
మణిపూర్: భద్రతా దళాలతో నిరసనకారుల ఘర్షణలు
బిష్ణుపూర్ లో నిషేధాజ్ఞలు
మణిపూర్ మరోసారి ఘర్షణలు జరిగాయి. బిష్ణుపూర్ జిల్లాలో నిరసనకారులు, భద్రతా దళాల మధ్య గొడవలు జరిగాయి. రాష్ట్రంలోని పలు జిల్లాలో నిషేధాజ్ఞలు విధించినట్లు అధికారులు ప్రకటించారు. ఇటీవల ట్రోంగ్లావోబిలో జరిగిన బాంబు పేలుడులో ఇద్దరు చిన్నారులు మరణించడాన్ని నిరసిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టడంతో మంగళవారం థింగుంగే ప్రాంతంలో ఈ హింస చెలరేగింది.
ఆయుధాలు ఉన్నారనే ఆరోపణలతో 'అనుమానాస్పద వ్యక్తుల' కదలికల గురించి ధృవీకరించని నివేదికలు వ్యాపించడంతో ఉద్రిక్తత పెరిగిందని అధికారులు తెలిపారు. థింగుంగే, సమీపంలోని నింగ్తౌఖోంగ్‌లో ఘర్షణలు చెలరేగడంతో, గుంపును చెదరగొట్టడానికి భద్రతా దళాలు బాష్పవాయువు షెల్స్‌ను ప్రయోగించాయి.
ఈ ఘర్షణల్లో 10 మందికి పైగా స్వల్పంగా గాయపడగా, నిరసనకారులు కనీసం ఒక నాలుగు చక్రాల వాహనానికి నిప్పు పెట్టారని అధికారులు తెలిపారు. భద్రతా సిబ్బంది గుర్తింపు, ఉద్దేశ్యంపై 'దురుద్దేశపూర్వక, ధృవీకరించని వదంతులు' వ్యాపించడంతో, మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో థింగుంగే సమీపంలో స్థానికులు భద్రతా బృందాన్ని అడ్డుకున్నారని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
"ఒక గుంపు గుమిగూడి భద్రతా దళాల వాహనాలను అడ్డగించింది. గుంపులోని కొందరు హింసాత్మకంగా ప్రవర్తించి, భద్రతా సిబ్బందికి చెందిన వాహనాలను ధ్వంసం చేసి, నిప్పు పెట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సిబ్బందిని అదుపులోకి తీసుకునేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయి" అని ఆ ప్రకటన తెలిపింది.
శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు, ఆ ప్రాంతానికి అదనపు బలగాలను పంపి, టియర్ గ్యాస్‌తో సహా "అవసరమైనంత తక్కువ బలప్రయోగం" చేసి గుంపును చెదరగొట్టినట్లు పేర్కొంది. ఈ హింసాకాండకు సంబంధించి నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
నిప్పు పెట్టడం, చట్టవిరుద్ధంగా గుమిగూడటం, భద్రతా దళాలను అడ్డుకోవడం వంటి వాటిలో పాల్గొన్న ఇతరులను గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు చెప్పారు. శాంతిభద్రతలను కాపాడేందుకు ఆ ప్రాంతంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు వారు తెలిపారు.
వదంతులు లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వాహనాలకు నిప్పు పెట్టడంలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇదిలా ఉండగా, జిల్లా మేజిస్ట్రేట్ సాయంత్రం 5 గంటల నుండి తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు విధించి, ప్రజల రాకపోకలను నియంత్రించారు.
Next Story

