
దుర్గా మండపంలో తొక్కిసలాట, 19 మంది మృతి
పండగ వేళ కోల్ కతాలో తీవ్ర విషాదం
దుర్గా పూజకు ప్రసిద్ధి గాంచిన బెంగాల్ లో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. ఉత్తర కోల్ కతలోని చోర్ బాగన్ దుర్గా పూజా మండపం వద్ద జరిగిన తొక్కిసలాటలో కనీసం 19 మంది మరణించగా, 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నపిల్లలే ఉన్నారని జాతీయ మీడియా కథనాలు వెలువరించింది.
బాధితులను వెంటనే చికిత్స కోసం కోల్ కత మెడికల్ అండ్ హాస్పిటల్ తరలించారు. ఈ హాస్పిటల్ లో ఉన్న బాధిత కుటుంబాలను సీఎం సువేందు అధికారి పరామర్శించారు. చనిపోయిన వారికి రూ. 25 లక్షలు, గాయపడిన వారికి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే వారికి గ్రూప్ డీ ప్రభుత్వ ఉద్యోగం సైతం ఇస్తామని హమీ ఇచ్చారు.
కారణం ఏంటీ?
కోల్ కతాలోని చోర్ బగన్ సర్బోజనిన్ పూజా మండపం వద్ద రాత్రి 7.30 నిమిషాల ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు సీఎం ప్రకటించారు. ‘‘ఘటనా స్థలంలో అధికారుల ప్రాథమిక నివేదికల ప్రకారం, పూజా నిర్వాహాకులు లౌడ్ స్పీకర్లలో చేసిన ప్రకటన కారణంగానే తొక్కిసలాట జరిగింది’’ అని ఆయన అన్నారు. పూర్తి వివరాలు ఇంకా బయటకు రానప్పటికీ ప్రాథమిక సమాచారం ప్రకారం.. భారీ వర్షం, మండపం వద్ద చేసిన ప్రకటన గందరగోళానికి దారితీసింది.
మొదట వర్షం చినుకులు ప్రారంభం అయి.. కుంభవృష్టిగా కురిసింది. దీనితో భక్తులు మొత్తం మండపంలోనే తలదాచుకోవడానికి ప్రయత్నించారు. దీనితో కొంతమంది కిందపడటంతో తొక్కిసలాట ప్రారంభం అయి, ప్రాణాంతకంగా మారింది. అయితే పోలీసులు చేసిన ఏర్పాట్లు కూడా తూతుమంత్రంగానే ఉండటంతోనే ప్రమాద తీవ్రత పెరిగిందని పలువురు భక్తులు ఆరోపించారు.
ఈ మధ్య పెద్ద సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తున్న చోర్భన్ దుర్గాపూజ, చిత్తరంజన్ అవెన్యూ నుంచి చాలా ఇరుకుగా ఉంటుంది. పండాల్ ప్రాంతంలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ విజిల్ ఊదడంతో పండాల్ సందర్శన కోసం వేచి ఉన్న ప్రజలు ఒక దగ్గరకు రావడానికి ప్రయత్నించారని ముఖ్యమంత్రి తెలిపారు.
కమిటీ ఏర్పాటు..
చోర్బ బాగన్ దుర్గా పూజ నిర్వాహకులు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, విధుల్లో ఉన్న సిబ్బందిని విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. ‘‘ఇది బాధాకరమైన సంఘటన, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాము.
చోర్ బాగన్ దుర్గా పూజ నిర్వాహాకులు, సెక్యూరిటీ గార్డులు, విధుల్లో ఉన్నసిబ్బందిని అదుపులోకి తీసుకున్నాము’’ అని ఆయన అన్నారు. ఆ ప్రదేశాన్ని మొత్తం సీల్ చేశారని, ఫోరెన్సిక్, ఎస్టీఎఫ్, అగ్నిమాపక దళాలు ప్రాథమిక దర్యాప్తు నిర్వహిస్తున్నాయని ఆయన తెలిపారు.కలకత్తా హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో ప్రభుత్వ ఒక నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేస్తుందని, దాని సిఫార్సుల మేరకు చర్యలు తీసుకుంటుందని అధికారి తెలిపారు.
అమిత్ షా పర్యటన వాయిదా...
ఈ విషాదం కారణంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యక్రమాలతో సహ అన్ని అధికారిక కార్యక్రమాలు వాయిదా పడ్డాయని అధికారి తెలిపారు. ఆయన ఇప్పటికే కోల్ కతలో ఉన్నారు. ఆదివారం దుర్గా పండాల్ ను సందర్శించాల్సి ఉంది. ఈ ప్రమాదంతో ప్రస్తుతం దుర్గా పండాల్ ను మూసివేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
జాగ్రత్తలు..
వివిధ థీమ్ లతో ఏర్పాటు చేసిన దుర్గా పండాల్ ను మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దుర్గా పూజ సమయంలో ఒక్క కోల్ కతలోనే దాదాపు 3,500 మండపాలు వెలుస్తాయి.
ఈ వివాదం పై ప్రతిపక్ష టీఎంసీ(మమతా వర్గం) ఆరోపణలు గుప్పించింది. సీఎం సువేందు అధికారి మేనల్లుడు దేబాదీప్ అధికారి, చోర్ బగన్ పూజా కమిటీకి మధ్య సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది. అలాగే పూజా మండల్ కు బీజేపీ ఎమ్మెల్యేనే చైర్మన్ గా ఉన్నారని తెలిపింది. ఈ సంఘటనకు బాధ్యత వహించి సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎక్స్ లో ట్వీట్ చేసింది.
Next Story

