే అయినా నిముషానికో మాట మాట్లాడింది. ముస్లింలీగ్ పార్టీ మాత్రం మొదటినుండి విజయ్ కు మద్దతిచ్చేది లేదనే చెప్పింది. కాని తెరవెనుక ఏమి జరిగిందో ఏమో సడెన్ గా విజయ్ కు మద్దతిస్తున్నట్లు ప్రకటించి గవర్నర్ కు లేఖ కూడా ఇచ్చేసింది. రెండుపార్టీల మద్దతు కారణంగా విజయ్ కు ప్రభుత్వం ఏర్పాటుకు అవరోధాలు తొలగిపోయాయి.


Read More
Next Story