కరీంనగర్ ‘కమాండర్’ జీవన్ రెడ్డి  ఉత్తర తెలంగాణ వీరుడవుతాడా?
x

కరీంనగర్ ‘కమాండర్’ జీవన్ రెడ్డి ఉత్తర తెలంగాణ వీరుడవుతాడా?

బహిరంగ సభ దాటి బిఆర్ ఎస్ ను ముందుకు నడిపిస్తాడా?


డెబ్బయి అయిదు సంవత్సరాల జీవన్ రెడ్డి రాకతో ఉత్తర తెలంగాణలో భారత రాష్ట్ర సమితి (బిఆర్ ఎస్ ) పునరాగమనం మొదలవుతున్నట్లు అధినేత కె చంద్రశేఖర్ రావు సోమవారం నాడు జగిత్యాల ‘ప్రజా ఆశీర్వాద సభ’ లో ప్రకటించారు. సభకి రెండు వైపుల నుంచి జనాన్ని బాగా తరలించారు.ఈ ప్రకటనకు మంచి స్పందన వచ్చింది.

సభకు పెట్టిన పేరు కూడా ఉత్తర తెలంగాణలో బిఆర్ ఎస్ పరిస్థితికి అద్దం పడుతుంది. బిఆర్ ఎస్ కు ఇపుడు ప్రజల ఆశీర్వాదం కావాలి. జీవన్ రెడ్డి రాకతో ఇది మొదలవుతుందనే ఆశాభావం పార్టీ కార్యకర్తల్లో కలిగించేందుకు కెసిఆర్ ఈ బహిరంగ సభలో బాగా ప్రయత్నించారు. గతంలో జీవన్ రెడ్డి తిట్టిన తిట్లను, శాపనార్థాలను ఆయన తుడిచేసుకున్నారు. జీవన్ రెడ్డి కూడా గతం మర్చిపోయి కెసిఆర్ నాయకత్వంలో రేవంత్ ను తరిమేసేందుకు పాటుపడతానని అన్నారు.

అయితే, ప్రకటన తప్ప కెసిఆర్ ప్రసంగంలో పస కనిపించలేదు. సభలో మాట్లాడతున్నంత సేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ఎత్త లేదు. సాధారణంగా కెసిఆర్ నాలుక చాలా పదునైంది. మాటల తూటాల దాడిలో ఆయనను మించిన వారు లేరు. విమర్శల్లో, తిట్లలో, ఎగతాళి చేయడంలో, నవ్వించడంలో, కవ్వించడంలో కెసిఆర్ కు చాలా కాలం తిరుగులేకుండా ఉండింది. వీటినే ఆస్త్రాలు ప్రయోగిస్తూ కెసిఆర్ పదేళ్లు పరిపాలించారు. దీనికి అడ్డకట్టవేయడంలో ఇద్దరు నాయకులు విజయవంతమయ్యారు. ఇందులో ఒకరు బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్. ఆయన 2020 మార్చి 11 బిజెపి అధ్యక్షుడయ్యారు. మరొకరు ఎనుముల రేవంత్ రెడ్డి. ఆయన 2021 జూన్ 21న పిసిసి అధ్యక్షుడుయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ ఎస్ పరాజయానికి ఈ రెండు తేదీలు చాలా ముఖ్య మయినవి. కెసిఆర్ భాషకు అదే భాషలోనే సమాధానం ఇవ్వడం ఈ తేదీల నుంచి మొదలయింది.

కెసిఆర్ మీద, కెసిఆర్ కుటుంబం మీద ఈగ వాలనీయని రోజుల్లో బండి సంజయ్, రేవంత్ రెడ్డి తిట్ల వర్షంకురిపించారు. కుటుంబాన్ని వివాదంలోకి లాగారు. పేరు పేరున కుటుంబ సభ్యుల అవినీతి గురించి మాట్లాడారు. దీన్ని చూసి తెలంగాణ సమాజం అవాక్కయింది. 2014 నుంచి తెలంగాణ రాజకీయాల్లో బిగ్గరగా వినిపించిన గొంతు కెసిఆర్ ది మాత్రమే. ఆయన సై, చట్టూర ఉన్న జనాలు జై అన్నారు. మరొక గొంతు వినిపించలేదు.

