‘సియాంగ్ మెగా డ్యామ్‌’ వద్దంటే వద్దు
x

‘సియాంగ్ మెగా డ్యామ్‌’ వద్దంటే వద్దు

అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు, పోలీస్ స్టేషన్ కు నిప్పు పెట్టిన నిరసనకారులు


Click the Play button to hear this message in audio format

ఈశాన్య భారతంలో రాష్ట్రాల భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించదలచిన సియాంగ్ మెగా డ్యామ్ కు వ్యతిరేకంగా స్థానికులు చేస్తున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఇక్కడ కేవలం బీజేపీ నేతల ఇళ్లే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఈ సంఘటనలో నిరసనకారులు ఎన్హెచ్పీసీ ఆఫీస్ తో పాటు పోలీస్ స్టేషన్ కు నిప్పుపెట్టారు. ఏడు పోలీసు వాహనాలను దహనం చేశారు. ఈ పరిణామాలతో రాష్ట్రంలో ఉద్రిక్తతలు పెరిగాయి.

సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్టు కోసం చేపట్టిన ప్రాథమిక సర్వేలను స్థానిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 23న సియాంగ్, అప్పర్ సియాంగ్, ఈస్ట్ సియాంగ్ జిల్లాల్లో 12 గంటల బంద్‌కు పిలుపునిచ్చాయి. పగటిపూట బంద్ చాలావరకు ప్రశాంతంగా జరిగినప్పటికీ, రాత్రి పరిస్థితులు అదుపుతప్పాయి. అక్టోబర్ 24 తెల్లవారుజామున 3.30 గంటల వరకు హింస కొనసాగింది.
బంద్ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే నినోంగ్ ఎరింగ్ నివాసంపై దాడి జరిగింది. స్థానిక ఎమ్మెల్యే ఓని పాన్యాంగ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కలింగ్ మోయోంగ్ ఇళ్లను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనల్లో దోపిడీలు, చోరీలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఆందోళనల సమయంలో ఓ జర్నలిస్టు కూడా గాయపడ్డారు. ప్రతిపాదిత మెగా ప్రాజెక్ట్ ను వ్యతిరేకిస్తూ నిర్భంధంలో ఉన్న ఆందోళనకారులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్స్ సిబ్బందిని సైతం ఉపసంహరించుకోవాలని, సర్వే పనులు తక్షణమే నిలిపివేయాలని స్థానిక సంస్థలు పిలుపునిస్తున్నాయి.ఉద్యమానికి సంబంధించి నమోదైన కేసులను ఉపసంహరించడంతో పాటు, సస్పెండ్ చేసిన గ్రామ పెద్దలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.
అంతకుముందు అక్టోబర్ 23న గేకు సమీపంలోని డిటే-డైమ్ ప్రాంతంలో నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు జరిగాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించగా, కనీసం నలుగురు మహిళలు గాయపడినట్లు సమాచారం. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి కొందరు నిరసనకారులు బారికేడ్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని పోలీసులు ఆరోపించారు.
సియాంగ్ ఎస్పీ కామ్దామ్ సికోమ్ ప్రకారం.. గెకు, కొమ్కార్ ప్రాంతాలకు చెందిన సుమారు 150 నుంచి 200 మంది ఆందోళనకారులు ఉదయం ఏడుగంటల ప్రాంతంలో డిటె డిమో వద్ద కత్తులు, లాఠీలు, వడిసెలతో సియాంగ్ జిల్లాలోకి ప్రవేశించేందుకు యత్నించారని ఆరోపించారు. పోలీసులపైకి రాళ్లు రువ్వడం, బారికేడ్లను ధ్వంసం చేయడంతో మేజిస్ట్రేట్ సమక్షంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని ఆరోపించారు.
బ్రహ్మపుత్రా నదికి ప్రధాన ఉపనది అయిన సియాంగ్ నదిపై పదకొండు వేల మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి చేయడానికి భారీ స్థాయిలో నీటిని నిల్వ చేయాల్సి ఉంటుంది. ఇదే ఇక్కడ వివాదానికి కారణమైంది.
ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న స్థానిక ఆదివాసీ సంఘాలు తమ పూర్వీకుల భూములు ముంపునకు గురవుతాయని, ప్రజలు నిర్వాసితులవుతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పర్యావరణానికి, సంప్రదాయ జీవనోపాధికి, స్థానిక సంస్కృతికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని చెబుతున్నాయి. భూకంపాల ముప్పు ఉన్న హిమాలయ ప్రాంతంలో భారీ జలాశయం నిర్మించడం వల్ల వరదలు, పర్యావరణ సమస్యలు పెరిగే అవకాశాలపైనా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

ప్రభుత్వ వాదన ఏంటీ?

చైనాలో సియాంగ్ నదికి ఎగువ ప్రాంతంలో నిర్మిస్తున్న భారీ డ్యామ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టు కీలకమని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. నీటి నిల్వ, వరద నియంత్రణ, జలవిద్యుత్ ఉత్పత్తి, జాతీయ నీటి భద్రతకు ఇది ఉపయోగపడుతుందని వివరిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్నవి ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు కాదని, సాంకేతిక, పర్యావరణ సాధ్యాసాధ్యాలను అంచనా వేసే ప్రాథమిక సర్వేలు మాత్రమేనని స్పష్టం చేసింది.
ముఖ్యమంత్రి పెమా ఖండూ హింసాత్మక ఘటనలను విచారకరంగా అభివర్ణిస్తూ, శాంతిని పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉన్నప్పటికీ, అది చట్ట పరిధిలోనే ఉండాలని పేర్కొన్నారు. ప్రాజెక్టుపై స్థానిక సంఘాలు, ప్రజాప్రతినిధులతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రజల ఆమోదం కీలకమని తెలిపారు.
ఇదిలా ఉండగా, మిషన్ అరుణాచల్ సంస్థ కూడా ఈ వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించాలని సూచించింది. చైనా చేపడుతున్న జలవిద్యుత్ ప్రాజెక్టుల నేపథ్యంలో సియాంగ్ ప్రాజెక్టును పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూనే, స్థానిక ప్రజల అభ్యంతరాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించాలని కోరింది. ఈ ప్రాజెక్ట్ వల్ల దాదాపు లక్ష నుంచి లక్షాయాభై వేల మంది గిరిజనులు నిరాశ్రయులయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా ప్రత్యక్ష గణాంకాలు అందుబాటులోకి లేవు.
మొత్తంగా, సియాంగ్ మెగా డ్యామ్‌పై వివాదం ఇప్పుడు శాంతిభద్రతల సమస్యగా మారింది. ఒకవైపు నీటి భద్రత, అభివృద్ధి అవసరాలను ప్రభుత్వం ప్రస్తావిస్తుండగా, మరోవైపు తమ భూములు, జీవనోపాధి, పర్యావరణ పరిరక్షణపై స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి, నిరసనకారులకు మధ్య చర్చలు జరగడం, వారి అభ్యంతరాలకు పరిష్కారం లభించడం కీలకంగా మారింది.
Read More
Next Story