
బీఆర్ఎస్ కేంద్రంగా సమీకరణలు మారబోతున్నాయా ?
అవసరమైతే ఈ రెండుపార్టీలు కేసీఆర్ తో చేతులు కలపటానికి సిద్ధంగా ఉన్నాయా అనే సందేహాలు జనాల్లో పెరిగిపోతున్నాయి.
‘రాజకీయాల్లో ఎవరూ శాశ్వత శతృవులు కారు..అలాగని శాశ్వత మిత్రులూ కారు’. ఈ విషయం రాజకీయాలను ఫాలో అయ్యేవాళ్ళకి బాగా తెలుసు. ఇపుడు విషయం ఏమిటంటే క్షేత్రస్ధాయిలో తెలంగాణలో జరుగుతున్న వ్యవహారాలను గమనిస్తున్న వాళ్ళకు పై విషయంపైనే అనుమానంగా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్రంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నేతలు ప్రతిరోజు ఆరోపణలు, ప్రత్యారోపణలతో రెచ్చిపోతున్నారు కాబట్టే. వీళ్ళ ఆరోపణలు, ప్రత్యారోపణలకు సీబీఐ విచారణ వేదికగా మారటమే ఆశ్చర్యంగా ఉంది. ఇటు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, మంత్రులు అటు కేంద్రమంత్రులు బండి సంజయ్, జీ కిషన్ రెడ్డితో పాటు ఎంపీలందరు ప్రతిరోజు చెప్పేది ఏమిటంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు కేసీఆర్ తో పాటు ఆయన కుంటుంబం అత్యంత అవినీతికి పాల్పడింది. అవినీతి జరిగిన అంశాలను కూడా కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రతిరోజు వినిపిస్తునే ఉన్నారు.
రెండుపార్టీల నేతల మాటల్లో కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులందరిపైనా కేసులు నమోదుచేసి, విచారణ జరిపి వెంటనే జైలులో పడేయాలనే డిమాండ్లు వినబడుతున్నాయి. కేసీఆర్ అవినీతికి ఆధారాలున్నపుడు, జైలుకు పంపాలన్న కసి రెండుపార్టీల నేతల్లోను ఉన్నదే నిజమైతే ఇంకా ఎందుకు ఆలస్యం జరుగుతోంది. వెంటనే కేసీఆర్, కొడుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మేనల్లుడు, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తదితరులపైన కేసులు బుక్ చేసి, విచారణ జరిపి జైలుకు ఎందుకు పంపటంలేదు ? ఇప్పుడిదే ప్రశ్న యావత్ తెలంగాణ జనాలకు అర్ధంకావటంలేదు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నట్లే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. అటు కేంద్రప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం తలచుకుంటే కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబాన్ని జైలులోకి తోయటం ఎంతసేపు ?
కేసీఆర్ మీద కాళేశ్వరం, టెలిఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోళ్ళలో అవినీతి, అవకతవకల ఆరోపణలున్నాయి. కేటీఆర్ మీద ఫార్ములా కార్ రేసు కేసులు నమోదు కూడా అయ్యాయి. అలాగే హరీష్ మీద కాళేశ్వరం అవినీతి ఆరోపణలు బలంగా వినబడుతున్నాయి. కాళేశ్వరం అవినీతి, అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్, హరీష్ తదితరుల పాత్రను స్పష్టంగా వివరించింది. కమిషన్ రిపోర్టు ఆధారంగానే కేసీఆర్, కేటీఆర్ పైన కేసులు నమోదుచేసి రాష్ట్ర ప్రభుత్వమే అరెస్టులు చేయచ్చు. కానీ రేవంత్ ప్రభుత్వం ఆపనిచేయటంలేదు.
సీబీఐ విచారణ తీర్మానం ఏమైంది ?
కాళేశ్వరం అవినీతిని నిగ్గు తేల్చటానికి సీబీఐ విచారణ కోరుతు దాదాపు తొమ్మిదినెలల క్రితం తెలంగాణ అసెంబ్లీ తీర్మానం కూడా చేసింది. ఇంతవరకు ఆ తీర్మానానికి అతిగతీలేదు. ఈమధ్యనే కేంద్ర హోంశాఖ మంత్రికి రాష్ట్రప్రభుత్వం సీబీఐ విచారణగురించి రిమైండర్ లెటర్ కూడా వెళ్ళింది. అయినా కేంద్రహోంశాఖ నుండి ఎలాంటి స్పందనా కనబడలేదు. ఈ విషయం ఇలాగుండగానే కేసీఆర్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ళలో కూడా వేలాది కోట్ల రూపాయల అవినీతి జరిగిందని జస్టిస్ మదన్ బీ లోకూర్ కమిషన్ రిపోర్టులో చెప్పింది. ఆ రిపోర్టు ఆధారంగా కేసీఆర్ పైన సీబీఐ విచారణ చేయించాలని రేవంత్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం తీర్మానించింది. మొదటి తీర్మానానికే దిక్కులేదంటే మళ్ళీ రెండో తీర్మానం చేయటంలో రేవంత్ ఉద్దేశ్యం ఏమిటి ? రాష్ట్రప్రభుత్వం సిఫారసుచేసినా కేంద్రం కేసీఆర్ అవినీతిపై సీబీఐ విచారణ చేయించటంలేదని పదేపదే రేవంత్, మంత్రులు బీజేపీపైన ఆరోపణలు చేస్తున్నారు.
