విజయ్ ను గెలిపించింది మహిళలు, జెన్ జీ ఓట్లేనా  ?
x
TVK chief Vijay

విజయ్ ను గెలిపించింది మహిళలు, జెన్ జీ ఓట్లేనా ?

19-40 ఏజ్ గ్రూప్ జనాల్లో ముఖ్యంగా అమ్మాయిలు, మహిళల్లో అత్యధికులు టీవీకేకి ఓట్లేసినట్లు అర్ధమవుతోంది


ఒక్కోసారి ఇలా జరుగుతుంటాయి. కాని ఎగ్జిట్ పోల్ సర్వేల జోస్యం 99శాతం తప్పని తేలటం మాత్రం చాలా అరుదనే చెప్పాలి. అలాంటి అరుదైన ఘటన సోమవారం తమిళనాడులో జరిగింది. 234 నియోజకవర్గాల తమిళనాడు అసెంబ్లీలో 8 సంస్ధలు ఎగ్జిట్ పోల్స్ సర్వేలను వెల్లడించాయి. అందులో ఏడు సంస్ధలు డీఎంకే కూటమి లేదా ఏఐఏడీఎంకే కూటమి అధికారంలోకి వస్తాయని ప్రకటించాయి. ఇందులో కూడా కొన్ని డీఎంకే కూటమికే మళ్ళీ అధికారం అని ప్రకటించిన సంస్ధలుండాగా మరికొన్ని సంస్ధలు మాత్రం ఏఐఏడీఎంకే కూటమి అధికారంలోకి వచ్చేస్తుందని జోస్యంచెప్పాయి. అయితే ఒకే ఒక్క సంస్ధ మాత్రం సినీనటుడు విజయ్ నాయకత్వంలోని టీవీకే పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పింది. మిగిలిన సంస్ధలు, జనాలు ఆ పార్టీ జోస్యాన్ని చూసి నవ్వాయి. చివరకు ఆ పార్టీ చెప్పిందే నిజమని తేలితే మిగిలిన పార్టీల ఎగ్జిట్ పోల్స్ సైలెంటుగా ఎగ్జిట్ అయిపోయాయి.

ఇపుడు విషయం ఏమిటంటే తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే దూసుకుపోతోంది. 110 సీట్లలో మెజారిటితో నెంబర్ వన్ స్ధానంలో టీవీకే ఉండగా ఏఐఏడీఎంకే కూటమి 73 సీట్లతో రెండోస్ధానంలోను, 53 సీట్లలో ఆధిక్యంతో డీఎంకే కూటమి మూడో స్ధానంలో ఉంది. అధికారాన్ని అందుకునేందుకు కావాల్సిన మ్యాజిక్ మార్క్ 117 సీట్లు దాటడం. అంటే 118 సీట్లను సాధించిన పార్టీ లేదా కూటమికి అధికారం ఖాయం. అధికారానికి కేవలం 8 సీట్ల దూరంలో మాత్రమే విజయ్ ఉన్నందువల్ల కచ్చితంగా హంగ్ వస్తుందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఏ కూటమి లేదా చిన్నా చితకా పార్టీలు మద్దతుతో అయినా విజయ్ సీఎం అవటం ఖాయమనే సంకేతాలు బలంగా కనబడుతున్నాయి.


