
ఫామ్ హౌజ్ అవినీతి విషయంలో రేవంత్ పై అనుమానాలు(వీడియో)
నిజంగానే కేసీఆర్ ఫ్యామిలీ అవినీతి డబ్బులతోనే ఫామ్ హౌజ్ లను ఏర్పాటుచేసుకుంటే ఆ విషయాలను ఎందుకు బయటపెట్టడంలేదు ?
గడచిన రెండున్నరేళ్ళుగా పొద్దున లేచింది మొదలు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పదేపదే కేసీఆర్ ఫ్యామిలీ ఫామ్ హౌజ్ ల అవినీతి మీద ఆరోపణలు చేస్తునే ఉన్నారు. ఇక్కడే రేవంత్ ఆరోపణలపై జనాల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ ఆ అనుమానం ఏమిటంటే నిజంగానే కేసీఆర్ ఫ్యామిలీ అవినీతి డబ్బులతోనే ఫామ్ హౌజ్ లను ఏర్పాటుచేసుకుంటే ఆ విషయాలను ఎందుకు బయటపెట్టడంలేదు ? కేవలం ఎందుకని ఆరోపణలకు మాత్రమే రేవంత్ పరిమితమవుతున్నారు ? ఆరోపణలతోనే ఎందుకని కాలం వెళ్ళబుచ్చుతున్నాడు ?
తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలోని మిడ్జిల్ సభలో మాట్లాడుతు కేసీఆర్ కు గజ్వేలు, ఎర్రవల్లిలో వేల ఎకరాల్లో ఫామ్ హౌజులున్నాయని ఆరోపించాడు. కొడుకు కేటీఆర్ కు వందల ఎకరాల్లో జన్వాడలోను, మేనల్లుడు హరీష్ రావుకు మొయినాబాద్ లో 50 ఎకరాల్లో, కూతురు కల్వకుంట్ల కవితకు 25 ఎకరాల్లో శంకర్ పల్లిలో ఫామ్ హౌజ్ లు ఎక్కడినుండి వచ్చాయని నిలదీశాడు. తాత, ముత్తాతల నుండి వీళ్ళకు ఫామ్ హౌజ్ లు వచ్చాయా అని ప్రశ్నించాడు. అధికారంలో ఉన్నపుడు దోచుకున్న డబ్బుతోనే పెద్ద పెద్ద ఫామ్ హౌజ్ లు ఏర్పాటు చేసుకున్నారని రేవంత్ విరుచుకుపడ్డారు.
కాసేపు రేవంత్ చెప్పిందే నిజమని అనుకుందాము. ముఖ్యమంత్రిగా అధికారం అంతా రేవంత్ చేతిలోనే ఉందికదా ? రెవిన్యుశాఖ ఉన్నతాధికారులను లేదా జిల్లా కలెక్టర్, ఆర్డీవోలో లేదా ఎంఆర్వోలను ఆదేశిస్తే గంటల్లో ఫామ్ హౌజ్ ల వివరాలను రేవంత్ ముందుంచుతారు కదా ? వాళ్ళ ఫామ్ హౌజ్ లు ఎప్పుడు కొన్నారు ? ఎవరి దగ్గర నుండి కొన్నారు ? ఆ భూముల్లో ఫామ్ హౌజ్ లు ఎప్పటినుండి ఉన్నాయనే సమస్త వివరాలు రేవంత్ టేబుల్ మీదకు నిముషాల్లో వచ్చేస్తాయి. వచ్చిన వివరాలతో కేసీఆర్ ఫ్యామిలీ అవినీతి మొత్తాన్ని రేవంత్ జనాల ముందు ఉంచవచ్చు. అప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ దోపిడీని జనాలు తెలుసుకుంటారు.
కేసీఆర్ ఫ్యామిలీ దోపిడీని తేల్చే అధికారం చేతిలో ఉంచుకుని కూడా ఎందుకని రెండున్నరేళ్ళుగా దోపిడీ..దోపిడీ అంటు కేసీఆర్ ఫ్యామిలీపై ఆరోపణలతో మాత్రమే రేవంత్ కాలం వెళ్ళబుచ్చుతున్నాడో జనాలకు అర్ధంకావటంలేదు.

