కేసీఆర్ ను చూస్తుంటే జాలేస్తోందా ?
x

కేసీఆర్ ను చూస్తుంటే జాలేస్తోందా ?

దేశగతిని, రాష్ట్ర భవిష్యత్తుకు సంబందించిన కీలకమైన అంశంలో కూడా కేసీఆర్ నోరెత్తటంలేదంటే ఏమనుకోవాలి.


తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎంత దురవస్ధలో ఉందో అర్ధమైపోతోంది. వర్తమాన రాజకీయాలపై యావత్ దేశం గగ్గోలు పెడుతుంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఫామ్ హౌస్ లో కూర్చున్నారు. ఫామ్ హౌస్ ను వదిలి తాను బయటకు రారు, ఫామ్ హౌస్ లోకి ఎవరిని రానీయరు. గురువారం నుండి శనివారం వరకు మోదీ ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను నిర్వహిస్తోంది. ఎందుకంటే 33శాతం మహిళా రిజర్వేషన్, నియోజవర్గాల పునర్విభజన బిల్లులను ఆమోదింపచేసుకోవటంకోసం. ఈరెండు బిల్లులను ఆమోదింపచేసుకోవటంలో మోదీ సర్కార్ ప్రతిపక్షాల సూచనలను ఏమాత్రం ఖాతరుచేయటంలేదు. బిల్లులు ప్రవేశపెట్టేముందు కనీసం అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించలేదు. ముగ్గురు ముఖ్యమంత్రులు ఎనుముల రేవంత్ రెడ్డి, పినరయి విజయన్, ఎంకే స్టాలిన్ నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తు లేఖలు రాసినా మోదీ కనీసం పట్టించుకోను కూడా లేదు.

అధికారంలో ఉన్నారు కాబట్టి తాము ఏమనుకుంటే అది జరిగిపోవాలన్న పంతం, ప్రతిపక్షాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న అహంభావమే మోదీలో కనబడుతోంది. ఇలాంటి నేపధ్యంలోనే వివిధ రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలు, నాన్ ఎన్డీయే పక్షాల నేతలు మోదీ వైఖరికి వ్యతిరేకంగా నానాగోల చేస్తున్నారు. తెలంగాణకు సంబంధించి ప్రతిరోజు కేంద్రం వైఖరిపై రేవంత్ తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తంచేస్తునే ఉన్నారు. ఇంత జరుగుతున్నా కేసీఆర్ మాత్రం నోరువిప్పి ఒక్క మాటకూడా మాట్లాడలేదు. బిల్లుల విషయంలో మోదీని వ్యతిరేకించాల్సిన అవసరమే లేదు, మద్దతుగా కూడా మాట్లాడవచ్చు. కేంద్రం నిర్ణయం వల్ల ధక్షిణాదికి తీరని అన్యాయం జరుగుతుందన్నది రేవంత్ అభ్యంతరం. ఏ విధంగా అన్యాయం జరుగుతుందో కూడా రేవంత్ ఉదాహరణలతో సహా వివరిస్తున్నాడు.

దేశగతిని, రాష్ట్ర భవిష్యత్తుకు సంబందించిన ఇంతటి కీలకమైన అంశంలో కూడా కేసీఆర్ నోరెత్తటంలేదంటే ఏమనుకోవాలి. 2023 అసెంబ్లీఎన్నికల్లో తననుఓడించిన జనాలపై కోపమా లేకపోతే రేవంత్ అభ్యంతరాలకు, వాదనకు తాను ఎందుకు మద్దతుగా నిలబడాలన్న ఆలోచనా అర్ధంకావటంలేదు. కేసీఆర్ వైఖరివల్ల తెలంగాణ చాలా నష్టపోవటం అయితే ఖాయమన్నది అర్ధమవుతోంది. ముఖ్యమంత్రులు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నా పట్టించుకోని మోదీ కేసీఆర్ అభ్యంతరాలు చెబితే లెక్కచేస్తాడా ? అనే ప్రశ్న రావటం సహజం. అయితే తొమ్మిదిన్నరేళ్ళు సీఎంగా చేసిన వ్యక్తి, ప్రధాన ప్రతిపక్ష నేత, ఏకంగా ప్రధానమంత్రి అయిపోవాలని కలలుకని, మళ్ళీ సీఎం అవ్వాలని అనుకుంటున్న కేసీఆర్ బిల్లు విషయంలో తప్పో ఒప్పో తన వైఖరి అయితే చెప్పాలి కదా.

