చంద్రుడిపై మరకలంటిస్తారా?
మరో ఐదు నెలల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నసమయంలో అధికార,ప్రతిపక్షపార్టీల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం తారాస్థాయికి చేరింది.

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు గత రెండు మూడు నెలలుగా క్షణ క్షణానికీ మారుతున్నాయి. ముఖ్యంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ-ప్రతిపక్ష తెలుగుదేశంపార్టీల మధ్య గత నాలుగున్నరేళ్లుగా మాటల యుద్ధమే నడిచింది కానీ ఇప్పుడా పరిస్థితి చేయి దాటిపోయింది. నేరుగా కేసుల నమోదు స్థాయికి చేరుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారపార్టీపై నిప్పులు చెరుగుతున్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై ఏపీ సీఐడీ అధికారులు 371 కోట్ల రూపాయల స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించినే కేసులో సెప్టెంబరు 9వ తేదీ అర్థరాత్రి కర్నూలు జిల్లా నంద్యాలలో ముందస్తుగా అరెస్టు చేసి, ఆపై జ్యూడీషియల్ కస్టడీ. చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. కేవలం ఒక్క కేసుతోనే ఏపీ సీఐడీ అధికారులు ఆగలేదు.. తాజాగా మరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ఆయన ఇరుక్కున్న కేసులు ఆరుకు చేరుకున్నాయి.
మరో ఐదు నెలల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నసమయంలో అధికార-ప్రతిపక్షపార్టీల మధ్య జరుగుతున్న ప్రశ్చన్న యుద్ధం తారాస్థాయికి చేరిందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
మాజీ సీఎం చంద్రబాబుపై సిఐడి అధికారులు ఇప్పటి వరకూ ఆరు (6) ఎఫ్ఐఆర్‌లు
అవినీతి నిరోధక న్యాయస్థానం (ఎసిబి) కోర్టులో ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సిఐడి) దాఖలు చేసిన పిటిషన్లు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిపై అవినీతి ఆరోపణలపై మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని అధికారపార్టీకి చెందిన సీనియర్ నేతలు చెబుతున్నారు. ఆరోగ్యకారణాలతో అక్టోబరు 31న చంద్రబాబుకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ హైకోర్టు 4 వారాల పాటు మద్యంత బెయిల్ ఇచ్చింది. నవంబరు 20న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లిఖార్జున రావు పూర్తి బెయిల్ మంజూరు చేశారు. చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో నవంబరు 28న సుప్రీం కోర్టు చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది.
ఒకవైపు సీఐడీ అధికారులు కేసులు నమోదు చేస్తుంటే.. చంద్రబాబు మాత్రం కేబినేట్ నిర్ణయాల ప్రకారమే తాను ప్రభుత్వాధిపతి హోదాలో నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని వాదిస్తున్నారు. తనపై కేసులు నమోదు చేయడానికి ముందు అనుమతులు ఇచ్చిన సీనియర్ ఐఏఎస్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వాదిస్తున్నారు. అలాగే తనపై అవినీతి అక్రమాలకు సంబంధించిన కేసులు నమోదు చేయాలంటే రాష్ట్ర గవర్నర్ అనుమతి తీసుకోవాలంటూ కొత్త అంశాన్ని లేవనెత్తారు. సెక్షన్ 17-ఏ (Section 17-A) ప్రకారం తనపై అవినీతి కేసులు నమోదు చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి అని, అందుకు విరుద్ధంగా ఏపీ సీఐడీ అధికారులు కేసులు నమోదు చెల్లదంటున్నారు. ఈ అంశం ఇప్పుడు సుప్రీం కోర్టులో తీర్పు కోసం పెండింగ్‌లో ఉంది. ఈనెల 8వ తేదీన సుప్రీం కోర్టు సెక్షన్ 17-ఏ పై తీర్పు వెల్లడించనుంది.
ఇప్పుడు సెక్షన్ 17ఏ అన్నది రాష్ట్రంలో హాట్ టాపిక్ అయిపోయింది. గడచిన 32 రోజులుగా ఈ సెక్షన్‌కు అనుకూలంగా చంద్రబాబు లాయర్లు, వ్యతిరేకంగా సీఐడీ లాయర్లు అనేక కోర్టుల్లో హోరాహోరీగా వాదులాడుతున్నారు. ఏదైనా నేరం చేసినప్పుడు అంటే.. అవినీతికి పాల్పడినప్పుడు ప్రజాప్రతినిధులను అరెస్టు చేయాలంటే సెక్షన్ 17ఏ ప్రకారం ముందుగా గవర్నర్ అనుమతిని తీసుకోవాలన్నది చంద్రబాబు లాయర్ల వాదన.
