
శివరాత్రికన్నా ముందే శివాలెత్తిన ఎండలు!
ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో ఈ సెగ మొదలైంది. కొన్ని జిల్లాలలో ఇప్పటికే వడగాడ్పులు ప్రారంభం కాగా మున్ముందు మరింత ఉధృతం కానున్నాయి.
ఎండలు మంటెత్తనున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో ఈ సెగ మొదలైంది. కొన్ని జిల్లాలలో ఇప్పటికే వడగాడ్పులు ప్రారంభం కాగా మున్ముందు మరింత ఉధృతం కానున్నాయి. ఇదేదో ఒక్క తెలుగు రాష్ట్రాలకే కాదు యావత్ దేశంలో పరిస్థితి ఇలాగే ఉండబోతోందని భారతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. నిజానికి తెలుగురాష్ట్రాలలో వేసవి ఇంకా అధికారికంగా ప్రారంభం కాకముందే ఎండలు ముదరడం ప్రజల్ని హడలెత్తిస్తోంది. శివరాత్రి తర్వాత శివశివా అంటూ చలిపోతుందని, ఆ తర్వాతే ఎండలు మొదలు మొదలవుతాయనేది మనకున్న నమ్మకం. కాని ఫిబ్రవరి చివరి వారంలోనే ఎండలు ప్రారంభం అయ్యాయి.
మార్చి నుంచే మొదలు...
మార్చి నుంచి మే వరకు వేసవి కాలం. దేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణ్రోగతలు నమోదు అయ్యే అవకాశం ఉందన్నది ఐఎండీ అంచనా. ఎల్‌నినో పరిస్థితులు కొనసాగుతాయని, హీట్‌వేవ్ కొనసాగుతోందని పేర్కొంది. కానీ ఢిల్లీ, దాని చుట్టుపక్కల ప్రాంతాలలో విచిత్ర వాతావరణం ఉంటుందని అంచనా. రాత్రి చలి, పగలు ఎండలు మండిపోవొచ్చు. మార్చి 15లోపు అక్కడక్కడా అకాలవర్షాలు పడే అవకాశం ఉంది.
మనకూ ఉంది ముప్పు
తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో సాధారణం కంటే అధికంగా వడగాలులు ఉంటాయని అంచనా వేసింది. మార్చి నుంచి మే దాకా సాధారణం కంటే అధిక గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చన్నారు ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర. ప్రస్తుతం ఉన్న ఎల్‌నినో, మధ్య పసిఫిక్ మహాసముద్రంలో నీటి ఆవర్తనం వేడెక్కడం వంటి పరిస్థితులు వేసవికాలం పొడవునా కొనసాగుతాయి. ఆ తర్వాత సాధారణ స్థితికి చేరుకుంటాయి. దేశంలో అనుకూల వర్షపాతానికి కారణమైన లానినా పరిస్థితులు వర్షాకాలం మధ్య నుంచి ఏర్పడనున్నట్లు అంచనా వేశారు.
IMD అంచనా ప్రకారం 12 వారాల వ్యవధిలో కాసే ఎండల ప్రభావం ప్రజారోగ్యం, వ్యవసాయంపై ఉండే అవకాశం ఉంది. ఎల్ నినో ప్రభావంతో ఏప్రిల్, మేలో వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షాకాలం అధికారికంగా జూన్ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగానే ఉండవచ్చునన్నారు IMD డైరెక్టర్ జనరల్ ఎం. మోహపాత్ర.

