
ఫల్తా ఉప ఎన్నికల్లో బీజేపీ దూకుడు
నాలుగో స్థానంలో నిలిచిన టీఎంసీ
పశ్చిమ బెంగాల్‌లోని ఫల్తా అసెంబ్లీ నియోజకవర్గం పునఃపోలింగ్‌లో బీజేపీ అభ్యర్థి దూసుకుపోతున్నారు. ఐదో విడత ఓట్ల లెక్కింపు అనంతరం, బీజేపీ అభ్యర్థి దేబాంగ్షు పాండా తన సమీప ప్రత్యర్థి సీపీఐ(ఎం)పై 14,000 ఓట్లకు పైగా ఆధిక్యంతో ముందంజలో నిలిచారని ఎన్నికల సంఘం తెలిపింది.
మొత్తం 21 విడతల లెక్కింపులో ఐదో విడత ముగిసేనాటికి, పాండా 30,562 ఓట్లు సాధించారు. దీంతో 16,048 ఓట్లు పొందిన సీపీఐ(ఎం) అభ్యర్థి శంభు నాథ్ కుర్మిపై ఆయన 14,514 ఓట్ల ఆధిక్యాన్ని సంపాదించారు. పునఃపోలింగ్‌కు రెండు రోజుల ముందు తాను పోటీ చేయబోనని, అది తన వ్యక్తిగత నిర్ణయమని ప్రకటించిన తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి జహంగీర్ ఖాన్ 1,685 ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు.
ఐదో విడత లెక్కింపు అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుర్ రజాక్ మొల్లా 3,510 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైందని ఈసీ అధికారి తెలిపారు. ఈవీఎంల ట్యాంపరింగ్, ఇతర అవకతవకల ఆరోపణల నేపథ్యంలో ఏప్రిల్ 29న జరిగిన పోలింగ్‌ను రద్దు చేయడంతో, దక్షిణ 24 పరగణాల జిల్లాలోని నియోజకవర్గంలోని మొత్తం 285 బూత్‌లలో మే 21న తిరిగి పోలింగ్ నిర్వహించారు.

