
ఆరు వందల మంది విద్యార్థులపై కేసులు
వంద మంది పేర్లు ప్రస్తావించిన రాంఛీ పోలీసులు, గుర్తించాల్సిన వారు మరో ఐదు వందల మంది
జార్ఖండ్ లో కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై అక్కడి ప్రభుత్వం క్రూర అణచివేత చర్యలు కొనసాగిస్తోంది. మొన్న అసెంబ్లీ వైపుగా జరిపిన మార్చ్ పై దాదాపు 600 మంది విద్యార్థులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వీరిలో వంద మంది నిరసనకారుల పేర్లను ప్రస్తావించారు. మరో ఐదు వందల మంది నిరసనకారులను గుర్తించాల్సి ఉంది.
జార్ఖండ్‌లో నియామక పరీక్షలలో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేస్తున్న ఆందోళన 20వ రోజుకు చేరుకున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చే వరకు ఆందోళనను కొనసాగిస్తామని విద్యార్థులు శపథం చేశారు.
రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో ఈ ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న 'జెపిఎస్‌సి-జెఎస్‌ఎస్‌సి రిఫార్మ్స్ మంచ్', నియామక పరీక్షలలో మరింత పారదర్శకత, బహుళ నియామక పరీక్షల రద్దు, సిబిఐ విచారణ లేదా రాష్ట్రం వెలుపలి నుంచి విశ్రాంత న్యాయమూర్తుల బృందంతో విచారణ జరిపించాలని డిమాండ్లు లేవనెత్తింది.
అణచివేతలు..
సోమవారం జార్ఖండ్ అసెంబ్లీ వైపుగా సాగిన మార్చ్ సందర్భంగా నిరసనకారులను చెదరగొట్టడానికి భద్రతా సిబ్బంది లాఠీలు, వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ఉపయోగించడంతో ఉద్రిక్తతలు చెలరేగాయి. పోలీసుల చర్యకు ప్రతిస్పందనగా బీజేపీ అనంతరం రాష్ట్రవ్యాప్త బంద్ పాటించింది.
మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ బుధవారం (ఆగస్టు 12) మాట్లాడుతూ, నియామకాలలో జరిగిన అవకతవకలపై వారం రోజుల్లోగా సీబీఐ విచారణకు ఆదేశించకపోతే నిరాహార దీక్ష ప్రారంభిస్తానని హెచ్చరించారు. ఈ విషయంపై 1,200కు పైగా విశ్వవిద్యాలయాల్లో నిరసనలు చేపడతామని ఏబీవీపీ కూడా ప్రకటించింది.
కొత్త డిమాండ్లు..
2024 ఎక్సైజ్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో భాగంగా జరిగిన శారీరక పరీక్షలో మరణించిన 19 మంది అభ్యర్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 1 కోటి పరిహారం అందించాలని దాస్ డిమాండ్ చేశారు.
అవకతవకలపై విచారణ జరుపుతున్న రాష్ట్ర ప్రభుత్వ నియమిత సిట్ విశ్వసనీయతను ఏబీవీపీ నాయకులు కూడా ప్రశ్నించారు. ఆ బృందం కూర్పులో పదేపదే మార్పులు జరగడమే తమ ఆందోళనలకు కారణమని వారు పేర్కొన్నారు. ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకు హేమంత్ సోరెన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది.
అయితే, విద్యార్థుల ఆందోళనను బీజేపీ రాజకీయం చేస్తోందని, నిరసనలకు అంతరాయం కలిగించడానికి జార్ఖండ్ వెలుపల నుంచి కార్యకర్తలను తీసుకువచ్చారని కాంగ్రెస్ ఆరోపించింది.
కొనసాగుతున్న ప్రతిష్టంభన..
ఇదిలా ఉండగా, నిరసన ప్రదేశానికి తిరిగి వెళ్లేందుకు జేఎల్‌కేఎం నాయకుడు దేవేంద్ర నాథ్ మహతో రాంచీ సివిల్ సర్జన్ నుంచి అనుమతి కోరారు. నిరాహార దీక్షలో ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహతో, తన 'ఆత్మ' విద్యార్థి ఉద్యమంతోనే ఉందని అన్నారు. నిరాహార దీక్ష చేస్తున్న నలుగురు విద్యార్థులు కూడా వైద్య చికిత్స పొందుతున్నారు.
అంతకుముందు, ప్రభుత్వానికి, విద్యార్థి ప్రతినిధులకు మధ్య జరిగిన ఆరు దఫాల చర్చలు ప్రతిష్టంభనను తొలగించడంలో విఫలమయ్యాయి. నియామక పరీక్షల సంస్కరణలకు తాను కట్టుబడి ఉన్నానని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పునరుద్ఘాటించారు. 14వ జేపీఎస్సీ పరీక్షను రద్దు చేస్తామని నిరసనకారులకు హామీ ఇచ్చారు. ఈ ఆందోళన ద్వారా బీజేపీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని ఆయన ఆరోపించారు.
Next Story

