కవిత ఐదుహామీలు అమలయ్యేవేనా ?
x

కవిత ఐదుహామీలు అమలయ్యేవేనా ?

ఐదు హామీల్లో ఒక్కటి తప్ప మిగిలిన నాలుగు ఆచరణ సాధ్యంకాదన్న విషయం అందరికీ తెలుసు


ఆచరణ సాధ్యంకాని హామీలను ఇవ్వటం రాజకీయపార్టీలకు, నేతలకు బాగా అలవాటైపోయింది. తమ హామీలు ఆచరణలోకి వచ్చేవి కావని తెలిసినా జనాల మీదున్న నమ్మకంతో నేతలు చాలా హామీలను గుప్పిస్తుంటారు. ఇపుడు ఇదంతా ఎందుకంటే శనివారం కల్వకుంట్ల కవిత తన కొత్తపార్టీని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సేన అని కొత్తపార్టీ పేరును ప్రకటించిన కవిత తన భవిష్యత్ అజెండాను కూడా ప్రకటించారు. బహిరంగ సభలో మాట్లాడుతు విద్య, వైద్యం, వ్యవసాయం, యువత, సామాజిక తెలంగాణ సాధనపై పెద్ద హామీలే గుప్పించారు. ఈ ఐదు హామీల్లో ఒక్కటి తప్ప మిగిలిన నాలుగు ఆచరణ సాధ్యంకాదన్న విషయం అందరికీ తెలుసు.

ఇంతకీ కవిత చెప్పినట్లుగా మొదటిది విద్యగురించి చూస్తే విద్యార్ధులందరికీ ఉచిత విద్యను అందిస్తానని చెప్పారు. ప్రైవేటు సంస్ధల్లో కూడా పిల్లలకు ఉచిత విద్యను అందిస్తానని అన్నారు. వైద్యం గురించి మాట్లాడుతు ఏ రోగమైనా రానీ, ఏ ఆసుపత్రి అయినా కాని పూర్తిగా ఉచిత వైద్యం అందిస్తానని హామీ ఇచ్చారు. ఇక వ్యవసాయం గురించి మాట్లాడుతు రైతును నిజంగానే రాజును చేస్తానని ప్రకటించారు. యువత గురించి మాట్లాడుతు రు. 2 లక్షల నుండి 20 కోట్ల వరకు యువత ఉపాధి కల్పించేందుకు పంపిణీ చేస్తానని చెప్పారు. చివరగా సామాజిక తెలంగాణ సాధిస్తానని చెప్పటమే విడ్డూరంగా ఉంది.

ఒక్కో హామీగురించి మాట్లాడుకుంటే విద్యార్ధులందరికీ ప్రైవేటు స్కూళ్ళల్లో కూడా ఉచిత విద్యను అందిస్తానని చెప్పారు. నిజంగా ఈహామీ ఆచరణ సాధ్యమేనా ? ప్రభుత్వం చెబితే ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యాలు ఎందుకు ఉచితంగా చదువు చెబుతాయి. ఇప్పటికి చాలా ప్రభుత్వాలు ఈ హామీని ఇచ్చి తర్వాత గాలికి వదిలేశాయి. ఎందుకంటే ఈ హామీ వినటానికి మాత్రమే తప్ప ఆచరణలో సాధ్యంకాదు. యాజమాన్యాలు స్కూళ్ళను పెట్టుకునేది పిల్లలందరికీ ఉచితంగా పాఠాలు చెప్పటానికా ? విద్య బాగా లాభసాటి వ్యాపారం అయిపోయిన ఈరోజుల్లో ఉచితంగా ఏ యాజమాన్యం పిల్లలను చేర్చుకోదు. ప్రైవేటు స్కూళ్ళు అని చెప్పిన కవిత మరి కార్పొరేట్ స్కూళ్ళు, అంతర్జాతీయ స్కూళ్ళను ఎందుకు వదిలేశారో తెలీటంలేదు.

తర్వాత వైద్యం గురించి మాట్లాడుకుంటే ఏ రోగమొచ్చినా, ఏ ఆసుపత్రి అయినా పూర్తిగా ఉచిత వైద్యం చేయిస్తానని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఉద్దేశ్యమే అదికదా. కొత్తగా కవిత ఉచిత వైద్యం గురించి చెప్పేదేముంది ? అమల్లో ఉన్న ఆరోగ్యశ్రీ పథకం కన్నా తాను మెరుగ్గా పథకాన్ని అమలుచేయాలని అనుకుంటే ఆ విషయాన్నే చెప్పవచ్చు. వ్యవసాయం గురించి మాట్లాడుతు రైతును నిజంగా రాజును చేస్తానని చెప్పారు. నిజ్జంగా ఇది జరిగే పనేకాదు. రైతు ఎప్పటికీ రాజు కాలేడు. రైతును రాజు చేయక్కర్లేదు, రైతులు పెట్టుకున్న గోచీని లాగేయకుండా ఉంటే అదేచాలు. రైతులు తాము రాజులం అవ్వాలని ఎప్పుడూ కోరుకోలేదు. రైతులు కోరుకునేది ఏమిటంటే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పంటలకు గిట్టుబాటు ధరలు, 24 గంటలూ విద్యుత్ సరఫరా అంతే.

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించటంలో భాగంగా రు. 2 లక్షల నుండి రు. 20 కోట్ల వరకు రుణాలు అందిస్తానని చెప్పారు. కవిత ముఖ్యమంత్రి అయితే అప్పటికి రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి ఎలాగుంటుందో ఎవరూ చెప్పలేరు. ఇప్పటికే రాష్ట్రం లక్షల కోట్లరూపాయల అప్పుల్లో నిండా ముణిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి యువతకు లక్షల రూపాయలు, కోట్లరూపాయల రుణాలిస్తామని చెప్పటానికి, వినటానికి మాత్రమే బాగుంటుంది ఆచరణలోకి వచ్చేసరికే సమస్యలు ఎదురవుతాయి. చివరగా సామాజిక తెలంగాణ సాధిస్తానని కవిత చెప్పారు. అసలు సామాజిక తెలంగాణ అంటే ఏమిటో చెప్పాలి. పేద-ధనిక తేడాలేని సమాజాన్ని ఏర్పాటుచేయటమే కవిత ఉద్దేశ్యమా ? లేకపోతే కులాల మధ్య అంతరాలు లేని సమాజాన్ని సాధించటమా ? లేకపోతే జనాభా దామాషా పద్దతిలో అన్నీ కులాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించటమా ? అన్న విషయంలో క్లారిటి ఇవ్వలేదు.

చాలా సింపుల్ గా సామాజిక తెలంగాణ అనే నినాదాన్ని ఇస్తే సరిపోదు. సమాజంలో ఏదో రూపంలో మనుషుల మధ్య అంతరాలు ఉండటం చాలా సహజం. కాబట్టి సామాజికతెలంగాణ ఏర్పాటు నినాదాలకు మాత్రమే పరిమితమవుతుంది కాని ఆచరణలో సాధ్యంకాదని కవితకు కూడా బాగా తెలుసు. సో, ఏ కోణంలో చూసినా పార్టీ ఏర్పాటు సందర్భంగా కల్వకుంట్ల కవిత ప్రకటించిన ఐదు హామీల్లో నాలుగు ఏ రకంగా కూడా ఆచరణ సాధ్యంకాదు. ముందు ముందు కవిత ఇంకెన్ని హామీలను ప్రకటిస్తారో చూడాల్సిందే.

Read More
Next Story