కాంగ్రెస్ కు హ్యాట్రిక్ విజయం సాధ్యమేనా ?
ఉపఎన్నిక ఖాయమవ్వటంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, టీఆర్ఎస్, జనసేన పార్టీల్లో అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ ఊపందుకున్నది.
హ్యాట్రిక్ విజయంపై కాంగ్రెస్ పార్టీ దృష్టిపెట్టింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరిగాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్ది లాస్య నివేదిత నెల రోజుల తర్వాత రోడ్డు ప్రమాదంలో మరణించింది. అనివార్యమైన ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసిన శ్రీగణేష్ గెలిచాడు.
తర్వాత కొంతకాలానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎంఎల్ఏ మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో మరణించిన తర్వాత జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి అనీల్ కుమార్ యాదవ్ గెలిచాడు. ఈ రెండు ఉపఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కు సింపథి ఏమాత్రం వర్కవుట్ కాలేదు. ఇపుడు ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎంఎల్ఏ దానం నాగేందర్ ఫిరాయింపుల కారణంగా హైకోర్టు అనర్హత వేటువేసింది.
హైకోర్టుతీర్పు కారణంగా తొందరలోనే ఉపఎన్నిక జరగబోతోంది. ఉపఎన్నిక ఖాయమవ్వటంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, టీఆర్ఎస్, జనసేన పార్టీల్లో అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ ఊపందుకున్నది. ఎన్నికలకమిషన్ నోటిఫికేషన్ ఇచ్చే సమయానికి ఏపార్టీ తరపున ఎవరు పోటీచేస్తారనే విషయంలో క్లారిటి వచ్చే అవకాశముంది. ఇపుడు చాలామంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ఎవరనే విషయంపైనే మాట్లాడుకుంటున్నారు.
ఎందుకంటే హస్తంపార్టీ తరపున మళ్ళీ దానం నాగేందరే పోటీచేస్తారా ? లేకపోతే దానంను పక్కనపెట్టి మరో సీనియర్ను రంగంలోకి దింపుతారా అనే చర్చలు జరుగుతున్నాయి. టికెట్ కోసం దానం, హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, గతంలో పోటిచేసి ఓడిపోయిన విజయారెడ్డితో పాటు చాలామంది ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మొదటి రెండు ఉపఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ మూడో ఉపఎన్నికలో గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదుచేస్తుందా అనే విషయమై ఉత్కంఠ పెరిగిపోతోంది.

