
అందరూ కోపంతో అరుస్తారు! 'ఆమె' మాత్రం నాట్యంతో నిలదీస్తారు!!
నాట్యంలో ఫైర్ బ్రాండ్ సరితా దిలీప్. ఆకాశంలో సగం, అన్నింటా సమానం అంటూ వివక్షచూపే వారిపై నాట్యంతో ఆగ్రం వ్యక్తం చేయడం ఆమె నైజం. అటువంటి అరుదైన వ్యక్తిత్వం ఆమెది.
అందరికీ ఆమె కూచిపూడి నర్తకీమణిగా మాత్రమే తెలుసు కాని ఆమెలో ఓ ధిక్కార స్వరం ఉండేది. ద్వితీయ శ్రేణి పౌరునిగా పరిగణించే మహిళా లోకం పట్ల విపరీత ఆవేదన ఉండేది. అందరూ మాటల్లో చెబితే ఆమె తన కళతో ప్రతిబింబించేవారు. ఆమే ప్రముఖ నాట్యగురు సరితా దిలీప్. 65వ ఏట కన్నుమూశారు హైదరాబాద్ లో.
ఎవరీ సరిత...
ప్రముఖ నాట్య గురు, కూచిపూడి నర్తకీమణి, నృత్యప్రియ కూచిపూడి స్కూల్ డైరెక్టర్ సరితా దిలీప్ కన్నుమూశారు. గుండెపోటు ఆమెను కబళించింది. 65 ఏళ్ల వయసులోనూ కూచిపూడి నృత్యం పట్ల మక్కువ చూపిన గొప్పకళాకారిణి సరితా దిలీప్. హైదరాబాద్ బర్కత్ పురా నుంచి ఆమె వీడ్కోలు తీసుకున్నారు.
ఫైర్ బ్రాండ్ సరిత తెలుగు విశ్వ విద్యాలయం తొలి ఎం ఎ కూచిపూడి బ్యాచ్ స్టూడెంట్! నృత్యప్రియ పేరిట డాన్స్ స్కూల్ ఏర్పాటు చేసి ఎందరో కూచిపూడి కళాకారులను తీర్చిదిద్దారు. ప్రముఖ నాట్య గురు డాక్టర్ ఉమా రామారావు శిష్యురాలు. అరుదైన వ్యక్తిత్వం ఆమెది. మహిళా వివక్ష పై నాట్య రూపంలో ఉద్యమం చేశారు. ముక్కు సూటిగా మాట్లాడే సరిత కూచిపూడి నాట్యంలో ఎన్నో ప్రయోగాలు చేశారు. ఎవ్వరిని పట్టించుకోకుండా తనదైన శైలిలో దూసుకెళ్లారు. ఎన్నో సంచలనాలు సృష్టించారు.
కూచిపూడి నాట్యం లో తన మార్క్ ను నిలబెట్టుకున్నారు. చివరి శ్వాస వరకు కూచిపూడి నాట్యం కోసం తపించారు. చిక్కడపల్లిలో వాహిని స్కూల్ లో నాట్య గురువు గా పని చేశారు. ఆమె మంచి ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ కూడా! ఎన్నో లఘు చిత్రాలు నిర్మించారు. తానీషా డాక్యుమెంటరీ ఉత్తమ డాక్యుమెంటరీ గా ప్రభుత్వ నంది పురస్కారం లభించింది. ఇందులో తానీషాగా భాగవతుల రామకోటయ్య గారు నటించారు. ఉమ్మడి రాష్ట్రం లో ప్రతిష్టాత్మక హంస పురస్కారం, ఉగాది పురస్కారం అందుకున్నారు.

