యూపీలో దళిత ఓటు కోసం అఖిలేశ్ కొత్త వ్యూహం..
x

యూపీలో దళిత ఓటు కోసం అఖిలేశ్ కొత్త వ్యూహం..

‘దమ్‌దార్ దళిత్’ నినాదంతో బీజేపీకి చెక్ పెట్టే యత్నం!


Click the Play button to hear this message in audio format

ఉత్తరప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే సామాజిక సమీకరణాలపై దృష్టి పెట్టాయి. ముఖ్యంగా దళిత ఓటు బ్యాంకు ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీలకు కీలకంగా మారుతోంది.

ఈ నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కొత్త నినాదంతో రంగంలోకి దిగారు. ‘దమ్‌దార్ దళిత్’ (బలమైన దళితుడు) పేరుతో ఆగ్రాలో భారీ దళిత సదస్సు నిర్వహించి.. బీజేపీ, బీఎస్పీతో పాటు భీమ్ ఆర్మీ నేత చంద్రశేఖర్ ఆజాద్ రాజకీయ ప్రాబల్యానికి సవాల్ విసిరారు.

అఖిలేశ్ ఈ కార్యక్రమం కోసం ఆగ్రాను ఎంచుకోవడం వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో దళిత రాజకీయాలకు ఆగ్రా చాలా కాలంగా కేంద్రంగా ఉంది. అంబేడ్కర్ ఉద్యమానికి, బీఎస్పీకి ఈ ప్రాంతం కీలకమైన స్థావరం.
అయితే గత దశాబ్ద కాలంలో బీజేపీ కూడా ఇక్కడ తన బలాన్ని పెంచుకుంది. మరోవైపు చంద్రశేఖర్ ఆజాద్ కూడా పశ్చిమ యూపీలో దళిత యువతలో ప్రభావం పెంచుకుంటున్నారు. ఈ ముగ్గురి మధ్య రాజకీయ పోటీ నేపథ్యంలో అఖిలేశ్ ఆగ్రా వేదికగా కొత్త రాజకీయ ఎత్తుగడకు తెరతీశారు.
దళితులు రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను కాపాడుకోవడానికి పోరాడాలని, బీజేపీని ఓడించాలని అఖిలేశ్ పిలుపునిచ్చారు. గతంలో బీఎస్పీ నుంచి బీజేపీ వైపు మళ్లిన దళిత ఓటర్లను తిరిగి సమాజ్‌వాదీ పార్టీ వైపు ఆకర్షించడమే ఆయన ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అదే సమయంలో బీజేపీ నిర్మించుకున్న విస్తృత హిందూ ఓటు సమీకరణాన్ని కూడా దెబ్బతీయాలని చూస్తున్నారు.

మూడు అంచెల వ్యూహం..

ఈ వ్యూహంలో మూడు ప్రధాన అంశాలు కనిపిస్తున్నాయి. మొదటిది.. బీజేపీకి వ్యతిరేకంగా దళితుల్లో రాజకీయ చైతన్యాన్ని పెంచడం. రెండోది.. బీఎస్పీ బలహీనపడటంతో ఏర్పడిన రాజకీయ ఖాళీని భర్తీ చేయడం. మూడోది.. చంద్రశేఖర్ ఆజాద్ ప్రభావం మరింత విస్తరించకుండా అడ్డుకోవడం.
‘‘బీజేపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఎన్నికల పోరును ద్విముఖం నుంచి చతుర్మఖ పోటీగా మార్చే దాని ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి సమాజ్ వాదీ పార్టీ బీజేపీ ఎన్నికల లెక్కలకు, చంద్రశేఖర్ ఆజాద్ రాజకీయా ఆశయాలకు గట్టి దెబ్బ కొట్టడం అత్యవసరం. ఆగ్రా దళిత రాజకీయాలకు రాజధాని, ఇది బ్రజ్, అవధ్ ప్రాంతాలపై విస్తృత ప్రభావాన్ని చూపుతుంది’’ అని దళిత మేధావి కార్యకర్త రవికాంత్ చందన్ అన్నారు.

ఆగ్రానే ఎందుకు..

ఆగ్రా ప్రాంతంలో షెడ్యూల్డ్ కులాల జనాభా గణనీయంగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ ప్రాంతంలో షెడ్యూల్డ్ కులాల జనాభా దాదాపు 23 శాతం. అత్యంత వెనుకబడిన వర్గాలను కూడా కలిపితే ఈ వాటా సుమారు 27 శాతానికి చేరుతుంది.
గతంలో ఈ ప్రాంతం మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి బలమైన కంచుకోటగా ఉండేది. ముఖ్యంగా జాటవ్ ఓటర్లు ఇప్పటికీ మాయావతికి మద్దతుగా ఉన్నారు. అయితే జాటవేతర దళితుల్లో గణనీయమైన వర్గం 2014 నుంచి బీజేపీ వైపు మళ్లింది. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో వారిలో కొంతమంది మళ్లీ ఇండియా కూటమి వైపు మొగ్గు చూపినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇదే సమయంలో బీఎస్పీ బలహీనపడటంతో ఏర్పడిన రాజకీయ ఖాళీని చంద్రశేఖర్ ఆజాద్ భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో నాగినా స్థానం నుంచి ఆయన విజయం సాధించారు. ఆ తర్వాత అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎంతో కలిసి పశ్చిమ ఉత్తరప్రదేశ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఆజాద్ సమాజ్ పార్టీ విస్తరణకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆజాద్‌కు దళిత యువతలో పెరుగుతున్న ఆదరణను అడ్డుకోవడం కూడా అఖిలేశ్ వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది.
అయితే మాయావతిని ఇప్పుడే రాజకీయంగా తక్కువ అంచనా వేయలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డిసెంబర్ 6న ఈ ప్రాంతంలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఆమె ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.
ఆమె తిరిగి క్రియాశీలకంగా మారితే గణనీయమైన దళిత ఓటు బ్యాంకును ఆకర్షించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ‘‘ ఆగ్రా నుంచి భారీ దళిత ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా అఖిలేష్ యాదవ్ ఆజాద్ సవాల్ ను నేరుగా స్వీకరించి, బీఎస్పీ కోల్పోయిన పట్టును ఆయన తిరిగి పొందకుండా నిరోధించేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని వారణాసికి చెందిన సామాజిక కార్యకర్త ‘జస్టిస్ లిబర్జీ ఈక్వాలిటీ, దళిత్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా’ రచయిత లెనిన్ రఘువంశీ అన్నారు.

