
మోదీ చెప్పినట్లు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందా ?
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే మరో మూడు ఎన్నికలు వెయిట్ చేయక తప్పదా ? అనే సందేహం పెరిగిపోతోంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనుకోగానే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందా ? ఇపుడిదే చర్చ యావత్ తెలంగాణలో జరుగుతోంది. ఆదివారం రాత్రి సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ ఆధ్వర్యంలో బహిరంగసభ జరిగింది. ఈ సభలో మోదీ మాట్లాడుతు సభలోని జనాల ఉత్సాహం చూస్తుంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందనే నమ్మకం కలుగుతున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో పశ్చిమబెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే ఇక్కడ మోదీ మాటల్లోనే అర్ధమవుతున్న విషయం ఏమిటంటే బెంగాల్లో 2011 నుండి తీవ్రంగా ప్రయత్నించిన బీజేపీ మూడోసారి 2026 ఎన్నికల్లో సక్సెస్ అయ్యింది. ఈ లెక్కన తీసుకుంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే మరో మూడు ఎన్నికలు వెయిట్ చేయక తప్పదా ? అనే సందేహం పెరిగిపోతోంది.
బెంగాల్లో మమత నియంతృత్వాన్ని ప్రజలు తిరస్కరించారని మోదీ చెప్పింది నిజమే. కానీ తెలంగాణలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నియంతగా వ్యవహరించటంలేదన్న విషయాన్ని మోదీ మరచిపోయినట్లున్నారు. ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలనే కోరుకోవటం సహజం. అయితే అధికారంలోకి వచ్చేందుకు తెలంగాణలో బీజేపీకి అనుకూలమైన పరిస్ధితులు ఉన్నాయా అన్నదే డౌట్. బెంగాల్ ప్రజలు లెఫ్ట్ ప్రభుత్వాన్ని, మమత ప్రభుత్వాన్ని తిరస్కరించారంటే అర్ధముంది. అదేమిటంటే లెఫ్ట్ ప్రభుత్వం బెంగాల్ ను 34 ఏళ్ళు ఏలింది కాబట్టి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చేసింది. అలాగే మమత ప్రభుత్వం మీద కూడా జనాల్లో వ్యతిరేకత పెరిగిందంటే అందుకు కారణం వరుసగా టీఎంసీ 15 ఏళ్ళు అధికారంలో ఉండటంతో పెరిగిపోయిన అరాచకం.
నియంతృత్వాన్ని, అరాచకాన్ని భరించలేకపోయిన జనాలు పైన చెప్పిన రెండు ప్రభుత్వాలను వదిలించుకున్నారంటే అర్ధముంది. కానీ తెలంగాణలో రేవంత్ ప్రభుత్వంలో నియంతృత్వమూ లేదు అలాగే అరాచకాలకూ పాల్పడటంలేదు. కాబట్టి రేవంత్ చెప్పుకుంటున్నట్లు, ఇపుడు మోదీ చెబుతున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం మరో టర్మ్ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను జనాలు నమ్మటంలేదన్న మోదీ ఆరోపణ కొంత వరకే కరెక్ట్. తొమ్మిదన్నరేళ్ళ కేసీఆర్ పాలనలో జనాలు విసిగిపోయారు కాబట్టే బీఆర్ఎస్ ను గద్దెదించి కాంగ్రెస్ కు పట్టంకట్టారు. తెలంగాణకు వేల కోట్ల రూపాయల నిధులు ఇస్తున్నామన్న మోదీ మాట కరెక్టే. అయితే తెలంగాణకు రావాల్సినంత స్ధాయిలో నిధులు రావటంలేదని రేవంత్ పదేపదే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