1. ఉచిత ఇసుక పాలసీ కేసు
నవంబర్ 1న చంద్రబాబు నిందితుడుగా నంబర్ 2 (ఎ2)గా సిఐడి కేసు నమోదు చేసి మరో కేసు నమోదు చేసింది.
రాష్ట్ర గనులు, భూగర్భఖనిజాల శాఖ డైరెక్టర్ ఫిర్యాదుతో సీఐడీ అధికారులు ఈ కేసు నమోదు చేశారు. చంద్రబాబు నాయుడుతో పాటు ఇద్దరు మాజీ మంత్రులు పీతల సుజాత, దేవినేని ఉమామహేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ఆరోపణలు ఉన్నాయి. 2016లో చంద్రబాబు ప్రభుత్వం అప్పటి ఇసుక విధానాన్ని రద్దు చేసి, ఇది ఉచిత ఇసుక విధానాన్ని తీసుకువచ్చింది. ఇది అక్రమ ఇసుక తవ్వకాలకు గేట్లను ఎత్తివేసిందని, ఉచిత ఇసుక పాలసీతో ఉన్నత స్థానాల్లో ఉన్నవారికి ప్రయోజనం చేకూరిందన్న ఆరోపణలున్నాయి. ఇసుక రీచ్లను ఏపీ మినిస్టీరియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు అప్పగించాలని, అది మహిళా సమాఖ్యలకు కేటాయించడంతో అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయని సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. అలాగే ఎలాంటి ఛార్జీలు లేకుండా ప్రజల నివాస గృహాల నిర్మాణ అవసరాల పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేది సీఐడీ అధికారులకు అందిన ఫిర్యాదు.
2. మద్యం కేసు
2014 నుండి 2019 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని డిస్టిలరీ సరఫరాదారులకు ప్రయోజనం చేకూర్చేలా రాష్ట్ర మద్యం పాలసీని రూపొందించారని డిస్టిలరీస్ అండ్ బ్రూవరీస్ కమిషనర్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఫిర్యాదు చేయడంతో అక్టోబర్ 28న ఆయనపై చంద్రబాబుపై సీఐడీ మరోకేసు పెట్టింది. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాకు ఏడాదికి సుమారు రూ.1,300 కోట్ల నష్టం కలిగిందని 1988 అవినీతి నిరోధక చట్టం కింద కేసు చంద్రబాబు ఏ-3 కాగా, సీనియర్ ఐఏఎస్ అధికారి నరేష్ ఏ1గా, మాజీ మంత్రి, సీనియర్ టీడీపీ నేత కొల్లు రవీంద్ర ఏ2గా ఉన్నారు. కేంద్రంలో మద్యం పాలసీ కేసులో ఉర్రూతులూగిస్తున్నట్లే ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆంధ్రా మద్యం పాలసీని తారుమారు చేశారని CID ఆరోపించింది.
3. స్కిల్ డెవలప్మెంట్ కేసు
2014 - 2019 వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనిచేసిన సమయంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో రూ.371 కోట్ల నిధులు దుర్వినియోగమైయ్యాయన్న ఆరోపణలపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.
నైపుణ్యాభివృద్ధి కేసులో 52 రోజులపాటు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో చంద్రబాబు రిమాండ్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్టులో భారీ ఎత్తున నిదులు దుర్వినియోగమయ్యాయనేది ప్రధానమైన ఆరోపణలు. ఈ ప్రాజెక్టు విలువ రూ.3,356 కోట్లు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కోసం సీమెన్స్ కంపెనీతో కుదిరిని ఒప్పందం ప్రకారం సీమెన్స్ 90 శాతం ని|ధులు ఖర్చు చేసి ప్రాజెక్టును పూర్తి చేయాలి. మరో 10 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. అందుకు భిన్నంగా చంద్రబాబు ప్రభుత్వ ఖర్చుతో ప్రాజెక్టును పూర్తి చేయాలన్న చొరవ తీసుకోవడంలో చంద్రబాబు కీలకపాత్ర పోషించారని సీఐడీ అధికారులు ఆరోపించారు. సాంకేతిక భాగస్వామి అయ ఇన డిజైన్ టెక్ సంస్థ ఖాతాలో అవినీతికి పాల్పడిన సొమ్ము రూ.371 కోట్లు నిధులు విడుదల చేశారని సీఐడీ అధికారులు ఆరోపించారు. నకిలీ ఇవ్వాయిస్‌లు, షెల్ కంపెనీల పేరుతో నిధులు మళ్లించారనేది ప్రధానమైన ఆరోపణ. తీని ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.371 కోట్లు నష్టం వాటిల్లిందని సీఐడీ అధికారులు విజయవాడలోని ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి వివరించారు. కేసు విచారణలో చంద్రబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కేసులో ప్రధానాంశాలు.. నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ, అవినీతితో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