ఈ నేపధ్యంలోనే బండి, కిషన్ రాష్ట్రప్రభుత్వంపై ఎదురుదాడులు చేస్తున్నారు. ఏమనంటే కేసీఆర్ అవినీతిపై రాష్ట్రప్రభుత్వమే చర్చలు తీసుకునే అవకాశమున్నా సీబీఐ విచారణకు సిఫారసు చేసి కేంద్ర్రప్రభుత్వాన్ని ఎందుకు వివాదాల్లోకి లాగుతున్నది ? అని నిలదీస్తున్నారు. కేసీఆర్ అవినీతిపై రాష్ట్రప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటంలేదో చెప్పాలంటు డిమాండ్ చేస్తున్నారు. కాళేశ్వరం కేసును కేంద్రానికి అప్పగిస్తే 48 గంటల్లో కేసులు బుక్ చేసి అందరినీ బొక్కలో తోయిస్తామని ఒకపుడు ఇదే బండి సంజయ్ రాష్ట్రప్రభుత్వాన్ని సవాలు చేశారు. అందుకనే రేవంత్ ప్రభుత్వం కాళేశ్వరం అవినీతి కేసును సీబీఐకి అప్పగిస్తు తీర్మానం చేసింది. అసెంబ్లీ తీర్మానం అయిన దగ్గర నుండి బండి, కిషన్ అసలు సీబీఐ విచారణగురించే మాట్లాడటం మానుకున్నారు.
రేవంత్, బండి వైఖరిపై అనుమానాలు
రేవంత్, బండి, కిషన్ వ్యవహారాలను చూస్తున్న వారికి అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఏమనంటే భవిష్యత్తులో మళ్ళీ బీఆర్ఎస్ తో పొత్తు అవసరం పడుతుందేమో అన్న ఆలోచనతోనే కాంగ్రెస్, బీజేపీలు కేసీఆర్ పైన ‘డూప్ ఫైటింగ్’ చేస్తున్నాయా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఎందుకంటే 2023 ఎన్నికల్లో ఓడిపోయినా బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఇప్పటికీ బలంగానే ఉంది. పార్టీకి కమిటెడ్ నేతలు, క్యాడర్ ఉన్నారు. అపారమైన మీడియా, సోషల్ మీడియా బలముంది. కాంగ్రెస్ కు కమిటెడ్ క్యాడర్ ఉంది కాని నేతలు ఎంతమంది కమిటెడ్ గా ఉన్నారన్నది అనుమానమే. ఇక బీజేపీ విషయం చూస్తే కమిటెడ్ నేతలు, క్యాడర్ తక్కువనే చెప్పాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్ లాగ క్షేత్రస్ధాయిలో నేతలు, క్యాడర్ ఉన్న బలమైన పార్టీ కాదు. ఇపుడు బీజేపీలో ఉన్న ఎంపీలు, ఎంఎల్ఏల్లో కొందరు ఇతర పార్టీల్లో నుండి 2023 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి టికెట్ తెచ్చుకుని గెలిచిన వాళ్ళే.
2028 ఎన్నికల్లో త్రిముఖ పోటీ తప్పదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ కూడా పుంజుకుంటే అప్పుడు రాబోయే ఎన్నికలు మూడుపార్టీల మధ్య చాలా గట్టిగా జరుగుతుంది. కవిత పార్టీ తెలంగాణ రక్షణ సేనపై ఇపుడు ఎలాంటి అంచనాలు లేవు. ఉన్న 119 సీట్లను పార్టీలు చీల్చుకుంటే ఏ పార్టీకీ అధికారంలోకి వచ్చేంత మెజారిటి రాకపోతే అప్పుడు పరిస్ధితి ఏమిటి ? అని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆలోచిస్తున్నట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి. అవసరమైతే కాంగ్రెస్-బీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్-బీజేపీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇపుడు తమిళనాడులో ఏమి జరుగుతోందో అందరు చూస్తున్నదే. ఒంటరిగా పోటీచేసిన టీవీకేతో డీఎంకే కూటమిలో కలిసి పోటీచేసిన కాంగ్రెస్ పార్టీ చేతులు కలుపుతుందని ఎవరైనా ఊహించారా ? డీఎంకే-ఏఐఏడీఎంకే కూటములు కలవవు అనే గ్యారెంటీ ఉందా ? రాజకీయాల్లో ఏరోజు ఏమైనా జరగచ్చు చెప్పలేము.
