
రేవంత్ కుర్చీకుడా కావాలంటారేమో ? (వీడియో)
ముఖ్యమంత్రి కుర్చీని కేసీఆర్ కు అప్పగిస్తే తెలంగాణను బంగారు తెలంగాణగా ఎలామార్చాలో చేసిచూపుతాము అని అడుగుతారేమో
బీఆర్ఎస్ నేతల వైఖరి చాలా విచిత్రంగా ఉంది. నాలుగురోజుల క్రితం కాళేశ్వరం ప్రాజెక్టును వారంరోజులు కేసీఆర్ కు అప్పగించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడిగారు. ఇపుడు అదేపార్టీకి చెందిన కీలకనేత తన్నీరు హరీష్ రావు మాట్లాడుతు ఇరిగేషన్ శాఖను తనకు మూడు నెలలు అప్పగించాలని డిమాండ్ చేశారు. వారం రోజులైనా, మూడు నెలలు అయినా ఎందుకు అడుగుతున్నారు ? ఎందుకంటే వారం రోజులు కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కు అప్పగిస్తే ప్రాజెక్టులోని నీటిని ఎలా సద్వినియోగంలోకి తేవాలో రేవంత్ కు నేర్పిస్తారట.
అలాగే ఇపుడు ఇరిగేషన్ శాఖను మూడునెలలు ఎందుకు అడుగుతున్నారంటే రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లోని నీటిని+గోదావరి జలాలను ఎలా ఉపయోగించుకోవాలో రేవంత్ కు హరీష్ పాఠాలు నేర్పిస్తారట. అసలు కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిదే కేసీఆర్, హరీష్ వల్ల అని యావత్ తెలంగాణకు ఎప్పుడో అర్ధమైంది. ప్రాజెక్టును నాసిరకంగా నిర్మించిన కారణంగానే ఇపుడు కాళేశ్వరం, మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ళ నీటి నిల్వకు ఉపయోగంలేకుండా పోయిందని ఇరిగేషన్ నిపుణులు కూడా ఎప్పుడో చెప్పేశారు. అధికారంలో ఉన్నపుడు ప్రాజెక్టులను అంత ఘనంగా కట్టిన కేసీఆర్, హరీష్ ఇపుడు తమకు ప్రాజెక్టులను అప్పగిస్తే ఎలా నిర్వహించుకోవాలో చెబుతాము అనటమే ఆశ్చర్యంగా ఉంది.
వీళ్ళ డిమాండ్లు చూసిన తర్వాత అందరిలోను ఒక అనుమానం పెరిగిపోతోంది. అదేమిటంటే ఒక ఆరునెలలు ముఖ్యమంత్రి కుర్చీని కేసీఆర్ కు అప్పగిస్తే తెలంగాణను బంగారు తెలంగాణగా ఎలామార్చాలో చేసిచూపుతాము అని అడుగుతారేమో అని జనాలు చెప్పుకుంటున్నారు.

