
కాంగ్రెస్ ‘ఓబిసి కార్డ్’ వర్కవుట్ అవుతుందా?
కాంగ్రెస్ ప్రభుత్వం ఓబిసి వోట్ బ్యాంకు మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. దీని నిదర్శనమే టిపిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ‘100 రోజుల ఓబీసీ హక్కుల గర్జన’ పేరుతో తాము పోరాటం చేయబోతున్నామన్న ప్రకటన. తెలంగాణలో 50 శాతానికి పైగా ఉన్న ఓబీసీ ఓటు బ్యాంకే రాష్ట్రంలో ఏపార్టీ అధికారంలోకి రావాలో నిర్ణయిస్తుంది. అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం ఓబిసి లను తమ వైపు ఆకర్షించడానికి ఈ కొత్త ప్రకటన చేసింది.
ఓబీసీ వర్గాన్ని తమవైపు తిప్పుకోవడానికి ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు కూడా తీవ్రంగానే ప్రయత్నిస్తున్నాయి. బీఆర్ఎస్ తన పదేళ్ల హయాంలో గొర్రెల పెంపకం, చేనేత బంధు, ఆసరా పింఛన్లు, బీసీలలో కులవృత్తులు చేసే వారికి రూ. 1 లక్ష ఆర్థిక సాయం పథకం ద్వారా ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేసినా అంత సక్సెస్ కాలేదు. మరోవైపు బీజేపీ కూడా ‘బీసీ సీఎం’ కార్డ్‌ను ప్రయోగించింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీనే బీసీ ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. ప్రకటించడమే కాకుండా, బండి సంజయ్, ఈటల రాజేందర్, కె.లక్ష్మణ్ వంటి బలమైన బీసీ నాయకత్వాన్ని ముందుకు తెచ్చిన సక్సెస్ కాలేదు.
ఇప్పుడు కాంగ్రెస్ రెండు ప్రతిపక్షాలను కార్నర్‌చేసే వ్యూహాన్ని అమలు చేస్తోంది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కులగణన చేయడానికి వెనుకాడుతోందని, జనాభా లెక్కల్లో ఓబీసీల ప్రస్తావన లేకుండా ద్రోహం చేస్తోందని ఆరోపిస్తూ రాష్ట్ర బీజేపీని ఇరకాటంలో పెట్టే ప్రయత్నాల్లో ఉంది. మరోవైపు కేసీఆర్ ప్రభుత్వం 'సమగ్ర కుటుంబ సర్వే' చేసి ఆ డేటాను తొక్కిపెట్టిందని విమర్శిస్తూ, బిఆర్ఎస్ సామాజిక న్యాయానికి వ్యతిరేకమని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టిన కులగణన మాత్రమే శాస్త్రీయమైనదని దాని ద్వారానే ఓబీసీలకు న్యాయం జరుగుతుందని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గట్టిగా చెబుతున్నారు.
అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు ఈ ‘ఓబీసీ’ అస్త్రం ఎంతవరకు కలసివస్తుందనేది అనుమానమే. ఒకవైపు '22ఏ' భూసమస్యలు, నిరుద్యోగ నిరసనలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ప్రతిపక్షాలు క్షేత్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రాబోయే స్థానిక సంస్థల, కార్పొరేషన్ ఎన్నికలకి ఓబీసీ సెంటిమెంట్ తో కాంగ్రెస్ ప్రజల ఆకర్షించగలదా అన్నది ఆసక్తికరంగా మారింది.