బీజేపీకి పగుళ్లు..

మరోవైపు ఆగ్రాలో బీజేపీ ఆధిపత్యానికి కూడా కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. 2017, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆగ్రాలోని మొత్తం తొమ్మిది స్థానాలను బీజేపీ గెలుచుకుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
దళితులు, యాదవేతర ఓబీసీ వర్గాల్లో కొంత అసహనం కనిపిస్తోందని, ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని అఖిలేశ్ భావిస్తున్నారు. ఇటీవల జరిగిన ఆగ్రా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ విజయం సాధించడం కూడా ఆ పార్టీకి కొంత ఊపునిచ్చింది.
దళితుల్లో బీజేపీపై అసంతృప్తికి ప్రధాన కారణాలు.. రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడం, దళితులపై దాడులు పెరగడం, వారి జీవన పరిస్థితుల్లో ఆశించిన మార్పు రాకపోవడం. ఆగ్రాలోని లోహామండిలో వాల్మీకి పారిశుద్ధ్య కార్మికులు కనీస సౌకర్యాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, ఉపాధి అవకాశాలు లేకపోవడంపై నిరసనలు వ్యక్తం చేశారు. సమీపంలోని హాథ్రస్, ఫిరోజాబాద్ ప్రాంతాల్లోనూ దళిత వర్గాలు పాడైపోయిన ఇళ్లు, మురుగునీటి సమస్యలు, తాగునీటి కొరత, దళిత కాలనీల్లో కొనసాగుతున్న వివక్షపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
దళితులపై దాడులకు సంబంధించిన గణాంకాలు కూడా ఈ రాజకీయ చర్చకు ప్రాధాన్యం కల్పిస్తున్నాయి. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ పార్లమెంటులో వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో దళితులపై దాడుల కేసులు 2019లో 11,829 ఉండగా, 2024 నాటికి 14,642కి పెరిగాయి.
ఈ పరిస్థితులను ప్రస్తావిస్తూ అఖిలేశ్ యాదవ్ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రవ్యాప్తంగా 200కు పైగా అంబేడ్కర్ విగ్రహాలను ధ్వంసం చేశారని ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన రక్షణలను ప్రభుత్వం బలహీనపరుస్తోందని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేత, నిరుద్యోగం, రిజర్వేషన్ల అమలులో అక్రమాలపైనా ప్రశ్నలు లేవనెత్తారు.
అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని, ఖాళీగా ఉన్న రిజర్వుడు పోస్టులను భర్తీ చేస్తామని అఖిలేశ్ హామీ ఇచ్చారు. అంబేడ్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించడంతో పాటు ఆగ్రా పాదరక్షల పరిశ్రమలో పనిచేసే కార్మికులకు మెరుగైన వేతనాలు అందించేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
ఇక ఎన్నికల్లో దళితులకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించడంపైనా సమాజ్‌వాదీ పార్టీ దృష్టి పెట్టింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో సాధారణ నియోజకవర్గాల నుంచి కూడా దళిత అభ్యర్థులను బరిలోకి దింపిన వ్యూహాన్ని 2027లో మరింత విస్తరించాలని భావిస్తోంది.
అయోధ్య నుంచి అవధేశ్ ప్రసాద్, మీరట్ నుంచి సునీతా వర్మలను పోటీకి నిలిపిన విధానాన్ని మరిన్ని స్థానాల్లో అమలు చేయాలని యోచిస్తోంది. కనీసం 15 నుంచి 20 స్థానాల్లో దళిత అభ్యర్థులకు అవకాశం కల్పిస్తే పశ్చిమ యూపీతో పాటు అవధ్ ప్రాంతంలోనూ రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మొత్తంగా ‘దమ్‌దార్ దళిత్’ నినాదం కేవలం ఒక రాజకీయ కార్యక్రమానికి పరిమితం కాదని స్పష్టమవుతోంది. బీఎస్పీ బలహీనతను తనకు అనుకూలంగా మార్చుకోవడం, చంద్రశేఖర్ ఆజాద్ ప్రభావాన్ని నియంత్రించడం, బీజేపీ దళిత ఓటు బ్యాంకులో చీలిక తీసుకురావడం.. ఇలా మూడు లక్ష్యాలతో అఖిలేశ్ యాదవ్ ముందుకు సాగుతున్నారు. అయితే ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుంది? దళిత ఓటర్లు ఎవరికి మద్దతుగా నిలుస్తారు? అన్నది 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తేలనుంది.


Read More
Next Story