రాంఛీలో విద్యార్థులపై లాఠీచార్జీ
x

రాంఛీలో విద్యార్థులపై లాఠీచార్జీ

చలో అసెంబ్లీలో కవాతు సందర్భంగా ఘటన


Click the Play button to hear this message in audio format

రాష్ట్రంలో జరిగిన పేపర్ లీక్ లపై నిరసనగా విద్యార్థులు గత రెండు వారాలుగా చేస్తున్న ఆందోళన సోమవారం ఉద్రిక్తంగా మారింది. వేలాది మంది ఉద్యోగార్థులు ఈ రోజు జార్ఖండ్ అసెంబ్లీ ముట్టడికి బయల్దేరగా, పోలీసులు వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయినా విద్యార్థులు తగ్గకపోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు.

కొత్త అసెంబ్లీ కాంప్లెక్స్‌కు వెళ్లే దారిలో జగన్నాథ్‌పూర్ ఆలయం సమీపంలోని చివరి బారికేడ్ వద్దకు చేరుకున్న నిరసనకారులు, త్రివర్ణ పతాకాలు, ప్లకార్డులతో నృత్యం చేశారు. పోలీసులు వీరిపై వాటర్ కెనాన్లు ప్రయోగించిన తరువాత కూడా వారు నృత్యం ఆపలేదు. వారి నిరసన 17వ రోజుకు చేరుకోవడంతో, వారు తమ డిమాండ్లకు మద్దతుగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ 51వ పుట్టినరోజు సందర్భంగా జరిగిన ఈ కవాతు, ఉదయం 10:30 గంటల ప్రాంతంలో పాత అసెంబ్లీ భవనం బయట ప్రారంభమైంది.

తీవ్రమవుతున్న నిరసన...

నియామక పరీక్షలలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి, విద్యార్థి ప్రతినిధులకు మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో ఈ నిరసనలు చోటు చేసుకున్నాయి. జార్ఖండ్ స్టాప్ సెలక్షన్ కమిషన్, కంబైన్డ్ గ్రాడ్యూయేట్ లెవెల్ పరీక్ష రద్దు చేయాలని, సీబీఐ విచారణ జరపాలని, నియామక సంస్కరణలు చేపట్టాలని, ఒక నిర్ధిష్ట నియామక క్యాలెండర్ ప్రకటించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
‘‘మూడు విడతల చర్చల తరువాత కూడా ప్రభుత్వం మా డిమాండ్లను అంగీకరించలేదు. సోమవారం శాసనసభకు చేపట్టే పాదయాత్రకు సంబంధించి, జార్ఖండ్ లోని అన్నిజిల్లాల నుంచి ఆశావహులు, మద్దతుదారులు నైతిక మద్దతును అందిస్తున్నారు. మేము పాత అసెంబ్లీ భవనం నుంచి కొత్త భవనం వరకూ పెద్ద సంఖ్యలో పాదయాత్ర చేస్తాము. ఈ నిరసన పూర్తిగా శాంతియుతంగా ఉంటుంది’’ అని విద్యార్థి నాయకుడు సంజయ్ మెహతా అన్నారు.

బీజేపీ అడుగు...

విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు ప్రతిపక్ష బీజేపీ కూడా జత చేరింది. బీజేపీ కార్యకర్తలు సీఎం నివాసం దగ్గర నిరసనలకు దిగారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఆదిత్య సాహు, ప్రతిపక్ష నాయకుడు బాబులాల్ మారండీలు దీనికి నాయకత్వం వహించారు.
పరీక్షలలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘‘విద్యార్థులు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. కానీ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లిస్తోంది. జేపీఎస్పీ, జేఎస్ఎప్పీ సీజీఎల్, వీటిన్నింటిని సీబీఐతో విచారణ జరిపించాలి’’ అని మారండీ అన్నారు.

ప్రభుత్వ ప్రతిస్పందన..

అభ్యర్థులు లేవనెత్తిన 98 శాతం డిమాండ్లను తాము అంగీకరించామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుండగా, ఈ వాదనను నిరసన నాయకులు తిరస్కరించారు. 14 వ జేపీఎస్పీ పరీక్ష 2023-25 బ్యాక్ లాగ్ నియమాకాల ప్రక్రియకు సంబంధించి జరిగిన అవకతవకలపై సీఐడీ, ఈడీ దర్యాప్తుల ద్వారా పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర మంత్రి సుదివ్యకుమార్ సోను తెలిపారు. సీఐడీ ఎఫ్ఐఆర్ ఇతర ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న తరువాత ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తును కూడా ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.

పరిష్కారం కానీ ప్రధాన డిమాండ్..

90 రోజుల్లో చార్జీషీట్లు దాఖలు చేయడానికి ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంతో పాటు సంస్కరణలు సూచించేందుకు ఐఐటీ ఐఎస్ఎం, ఐఐఎం రాంఛీ నుంచి నిఫుణుల ప్యానెల్ ను కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.
అయితే పాత పరీక్షల రద్దుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. హైకోర్టు, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ పరీక్ష నిర్వహించబడినందున ప్రభుత్వం దానిని రద్దు చేయలేదని సోను అన్నారు. ఈ వివాదం కారణంగా జేపీఎస్పీ చైర్ పర్సన్ ఎల్ ఖియాంగ్దే, ముగ్గురు కమిషన్ సభ్యులు రాజీనామా చేశారు. ఈ అవకతవకలకు సంబంధించి 19 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.


Read More
Next Story