బిల్లులపై ఏమీ మాట్లాడకుండా లీకులతో సరిపెట్టేయటమే ఆశ్చర్యంగా ఉంది. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై కేసీఆర్ తో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కీలకనేత హరీష్ రావు ఫామ్ హౌస్ లో సుదీర్ఘంగా చర్చించారట. ఏమి చర్చించారో ఎవరికీ తెలీదు. మహిళాబిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారట, లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన బిల్లును దక్షిణాదికి నష్టం కలిగేలా తీసుకొస్తే ఎట్టి పరిస్ధితుల్లోను ఒప్పుకునేది లేదని కేసీఆర్ చెప్పారట. ఇదంతా పార్టీ నాయకత్వం లీకుల రూపంలో మీడియాకు సమాచారం అందించింది. బిల్లులోని అంశాలను పరిశీలించిన తర్వాత తగిన నిర్ణయం తీసుకోవాలని పై ఇద్దరు నేతలను కేసీఆర్ ఆదేశించారట. బిల్లులోని కొన్ని అంశాలను ఇప్పటికే కేంద్రప్రభుత్వం అన్నీ పార్టీలకు పంపింది. అందులోని అంశాలను చూసిన పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నాయి. ఎవరేమనుకున్నా తమిష్టప్రకారమే చేసుకుపోవాలని మోదీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించేసింది.

బిల్లులోని అంశాలను ఇంకా కేసీఆర్ చూసేదేముంటుంది ? బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత అప్పుడు కేసీఆర్ చెప్పేదేముంటుంది ? అందుబాటులోని సమాచారం ప్రకారం పైరెండు బిల్లులు పాస్‌కావాలంటే మిగిలిన బిల్లులు పాస్‌అయినట్లు ఉత్త మెజారిటి ఉంటే సరిపోదు. సభలోని రెండింట మూడొంతుల మెజారిటి ఉండితీరాలి. అంటే లోక్‌సభలోని 543 మంది ఎంపీల్లో బిల్లులు పాస్ అవ్వాలంటే 363 మంది ఎంపీల మద్దతు అవసరం. అయితే ఇపుడు ఎన్డీయేకి ఉన్నబలం కేవలం 298 మాత్రమే. అంటే ఇంకా 65మంది ఎంపీల మద్దతు అవసరం. ఇందుకోసం ప్రతిపక్షాల నేతలతో ఎన్డీయే నాయకత్వం సంప్రదింపులు జరుపుతోంది. నాన్ ఎన్డీయే, నాన్ ఇండియా కూటమి ఎంపీల బలాన్ని తీసేస్తే మిగిలిన పార్టీల ఎంపీల మద్దతు అంతా కలిపినా 65 మంది ఎంపీలుండరు. ఇలాంటి సమయంలో బిల్లులను నెగ్గించుకునేందుకు మోదీ ఏమి వ్యూహాలను అనుసరించబోతున్నారు అన్నదే కీలకం. ఇలాంటి సమయంలో కూడా కేసీఆర్ తన వైఖరి ఏమిటో బహిరంగంగా, స్పష్టంగా చెప్పలేకపోతున్నారంటనే ఏదో వ్యక్తిగత హిడెన్ అజెండా ప్రకారమే నోరెత్తలేకపోతున్నారని అర్ధమైపోతోంది. అందుకనే కేసీఆర్ ను చూస్తే జాలేస్తోంది.

Read More
Next Story