ఆ తేదీలనుంచి మూడు గొంతులు వినిపించాయి.అదీ కూడా బిగ్గరగా. దీనితో ప్రజల చెవి బిఆర్ ఎస్ నుంచి బిజెపి, వైపు కాంగ్రెస్ వైపు మళ్లింది. ప్రజలు వాళ్లు చెప్పిందంతా విన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ ఎప్ ను తిరస్కరించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో కెసిఆర్ కల చెదిరింది. ఒక నాడు కెసిఆర్ ని తీవ్రంగా ఆదరించిన గడ్డ మీద ఆయనకు, ఆయన పార్టీకి తిరస్కారం ఎదురయింది.

ఇలాంటి చొట ఇపుడు మళ్లీ జెండా ఎగరేస్తామని చెప్పేందుకు రెండున్నరేళ్లలో బిఆర్ ఎస్ కు అవకాశమే రాలేదు. ఇపుడు కాంగ్రెస్ ను వదిలేసి జీవన్ రెడ్డి రావడంతో దీనిని ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పునరాగమనం లాగా చిత్రీకరించి, కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు కెసిఆర్ ప్రజాఆశీర్వాద సభలో ప్రయత్నించారు.

“జీవన్ రెడ్డి రాజకీయ దురంధరుడు.ఆయన చాలా ప్రాబల్యం ఉంది. ఆయన రాకతో పార్టీ బలపడుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాలలో కూడా ఆయన కు మంచి పేరుంది,’ అని కెసిఆర్ ప్రకటించారు. అదే జగిత్యాలో 2023లో జీవన్ రెడ్డి పలుకుబడి పనిచేయలేదు.అక్కడ 2018,2019లో బిఆర్ ఎస్ అభ్యర్థిగా డాక్టర్ సంజయ్ కుమార్ గెలిచాడు. ఆయన 2013 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లోకి దూకడం, ముఖ్యమంత్రి ఆయనకు ప్రాముఖ్యం ఇవ్వడాన్ని జీవన్ రెడ్డి జీర్నించుకోలేకపోయారు. ఆ అంసతృప్తే చివరకు ఈ ‘ప్రజా ఆశీర్వాద సభ’కు దారి తీసింది. ఇపుడు ఆ జీవన్ రెడ్డి ఉత్తర తెలంగాణ ఆశాదీపం అవుతున్నాడు. జీవన్ రెడ్డి బుజ్జగించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనస్ఫూర్తిగా పనిచేయలేదన్న విమర్శ కాంగ్రెస్ సర్కిల్స్ లో ఉంది. ఇదే వేరేవిషయం.

జగిత్యాల సంగతేందో లోకల్ లీడర్లకు వదిలేసి కరీంనగర్ కేంద్రంగా ఆదిలాబాద్, నిజామా బాద్ జిల్లాను జయించుకు రమ్మని కెసిఆర్ ఆయన్ని పురమాయించారు. తానూ జీవన్ రెడ్డి అన్నదమ్ముల్లా ఈ ప్రాంతంలో పనిచేస్తామని కెసిఆర్ చెప్పారు.

ఉత్తర తెలంగాణలో బిఆర్ ఎస్ పరిస్థితి

ఉత్తర తెలంగాణని 2023లో కాంగ్రెస్ సుడిగాలిలా చుట్టుముట్టింది. కాంగ్రెస్ పార్టీకి కెసిఆర్ ముఖ్యమంత్రిగా చాలా సార్లు డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇక శవం లేవదన్నారు. అయితే, ఇది తారుమారయింది. కాంగ్రెస్ లేవడమే కాదు, గర్జించింది. ఉత్తర తెలంగాణకు కెసిఆర్ చేతి నుంచి లాగేసుకుంది. అదేలా జరిగిందో చూద్దాం.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా (13 స్థానాలు)ని తీసుకుందాం. ఇక్కడ 2014 ఎన్నికల్లో, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఒకే ఒక్క సీటు. 2023లో కెసిఆర్ కంచుకోట అయిన ఈ జిల్లాలో కాంగ్రెస్ కు 8 సీట్లు వచ్చాయి. బిఆర్ ఎస్ 12 సీట్లనుంచి 5 సీట్లకు పడిపోయింది. ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి.

ఆదిలాబాద్ జిల్లాలో(10) 2014లొ బిఆర్ ఎస్ కు 9 సీట్లుండేవి. 2018లో ఏడు సీట్లుకు తగ్గాయి. 2023 ఇది 2కు పడిపోయింది. మిగతా 8 లో కాంగ్రెస్ కు నాలుగు వస్తే, బిజెపికి నాలుగు సీట్లు లాక్కుంది.

