x

సెప్టెంబర్ 17 ఎందుకు వివాదాస్పదమైంది ?

దీనికి ప్రధాన కారణం రాజకీయ పార్టీల మధ్య వైరుధ్యాలే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు


తెలంగాణకు సంబంధించి ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్న సెప్టెంబర్ 17వ తేదీ అత్యంత వివాదాస్పదమైపోయింది. దీనికి ప్రధాన కారణం రాజకీయ పార్టీల మధ్య వైరుధ్యాలే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అధికార, ప్రతిపక్షాలు సెప్టెంబర్ 17వ తేదీన తలోరకంగా ప్రస్తావిస్తుండటంతో ఈ వివాదం దశాబ్దాలుగా కంటిన్యు అవుతునే ఉంది. అసలు సెప్టెంబర్ 17వ తేదీ వివాదం ఏమిటి ?

యావత్ దేశానికి 1947, ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యం వచ్చిన విషయం తెలిసిందే. అయితే నిజాం పాలనలోని హైదరాబాద్ రాజ్యానికి మాత్రం స్వాతంత్ర్యంరాలేదు. ఎందుకంటే భారతదేశంలో కలవటానికి నిజాంనవాబు అంగీకరించలేదు. అనేక సంప్రదింపుల తర్వాత కూడా తన రాజ్యాన్ని భారత్ లో విలీనం చేయటానికి నిజాం అంగీకరించకపోవటంతో సైనికచర్య తప్పనిసరి అయ్యింది.

అప్పటి కేంద్రం హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనికచర్య ‘ఆపరేషన్ పోలో’ కారణంగా 1948, సెప్టెంబర్ 17వ తేదీన నిజాం లొంగిపోయారు. భారత ప్రభుత్వానికి నిజాం లొంగిపోవటంతో రజాకార్ల పాలన అంతరించిపోయింది. హైదరాబాద్ రాజ్యం భారత్‌లో విమోచనం అయ్యింది. నిజాం, రజాకార్ల బాధల నుండి విమోచనం లభించింది కాబట్టే విమోచన దినోత్సవం జరుపుకోవటం సంప్రదాయమైపోయింది.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో జనాలను రెచ్చగొట్టేందుకు సెప్టెంబర్ 17వ తేదీని కేసీఆర్ బాగా వాడుకున్నారు. ‘‘ఆంధ్రోళ్ళ పాలన నుండి తెలంగాణకు విమోచనం రావాలి’’ అనే స్లోగన్ ఇచ్చిన కేసీఆర్ పనిలోపనిగా టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17వ తేదీన విమోచన దినోత్సవంగా నిర్వహిస్తామని చాలాసార్లు ప్రకటించారు. ఉద్యమ కాలంలో సెప్టెంబర్ 17వ తేదీని కేసీఆర్ అండ్ కో తెలంగాణ విమోచన దినంగానే నిర్వహించేవారు. అయితే ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17వ తేదీని కేసీఆర్ ప్రభుత్వం ‘విలీన దినోత్సవం’గా మార్చేసింది.

వెంటనే బీజేపీ వ్యతిరేక స్టాండ్ తీసుకుని విమోచన దినోత్సవంగా ప్రకటించాలని డిమాండ్ చేసింది. కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో ప్రత్యేకంగా తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లేకపోతే సీనియర్ కేంద్రమంత్రి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17వ తేదీ హైదరాబాదులో ప్రత్యేక కార్యక్రమం చేస్తోంది.

2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి సెప్టెంబర్ 17ను ‘సమైక్య దినోత్సవం’ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందుకనే సెప్టెంబర్ 17వ తేదీ అత్యంత వివాదాస్పద తేదీగా మారిపోయింది.

Read More
Next Story