తమిళనాడు పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తే అలాంటి ఆశ్చర్యకరమైన పొత్తులు తెలంగాణలో కూడా జరగకూడదని ఏమీలేదు కదా. 2014కు ముందు ప్రత్యేక తెలంగాణ ప్రకటించకముందు కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్‌ను విలీనం చేస్తానని కేసీఆర్ కాంగ్రెస్ అధిష్ఠానానికి చేసిన ప్రతిపాదన తెలిసిందే. అలాగే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయ్యేందుకు చర్చలు జరిగాయన్న కల్వకుంట్ల కవిత ప్రకటనా అందరికీ తెలిసిందే. సో, ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ దేనితో ఉపయోగం ఉంటుంది అనుకుంటే దానితో కలవటానికి కేసీఆర్ సిద్ధంగా ఉంటారనటంలో సందేహంలేదు. అలాగే అధికారంలో భాగస్వామ్యం దక్కుతుందని అనుకుంటే బీజేపీ కూడా బీఆర్ఎస్‌తో కలవటానికి రెడీ అనే అవకాశాలున్నాయి. ఒకపుడు జమ్మూ, కాశ్మీర్ లో మతత్వపార్టీగా ముద్రపడిన మహబూబా ముఫ్తీ నాయకత్వంలోని పీపుల్స్ డెమక్రటికి పార్టీతో బీజేపీ చేతులు కలిపిన విషయం అందరికీ తెలిసిందే.
అధికారమే టార్గెట్
కాబట్టి అధికారం ముందు సిద్ధాంతాలు పనిచేయవు. అందుకనే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు..శాశ్వత శతృవులు ఉండరనే నానుడి చాలా పాపులరైంది. అవసరాన్నిబట్టి వ్యవహారాలు అటు ఇటు నడిచిపోతుంటాయి. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్, బీజేపీలు కేసీఆర్ తో, కేసీఆర్ విషయంలో డూప్ ఫైటింగ్ చేస్తున్నాయనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఈ విషయం తెలుసుకాబట్టే కేసీఆర్, కేటీఆర్ చాలా కూల్ గా, హ్యాపీగా ఉన్నారు. దమ్ముంటే తమపైన కేసులు పెట్టి అరెస్టుచేసి జైలుకు పంపండని కేటీఆర్ ఎన్నిసార్లు కాంగ్రెస్, బీజేపీలకు సవాళ్ళు విసిరారో లెక్కేలేదు.
రేపు రేవంత్ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగితే ప్రత్యామ్నాయంగా జనాల మొదటి ఛాయిస్ బీఆర్ఎస్ అయ్యేందుకే అవకాశాలు ఎక్కువున్నాయి. ఈ విషయం కాంగ్రెస్, బీజేపీ నేతలకు బాగా తెలుసు. అందుకనే అవసరమైతే ఈ రెండుపార్టీలు కేసీఆర్ తో చేతులు కలపటానికి సిద్ధంగా ఉన్నాయా అనే సందేహాలు జనాల్లో పెరిగిపోతున్నాయి. అందుకనే రాష్ట్రప్రభుత్వ పరిధిలో కేసీఆర్, కేటీఆర్ మీద చర్యలు తీసుకోవటానికి రేవంత్ ఆలోచించటంలేదా అనే టాక్ పెరిగిపోతోంది. అలాగే సీబీఐతో విచారణ చేయించి చర్యలు తీసుకునే విషయంలో బండి కూడా ఆసక్తి చూపించటంలేదు. దీనికి ముఖ్యకారణం ఏమిటంటే కేసులు, విచారణలు, జైలు అంటే జనాల్లో కేసీఆర్ కు సింపథీ పెరిగిపోయి జనాలు బీఆర్ఎస్ వైపు మళ్ళుతారేమో అనే అనుమానాలు రేవంత్, బీజేపీలో ఉండటమే. ఇలాంటి అనేక కారణాలతోనే బీఆర్ఎస్ రాజకీయసమీకరణల్లో కీలకంగా వ్యవహరించబోతోందా అనేఅనుమానాలు పెరిగిపోతున్నాయి. చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