ఇక నిజామా బాద్ జిల్లా(9) మీద 2018 మొత్తం పట్టు అంతా బిఆర్ ఎస్ దే. 2014లో ఇక్కడ కాంగ్రెస్ ఒకే సీటు వచ్చింది. 2018లో అది పోయింది. మొత్తం 9 స్థానాలు బిఆర్ ఎస్ వే. అలాంటి చోట 2023లో కాంగ్రెస్ కు నాలుగు సీట్లు వచ్చాయి. బిజెపికి మూడు దక్కాయి. బిఆర్ ఎస్ కు మిగిలింది 2 మాత్రమే.

వరంగల్ విషయానికి వస్తే, 2023లో కాంగ్రె స్ ప్రభంజనం సృష్టించింది. ఈ జిల్లాలో 12 స్థానాలున్నాయి. 2014లో ఇందులో 10 స్థానాలు బిఆర్ ఎస్ ది. రెండు స్థానాల్లో మాత్రం కాంగ్రెస్ గెలిచింది. 2018లో బిఆర్ ఎస్ శక్తి 8 కి పడిపోయింది. ఉన్నరెండింటిలో కాంగ్రెస్ ఒకటి కోల్పోయింది. మిగతా స్థానాలు ఇతరులకు పోయాయి. అయితే, 2023లో కాంగ్రెస్ పది స్థానాలు గెల్చుకుని బిఆర్ ఎస్ కు రెండంటే రెండే మిగిలించింది.

ఇక ఖమ్మం జిల్లా (10)లో బిఆర్ ఎస్ ఎపుడూ బలహీనమే. 2014లో గాని, 2018 లో గాని బిఆర్ ఎస్ బలగం 1 కి మించలేదు. ఇక్కడ కాంగ్రెస్ దే హవా. 2014లో కాంగ్రెస్ కు ఆరు స్థానాలుండేవి. 2018 లో ఇవి 4కు పడిపోయాయి. 2013 కాంగ్రెస్ విజృంభించి పదింటిలో 8 స్థానాలు గెల్చుకుంది.

మొత్తంగా ఉత్తర తెలంగాణ పరిస్థితి చూస్తే అక్కడ ఉన్న 54 స్థానాల్లో బిఆర్ ఎస్ కు వచ్చింది కేవలం 11 స్థానాలే. 34 స్థానాలు గెల్చుకుని కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఒక చోట కాంగ్రెస్ మిత్రపక్షంగా సిపిఐ గెలిచింది. బిజెపి ఏడు స్థానాలు గెల్చుకుంది. రాష్ట్రంలో బిజెపికి ఉన్న 8 సీట్లలో 7 ఉత్తర తెలంగాణవే.

ఈ దారుణమయిన పరిస్థితి మారుతుంది అని చెప్పేందుకు బిఆర్ ఎస్ కు ఇంతవరకు ఒక్క అవకాశం కూడా రాలేదు. గాలి మళ్లింది అని చెప్పేందుకు ఒక ఉదాహరణ కనిపించలేదు. దానికి తోడు పార్టీ మునుపటి సంస్థలాగా బలంగా లేదు. పార్టీ నుంచి, కుటుంబం నుంచి కల్వకుంట్ల కవిత దూరం జరిగింది. కుటుంబ రహస్యాలను బయటపెట్టింది. అవినీతి మయం అని కెటిఆర్ ను, హరీష్ రావును, సంతోష్ రావును వేలెత్తి చూపింది. ఇపుడు సొంతంగా పార్టీ పెట్టి తెలంగాణ పోరాట వారసత్వం తనదే అని చాటుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంది.

ఇక ఈ ప్రాంతంలో బండి సంజయ్ కేంద్ర మంత్రిగా కెసిఆర్ రాకుండా అడ్డుకునేందుకు చూస్తున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కెసిఆర్ ను ఇక సభలో కాలుపెట్టలేడు, పెట్టనీయను అంటున్నాడు. ఇలా కాంగ్రెస్, బిజెపిలు తొడగొడుతున్నపుడు కెసిఆర్ కు 75 సంవత్సరాల జీవన్ రెడ్డి ‘కారు చీకట్లో కాంతి రేఖ’లా కనిపిస్తున్నాడు. కాంతి రేఖ అవునో కాదో కాని, కెసిఆర్ ని ఫామ్ హౌస్ నుంచి జగిత్యాల కి రప్పించాడు. ఒక ఏడాది తర్వాత ఒక బహిరంగ సభ వేదిక ఏక్కేలా చేశాడు. క్యాడర్ లో ఉత్సాహం నింపేందుకు నాలుగు ముక్కలు మాట్లాడేలా చేశాడు. అపుడపుడు కెసిఆర్ బయటతిరుగుతాడు అనే నమ్మకం కల్పించాడు.

