ఓట్ల గల్లంతు బీఆర్ఎస్ లో టెన్షన్ ఎందుకు పెంచేస్తోంది ?
గల్లంతైన 74 లక్షల ఓట్లలో సుమారు 43 లక్షల ఓట్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండటమే పార్టీ టెన్షన్ కు అసలు కారణంగా అర్ధమవుతోంది.
మంగళవారంతో ముగిసిన సర్ ప్రక్రియలో సుమారు 74 లక్షల ఓట్లు గల్లంతవటం బీఆర్ఎస్ లో టెన్షన్ పెంచేస్తున్నట్లుంది. గల్లంతైన 74 లక్షల ఓట్లలో సుమారు 43 లక్షల ఓట్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండటమే పార్టీ టెన్షన్ కు అసలు కారణంగా అర్ధమవుతోంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ లో అత్యధికం గ్రేటర్ పరిధిలోనే ఉన్న విషయం తెలిసిందే. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ కు వచ్చింది 39 సీట్లు మాత్రమే. ఇందులో కూడా గ్రేటర్ పరిధిలోని 25 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ 16 చోట్ల గెలిచింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధి అంటే హైదరాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలు వస్తాయి.
పై మూడు జిల్లాల పరిధిలోని 25 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ బలంగా ఉంది. 65 సీట్ల గెలుపుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా గ్రేటర్ పరిధిలోని సీట్లలో గెలిచింది కేవలం ఒక్క సీటులో మాత్రమే. గ్రేటర్ పరిధిలో ఇంత బలంగా ఉన్నది కాబట్టే తొందరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక గెలుపుపై బీఆర్ఎస్ చాలా ధీమా వ్యక్తంచేస్తోంది.
ఇలాంటి పరిస్ధితిలో సర్ ప్రక్రియలో గ్రేటర్ పరిధిలోని 43 లక్షల ఓట్లు గల్లంతవ్వటంపట్ల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లో టెన్షన్ పెరిగిపోతోంది. ఈనెల 17వ తేదీన విడుదల అవ్వబోయే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పై చర్చించేందుకు ఈనెల 13, 14 తేదీల్లో గ్రేటర్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలతో కేటీఆర్ అత్యవసర సమావేశాలు నిర్వహిస్తున్నారు. సమావేశాల్లో ఏమి చెబుతారో చూడాలి.