4. హింస, అల్లర్ల ప్రేరేపణల ఆరోపణలపై అంగళ్ల కేసు
ఆగస్టు 4వ తేదీన అన్నమయ్య జిల్లా అంగళ్లు గ్రామంలో జరిగిన ఘటనకు సంబంధించి చంద్రబాబుతో పాటు టీడీపీకి చెందిన మరికొందరు నేతలపై హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు చేపట్టిన ర్యాలీలో హింస, అల్లర్లను ప్రేరేపించారని ఏపీ పోలీసులు ఆరోపించి ఆగస్టు 9న కేసు నమోదు చేశారు. ఈ కేసుపై అధికార వైఎస్సార్సీపీ నాయకుడు, అంగళ్లు మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమాపతిరెడ్డి ఫిర్యాదుతో చంద్రబాబు ఏ-1గా ముదివీడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయగా, ముల్కలచెరువు పోలీసులు ఏ-7గా కేసు నమోదు చేశారు. తంబళ్లపల్లె ఎమ్మెల్యే, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు పి.ద్వారకానాథ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా అల్లర్లకు పాల్పడి, నేరపూరిత కుట్రకు చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు తెరలేపారని, కుట్ర, అల్లర్లు, బెదిరింపులకు పాల్పడటమే కాకుండా, చట్టవిరు్ద్ధమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ అధ్యక్షుడు తన పర్యటన చివరి నిమిషంలో తన ర్యాలీ రూట్ మార్చి స్థానిక ఎమ్మెల్యేను కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశారని, దీంతో టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగిందని పోలీసులు ఆరోపించారు. అంగళ్ల ఘటనలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, పోలీసు సిబ్బంది సహా పలువురు గాయపడ్డారని పోలీసులు చంద్రబాబుపై రెండు పోలీస్ స్టేషన్లలో నెండు కేసు నమోదు చేశారు.
5. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వివాదం
ఏపీకి రాజధానిగా ప్రతిపాదించిన అమరావతిలో చంద్రబాబు భూకుంభకోణానికి తెరలేపారని సీఐడీ పోలీసులు కేసు నమోదు. లింగమనేని రియల్ ఎస్టేట్ కంపెనీ కి లాభం చేకూర్చడం. ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్ మార్చడంతో అక్కడి రైతులకు పెద్ద ఎత్తున నష్టం కలిగిందని, ఇది తెలిసే చేసిన నేరమంటూ సీఐడీ వాదిస్తోంది. చంద్రబాబు వ్యాపార సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిడెట్ ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్‌లో పెద్ద ఎత్తున భూములను స్వాధీనం చేసుకున్నారని సీఐడీ ఆరోపణ. దీంతో మాజీ సీఎం చంద్రబాబు, మాజసీ మంత్రులు లోకేష్, పి.నారాయణతో పాటు మరికొందరిపై ఏపీ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. లింగమనేని ఎస్టేట్స్ కు మేలు చేయడం వల్లే చంద్రబాబు గత 9 ఏళ్లుగా లింగమనేని గెస్ట్ హౌస్‌ను ఉచితంగా వాడుకుంటూ, అధికారికి నివాసంగా అనుమతి లేకుండానే ప్రభుత్వ నిధుల ఖర్చుతో పునరుద్దరించారని సీఐడీ వాదన. కేవలం భూ కుంభకోణమే కాదు. అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయన్నది కేసులోని సారాంశం.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR) కేసులో చంద్రబాబు ఏ-1.
6. ఏపీ (AP) ఫైబర్ నెట్ కేసు
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియలో వందల కోట్ల రూపాయల కుంభకోణం ఉందని సీఐడీ చంద్రబాదు, లోకేష్‌పై కేసు నమోదు. మోసం, ఫోర్టరీ, నేరపూరితమైన ఉల్లంఘనలు. నేరపూరిత కుట్ర, అవినీతితో సహా పలు నేరాలపై సీఐడీ పోలీసుల కేసు. రాష్ట్ర వ్యాప్తంగా ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ కోసం బ్లాక్ లిస్టులో ఉన్న టెరా సాఫ్ట్ వేర్ కంపెనీకి రూ.321 కోట్లకు టెండర్ల కేటాయించారనేది మొదటి ఆరోపణ. ఈ కేసులో మొత్తం 19 మందిపై ఏపీ సీఐడీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
డిసెంబరు 8వ తేదీన సుప్రీం కోర్టులో సెక్షన్ 17-ఏ కి సంబంధించిన తీర్పు వెలువడ్డాక టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ భవష్యత్తు ఆధారపడి ఉంటుంది.