అయితే, 2023 ఎన్నికల ముగిసిన రెండున్నరేళ్లయింది. దర్యాప్తులు,కుటుంబ వివాదాలు ఒక వైపు. మరొక వైపు పెరిగిన హోదా. రేవంత్ రెడ్డి బిఆర్ ఎస్ నేత కెసిఆర్ ని వదలేది లేదంటున్నాడు. ఇదే సమయంలో కెసిఆర్ ఫైర్ చల్లారినట్లు కనిపిస్తున్నది. జగిత్యాలలో ఆయన రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి అనే మాటలు రాకుండ జాగ్రత్త పడ్డారు. ఎందుకంటే, కెసిఆర్ ఒక మాట అంటే రేవంత్ పది మాటలనేంత బలవంతుడయ్యాడు. కెసిఆర్ దీనిని గమనించినట్లున్నారు.

ఇలాంటపుడు జీవన్ రెడ్డి ఈ ప్రాంతంలో బిఆర్ ఎస్ ను నడిపించాలి. సాధ్యమా. కెసిఆర్ కుటుంబం అంతస్వేచ్ఛ ఆయనకు ఇస్తుందా? అనుమానమే. కాంగ్రెస్ నుంచి బిఆర్ ఎస్ లోకి వెళ్లిన సీనియర్ నాయకులెవరికి కెసిఆర్ రాజకీయ నాయకత్వం ఇవ్వలేదు. కొన్ని పదవులు ఇస్తే ఇచ్చి ఉండవచ్చుగాని, రాజకీయ నాయకత్వం ఇవ్వలేదు. డాక్టర్ కేశవరావుని పార్టీ సెక్రెటరీ జనరల్ చేశాడు, రాజ్యసభ ఎంపి చేశాడు. ఇలా పదవులిచ్చాడు తప్ప రాజకీయనాయకత్వం ఇవ్వలేదు. మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అపుడుపుడు తెలంగాణ భవన్ లో కనిపిస్తాడు. బిఆర్ ఎస్ లో తన హోదా ఏ మిటో తెలుసు కాబట్టి సురక్షితమయిన సోషల్ మీడియాకు పరిమితమయ్యాడు. మరొక మాజీ పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కు రాజ్య సభ ఇచ్చి నోరు మూయించారు. కెసిఆర్ తో ఆయన స్నేహం ఎక్కువ కాలం నిలువలేదు. ఈ హిస్టరీ ని బట్టి చూస్తే జీవన్ రెడ్డి రాకతో ఒక బహిరంగ సభ ఏర్పాటుచేసేందుకు కెసిఆర్ ఒక అవకాశం వచ్చింది. మంచివాడు సింపుల్ మనిషి, జనం మనిషి అని పేరున్న జీవన్ రెడ్డికి పార్టీ జనరల్ సెక్రెటరీ అనే పదవయితే దక్కింది. హిస్టరీ చూస్తే పదవి తప్ప మిగతా దంతా మిథ్య అనిపిస్తుంది.

“నేనేదో ఆశించి రాలేదు తెలంగాణకు పట్టుకున్న శని పోవాలి, అది కేసీఆర్ గారి నాయకత్వంతోనే సాధ్యం అనినమ్మి బీఆర్ఎస్ పార్టీలో చేరాను,’ అని జీవన్ రెడ్డి ప్రకటిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ మీద నిప్పులు చెరిగారు. అదే బిఆర్ ఎస్ కు కావాలి. ఇది బిఆర్ ఎస్ కు వీనుల విందుగా ఉంటుంది. ఇంతవరకు రేవంత్ ని ఆయన జగిత్యాల నుంచి తిట్టే వాడు. ఇపుడు రాజధాని నడిబొడ్డున ఉన్న ‘తెలంగాణ భవన్’ నుంచి తిట్టవచ్చు. ఇంతకు మించి ఆయన బిఆర్ ఎస్ ని ఎంత ముందుకు తీసుకువెళ్తాడో చూడాలి.


Read More
Next Story