
కాంగ్రెస్ పై కూనంనేని సాంబశివరావు ఎందుకు ఫైర్ అయ్యారు?
సీపీఐ నిర్వహించిన 'ప్రజా చైతన్య యాత్ర' ప్రారంభోత్సవంలో భాగంగా కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "మమ్మల్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోం.. స్నేహ ధర్మానికి కట్టుబడి ఉన్నాం కానీ, మమ్మల్ని వీడితే కాంగ్రెస్‌ను కాపాడేవారే ఉండరు" అని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ తమ మిత్రధర్మాన్ని విస్మరిస్తే గతంలో బీఆర్‌ఎస్ పార్టీకి పట్టిన గతే కాంగ్రెస్‌కు కూడా పడుతుందని గట్టి కౌంటర్ ఇచ్చారు.
మతతత్వ బీజేపీ పార్టీని రాష్ట్రంలోకి రానివ్వకూడదనే ఉద్దేశంతోనే తాము కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చామని కూనంనేని స్పష్టం చేశారు. కమ్యూనిస్టులను ఏదో చిన్న మొక్కలు అనుకుని పీకేద్దామని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. స్నేహ ధర్మాన్ని పాటించకపోతే కాంగ్రెస్ పార్టీ తనకు తానుగా శవపేటికను లేదా శిలాఫలకాన్ని సిద్ధం చేసుకున్నట్లే అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పొత్తు హెచ్చరికలతో పాటు పాలనాపరమైన లోపాలపై కూడా కూనంనేని నిలదీశారు. బడ్జెట్‌లో విద్య, వైద్యం వంటి కీలక రంగాలకు తగిన నిధులు కేటాయించకపోవడం, నియోజకవర్గాల అభివృద్ధి పనులకు నిధుల విడుదల ఆలస్యం కావడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రుల మధ్య సరైన సమన్వయం లేకపోవడం వల్లే అభివృద్ధి మందగించిందని, పాలనలో మార్పు రావాల్సి ఉందనే ఉద్దేశంతోనే తాము వీధుల్లోకి వచ్చి ప్రజా చైతన్య యాత్రలు చేపడుతున్నామని స్పష్టం చేశారు.

