
తెలంగాణలో నబీన్ సక్సెస్ అవుతారా ?(వీడియో)
తెలంగాణలో మూడురోజుల పర్యటన కోసం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు.
నితిన్ నబీన్ ఏమిటి, తెలంగాణలో సక్సెస్ అవటం ఏమిటి ? అనే సందేహం మొదలైంది. నిజమే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లాంటి వాళ్ళే చేతులెత్తేసిన తెలంగాణలో నబీన్ సక్సెస్ అవుతారా అనే సందేహం రావటం సబబే కదా. ఇంతకీ విషయం ఏమిటంటే తెలంగాణలో మూడురోజుల పర్యటన కోసం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. బీజేపీ తరపు 8మంది లోక్ సభ ఎంపీలు, 8మంది ఎంఎల్ఏలు, ఇద్దరు ఎంఎల్సీలున్న విషయం తెలిసిందే. అయితే వీరంతా పార్టీకి సంబంధించిన ప్రోగ్రాముల్లో ఏకతాటిపైకి వచ్చింది చాలా తక్కువనే చెప్పాలి.
ఆధిపత్య గొడవలతో ప్రజా ప్రతినిధులు చాలామందిలో ఒకళ్ళంటే మరొకళ్ళకు పడటంలేదు. వీళ్ళందరికి మోదీ స్వయంగా ఏడాది క్రితం క్లాసులు పీకినా ఎలాంటి ఉపయోగం కనబడలేదు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు జాతీయ నేతలు చెప్పి చెప్పి విసుగుపుట్టి వదిలేశారు. ఇలాంటి నేపధ్యంలో నితీన్ హైదరాబాదుకు చేరుకున్నారు. పార్టీ ఆఫీసుల ప్రారంభోత్సవాలతో పాటు పార్టీ కార్యకర్తలతో చిన్న సైజు సభ కూడా పెట్టుకున్నారు. ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలతో ప్రత్యేకించి విడివిడిగా మాట్లాడుతారని పార్టీవర్గాల సమాచారం.
నబీన్ ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే తొందరలోనే జరగబోయే గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని. నేతలందరికి క్లాసులు పీకి ఏకతాటిపైకి తీసుకొచ్చి పనిచేయించి పైన చెప్పిన మూడు కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని నబీన్ డిసైడ్ అయినట్లున్నారు. అందుకనే నబీన్ తెలంగాణలో సక్సెస్ అవుతారా ? అని సందేహిస్తున్నది.