రేవంత్ చెప్పిన ప్రకారం తెలంగాణనుండి కేంద్రప్రభుత్వానికి వెళుతున్న ప్రతి రూపాయిలో తిరిగి రాష్ట్రానికి కేంద్రం కేటాయిస్తున్నది 40 పైసలు మాత్రమే. ఆ 40 పైసలనే కేంద్రం తెలంగాణకు ప్రత్యేకంగా పెద్దఎత్తున నిధులు కేటాయించేస్తున్నది అన్నంతగా బిల్డప్ ఇవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిధులు ఇస్తోందని మోదీ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. నిధుల కేటాయింపులో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందన్న రేవంత్ ఆరోపణలకు మోదీ వేదికమీద నుండి సమాధానం చెప్పుంటే బాగుండేది. తెలంగాణ అభివృద్ధికి సహకరించటం అన్నది కేంద్రం బాధ్యత. నిజంగానే తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని మోదీ చెప్పటమే నిజమైతే రేవంత్ ప్రభుత్వం పంపిన ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులకు నిధులు ఎందుకు విడుదల చేయటంలేదు ? మెట్రో రెండోదశ విస్తరణ ప్రాజెక్టుకు నిదుల కేటాయింపు ప్రతిపాదనలను కేంద్రం ఎందుకు పట్టించుకోవటంలేదు? మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు కేంద్రం ఎందుకు నిధులు ఇవ్వటంలేదో చెబితే బాగుండేది. ఫ్యూచర్‌సిటీ అభివృద్ధికి కేంద్రం ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంలేదు ?
దేశంలో కాంగ్రెస్ కేవలం 3 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉందని ఎద్దేవా చేశారు. ఆ మాటకొస్తే ఒకపుడు బీజేపీకి పార్లమెంటులో కేవలం 2 సీట్లు మాత్రమే ఉందన్న విషయాన్ని మోదీ మరచిపోయినట్లున్నారు. అలాగే దేశంలో ఏ ఒక్కరాష్ట్రంలో కూడా అధికారంలో లేదు. వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన జనాలు మెల్లిగా ప్రత్యామ్నాయాలుగా ఇతర పార్టీల వైపు మొగ్గుచూపించారు. ఇందులో భాగంగానే బీజేపీ కూడా దేశంలో మెల్లిగా పుంజుకున్నదంతే.
మావోయిస్టుల గురించి మాట్లాడుతు దేశంలో మావోయిస్టులు అంతమైపోయినా తెలంగాణ మాత్రమే వాళ్ళని బతికిస్తోందనే ఆరోపణలో నిజంలేదు. మావోయిస్టు పార్టీలో ఇపుడు కీలకంగా ఉన్నదే 6 మందికన్నా లేరు. అందులో ఇద్దరో లేకపోతే ముగ్గురో తెలంగాణ వాళ్ళున్నారంతే. గడచిన ఏడాదిలో వందలాది మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయిన విషయం మోదీకి తెలీదా ? ఛత్తీస్ ఘడ్, ఝార్ఖండ్, మహారాష్ట్రాల్లో మావోయిస్టులను ఎన్ కౌంటర్లు చేయటానికి బదులు లొంగిపోయేట్లుగా తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అందుకనే పైన చెప్పిన రాష్ట్రాల్లోని మావోయిస్టు నేతలు కూడా తెలంగాణలో లొంగిపోయారు. తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలు దాదాపు నియంత్రణలోకి వచ్చేశాయనే చెప్పాలి. మావోయిస్టు కార్యకలాపాలతో తెలంగాణ నష్టపోయిందన్న మోదీ మాట నిజమే కాని అది ఇపుడు కాదు చాలా కాలం క్రిందటి మాట. దాదాపు 40 నిముషాల పాటు జరిగిన మోదీ ప్రసంగం ఒక దిశ దశా లేనట్లుగానే ముగిసింది. పార్టీ నేతలకు కాని జనాలను కాని హుషారు పరిచేట్లుగా మోదీ ప్రసంగం జరగకుండా చప్పగా ముగియటమే ఆశ్చర్యంగా ఉంది.

