తెలంగాణలో జనసేన ఎందుకు యాక్టివ్ అయ్యింది ?
22ఏ నిషేధి చట్టానికి వ్యతిరేకంగా, విద్యార్ధుల ఫీజు రీఎంబర్స్ మెంట్ డిమాండ్ తో జనసేన శ్రేణులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు
జనసేన పార్టీ తెలంగాణలో ఒక్కసారిగా యాక్టివ్ అవుతోంది. తొందరలో జరగబోయే ఎన్నికల్లో పార్టీ తరపున ఒక అభ్యర్ధిని కూడా పార్టీ అధినేత, ఏపీ డిప్యుటి సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఖమ్మం-నల్గొండ-వరంగల్ డిగ్రీ గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ స్ధానం నుండి పార్టీ అభ్యర్ధిగా డాక్టర్ గడల శ్రీనివాస్ పోటీచేస్తున్నారు. గడల ఆధ్వర్యంలో ఖమ్మంలో పార్టీ భారీ బహిరంగసభ నిర్వహించింది. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా పోటీచేయబోతున్నట్లు పవన్ ప్రకటించారు. అలాగే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ అభ్యర్ధిని తొందరలోనే ప్రకటించబోతున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. శంకర్ గౌడ్ ప్రకటించారు.
22ఏ నిషేధి చట్టానికి వ్యతిరేకంగా, విద్యార్ధుల ఫీజు రీఎంబర్స్ మెంట్ డిమాండ్ తో జనసేన శ్రేణులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. అలాగే ఉద్యోగాల భర్తీ డిమాండుతో కూడా జనసేన నేతలు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చేస్తున్నారు. ఈ విధంగా ప్రజా సమస్యలపై జనసేన నేతలు, క్యాడర్ సడెన్ గా యాక్టివ్ అవ్వటమే ఆశ్చర్యంగా ఉంది.
ఒకవైపు జెన్ జీ ఓటర్లను ఆకర్షించే ఉద్దేశ్యంతో పార్టీ తరపున మెంబర్ షిప్ డ్రైవ్ కూడా జరుగుతోంది. గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎన్నికల్లో ఓటర్లలో ప్రధానంగా యువతే ఎక్కువగా ఉంటారు కాబట్టి ఫీజు రీఎంబర్స్ మెంట్, ఉద్యోగాల భర్తీ డిమాండ్లపైన జనసేన ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లు అర్ధమవుతోంది.