ఇపుడు విషయం ఏమిటంటే చాణక్య స్ట్రాటజీస్ డీఎంకే కూటమి 160 సీట్లతో అధికారంలోకి రావటం ఖాయమనిచెప్పింది. ఏఐఏడీఎంకే కూటమికి 65 సీట్లు, టీవీకేకు 18 సీట్లు, ఇతరులకు 8 సీట్లు వస్తాయని చెప్పింది. అలాటే పీపుల్స్ పల్స్ అనే సంస్ధ డీఎంకే కూటమికి 145 సీట్లు, ఏఐఏడీఎంకే 80, టీవీకే 24, అదర్స్ 6 సీట్లు గెలుస్తారని చెప్పింది. ఇంకో సంస్ధ ప్రజాపోల్ డీఎంకే కూటమి 168 సీట్లు, ఏఐఏడీఎంకే కూటమి 81, టీవీకే 9 సీట్లలో గెలుస్తాయని అంచనా వేసింది. పల్స్ టుడే అనే మరో సంస్ధుంది. ఇది డీఎంకే కూటమికి 170 సీట్లు, ఏఐఏడీఎంకే కూటమి 70 సీట్లు, టీవీకే 8 సీట్లలో గెలిచే అవకాశముందని చెప్పింది. ఎస్ఏఎస్ గ్రూప్ డీఎంకే కూటమి 141 సీట్లు, ఏఐఏడీఎంకే కూటమికి 90, టీవీకేకి 8 సీట్లు, అదర్స్ ఒక్కచోట గెలుస్తారన్నది. పోల్ ల్యాబ్ అని మరో సంస్ధ ఉంది. దీని ప్రకారం డీఎంకే కూటమి 140 సీట్లలో, ఏఐఏడీఎంకే కూటమి 85 చోట్ల, అదర్స్ 14 సీట్లలో గెలుస్తారని అంచనా వేసింది. ఈ సంస్ధ టీవీకేను అసలు లెక్కలోకే తీసుకోలేదు. బీకాన్ ఆర్గనైజేషన్ అనే సంస్ధ డీఎంకే కూటమికి 124 సీట్లు, ఏఐఏడీఎంకే కూటమి 91 చోట్ల, టీవీకే 21 స్ధానాల్లో గెలుస్తుందని జోస్యం చెప్పింది. చివరగా యాక్సిస్ మై ఇండియా అనే సంస్ధ టీవీకే 98 సీట్లతో అధికారంలోకి రాబోతోందని చెప్పింది.

అన్నీ సర్వేలు వెలువడిన తర్వాత పోటీ సంస్ధల ప్రతినిధులే కాదు చివరకు మెజారిటీ మీడియా యాజమాన్యాలు, చాలామంది విశ్లేషకులు యాక్సిస్ మై ఇండియా జోస్యాన్ని చూసి నవ్వారు. చివరకు ఏమైందంటే యాక్సిస్ మై ఇండియా చెప్పిన జోస్యమే నిజమైంది. టీవీకే లాంటి పార్టీలను ‘డార్క్ హార్సెస్’ అనంటారు. డార్క్ హార్స్ అంటే ఎవరికీ పట్టని, ఎవరూ పట్టించుకోని గుర్రాలన్నమాట. ఈ పదం గుర్రపుపందేలకు సంబంధించిన పదం. పలానా గుర్రం గెలుస్తుందని చాలామంది పందేలు కాస్తారు. ఎవరికీ పట్టని, ఎవరూ పట్టించుకోని గుర్రం పందెం గెలవటాన్ని డార్క్ హార్స్ అని అంటారు. తమిళనాడు ఎన్నికల్లో కూడా టీవీకే పార్టీ డార్క్ హార్స్ లాంటిదే అని అర్ధమైంది. ఎవరు ఊహించనట్లుగా పోలింగ్ రోజున ఒక్కసారిగా జనాలు విజయ్ పార్టీకి ఓట్లేసి గెలిపించారు. అందరి దృష్టి డీఎంకే కూటమి లేదా ఏఐఏడీఎంకే కూటమి మీదుంటే విజయ్ నాయకత్వంలోని టీవీకే సైలెంటుగా తన పని కానిచ్చేసుకుంది.

టీవీకే సాధించిన ఈ అద్భుత విజయాన్నే మిగిలిన పార్టీలు చాలామంది విశ్లేషకులు నమ్మలేకపోతున్నారు. కాని నమ్మకం వేరు నిజం వేరన్న విషయం చాలామందికి తొందరగా జీర్ణంకాదు. సంప్రదాయ రాజకీయాలతో విసిగిపోయిన తమిళజనాలు చాలా సైలెంటుగా జెన్ జీ తరంతో పాటు జెన్ జీ తరానికి ముందుతరం ప్రతినిధి అయిన విజయ్ కు మద్దతుగా నిలిచినట్లు అర్ధమవుతోంది. 19-40 ఏజ్ గ్రూప్ జనాల్లో ముఖ్యంగా అమ్మాయిలు, మహిళల్లో అత్యధికులు టీవీకే ఓట్లేసినట్లు అర్ధమవుతోంది. పైన చెప్పిన ఏజ్ గ్రూప్ మొత్తం ఓటర్లలో 42శాతం ఉన్నారు. మహిళలు, యువతను నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ మోసపోరని మరోసారి తాజా ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. ఇక మిగిలింది నమ్మకాన్ని విజయ్ నిలబెట్టుకోవటమే.

Read More
Next Story