
కోల్ కతలో అగ్ని ప్రమాదం, తొమ్మిది మంది మృతి
చనిపోయిన వారిలో ఎక్కువ మంది బంగ్లాదేశీయులే
కోల్‌కతాలోని ఒక హోటల్‌లో ఈ రోజు తెల్లవారుజామున సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో ఒక చిన్నారితో సహా కనీసం తొమ్మిది మంది మరణించారు. కోల్‌కతా నగర నడిబొడ్డున ఉన్న న్యూ మార్కెట్ సమీపంలోని ఫ్రీ స్కూల్ స్ట్రీట్‌లోని ఒక హోటల్‌లో తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ మంటలు చెలరేగాయి. మంటలు భవనమంతా వ్యాపించడంతో పలువురు వ్యక్తులు లోపల చిక్కుకుపోయారు.
మృతుల గుర్తింపు..
అగ్నిమాపక శాఖ మంత్రి కౌశిక్ చౌదరి మీడియాతో మాట్లాడారు. మృతులను ఇంకా గుర్తించలేదని వెల్లడించారు. చనిపోయినవారిలో భారతీయులతో పాటు బంగ్లాదేశీయులు ఉన్నారని చెప్పారు."మేము వారి గుర్తింపును నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నాము. ఈ భవనం లోపల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ భవనంలో అనేక హోటళ్లు ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతోందో చూసి నేను దిగ్భ్రాంతికి గురయ్యాను," అని చౌదరి అన్నారు.
అగ్నిప్రమాదానికి గల కారణం షార్ట్ సర్క్యూట్ అని ప్రాథమికంగా గుర్తించినట్లు పేర్కొన్నారు. కానీ నిజమైన కారణం ఫోరెన్సిక్ తరువాతే తెలుస్తుందని అన్నారు. "భవన యాజమాన్యం ప్రాథమిక భద్రత, నిర్మాణ నిబంధనలను పాటించలేదు. హోటల్ కార్యకలాపాలలో అనేక అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి" అని మంత్రి తెలిపారు.
మరణించిన తొమ్మిది మంది బంగ్లాదేశ్ జాతీయులని, వారు వైద్య చికిత్స కోసం కోల్‌కతాకు వచ్చారని అగ్నిమాపక శాఖ అధికారులు ఇంతకుముందు ఏఎన్ఐకి తెలిపారు. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే నాలుగు ఫైర్ టెండర్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సాయక చర్యల కోసం ఒక విపత్తు నిర్వహణ బృందాన్ని కూడా రంగంలోకి దించారు.
మంటలు వేగంగా వ్యాపించడంతో..
అగ్నిమాపక సిబ్బంది అతిథులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. హోటల్‌ను దట్టమైన పొగ కమ్మేయడంతో సాయక చర్యల సమయంలో అగ్నిమాపక సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది మెట్లు ఎక్కి పై అంతస్తులలోని అతిథుల వద్దకు చేరుకోవడం సంక్లిష్టంగా మారింది.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం..
అగ్ని ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య తొమ్మిదికి చేరిందని, మరిన్ని ప్రాణనష్టాలు జరిగి ఉండవచ్చని భయపడుతున్నట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు. "చిక్కుకున్న వారిని రక్షించడం, అగ్నిప్రమాదానికి గల కారణాలను కనుక్కోవడం మా ప్రాధాన్యత. మంటలను ఆర్పివేశాము, చల్లబరిచే ప్రక్రియ కొనసాగుతోంది," అని తెలిపారు. ప్రమాదానికి గురైన భవనం అగ్నిమాపక శాఖ ప్రధాన కార్యాలయానికి సమీపంలోనే ఉంది.
అంతకుముందు...
పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలో మరో ఘోరమైన హోటల్ అగ్నిప్రమాదం జరిగిన రెండు రోజుల తర్వాత ఈ సంఘటన జరిగింది. ఆగస్టు 17న తారాపీఠ్‌లోని హోటల్ బిదేశినిలో ఎనిమిది మంది మరణించారు. చాలా మంది అతిథులు నిద్రపోతున్న సమయంలో, ఉదయం 4:30 గంటల ప్రాంతంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి.
ఆ అగ్నిప్రమాదంలో మేఘాలయకు చెందిన ఒక కుటుంబంలోని ఐదుగురు మరణించారు. వీరిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారు పై అంతస్తులో ఉంటున్నారు. మంటలను గమనించిన తర్వాత తప్పించుకోవడానికి ప్రయత్నించారు. కింది అంతస్తులకు చేరుకునే వారి ప్రయత్నాన్ని మంటలు అడ్డుకున్నాయని ఎన్‌డిటివి నివేదించింది. సహాయక సిబ్బంది తరువాత గాయపడిన వారిని రాంపూర్‌హాట్ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రికి తరలించారు, అక్కడ వారికి చికిత్స అందించారు.
Next Story

