
కశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి.. సీఆర్పీఎఫ్ చెక్‌పోస్టుపై కాల్పులు..
ముగ్గురు జవాన్లకు గాయాలు
జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకున్నారు. కుల్గాం జిల్లాలోని సీఆర్పీఎఫ్ చెక్‌పోస్టుపై ఇద్దరు భారీగా ఆయుధాలు ధరించిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దాడి అనంతరం ఉగ్రవాదులు సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోవడంతో భద్రతా బలగాలు భారీ స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టాయి.
బుధవారం మధ్యాహ్నం సుమారు 2.15 గంటల సమయంలో కుల్గాం జిల్లాలోని మీర్ బజార్ సమీపంలో ఈ దాడి జరిగింది. శ్రీనగర్‌కు సుమారు 75 కిలోమీటర్ల దూరంలో, వ్యూహాత్మకంగా కీలకమైన జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారికి కేవలం కిలోమీటరు దూరంలో ఈ ప్రాంతం ఉంది.
అధికారుల వివరాల ప్రకారం.. చెక్‌పోస్టుకు సుమారు 50 మీటర్ల దూరంలో ఉన్న దట్టమైన చెట్ల పొదల నుంచి ఇద్దరు వ్యక్తులు కాలినడకన వచ్చారు. వారిలో ఒకరు సీఆర్పీఎఫ్ సిబ్బందిపై కాల్పులు జరపగా, మరొకరు అతనికి రక్షణగా నిలిచారు. అనంతరం ఇద్దరూ అదే అటవీ మార్గం గుండా నౌపూర్ వైపు పారిపోయారు.
తొలుత ఉగ్రవాదులు మోటార్‌సైకిల్‌పై వచ్చి దాడి చేసినట్లు సమాచారం వెలువడింది. అయితే ఆర్మీ, ఇతర భద్రతా సంస్థలు సంయుక్తంగా చేపట్టిన తనిఖీల్లో ద్విచక్ర వాహనం ఉపయోగించినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు. దాడికి ముందు, ఆ తర్వాత ఉగ్రవాదులు దట్టమైన చెట్లను అడ్డుగా ఉపయోగించుకున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ కాల్పుల్లో ఒక సీఆర్పీఎఫ్ జవానుకు పొత్తికడుపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. మరో జవానుకు చేతిపై తూటా గాయమవగా, ఇంకొకరికి కాలు, పాదం భాగాల్లో గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉన్న ఆసుపత్రికి తరలించారు.
దాడి జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు ప్రారంభించాయి. అదనపు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు సాయుధ వాహనాలను మోహరించాయి. స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రావద్దని మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేశాయి. సమీపంలోని దుకాణాలు, ఇతర వాణిజ్య సంస్థల్లోని సీసీటీవీ దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నాయి.
ఘటనా స్థలంలో మోటరోలా మొబైల్ ఫోన్, ఒక సిమ్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల గుర్తింపు ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు. అయితే నిషేధిత లష్కరే తోయిబా సంస్థకు చెందిన స్థానిక కమాండర్ మహమ్మద్ లతీఫ్ భట్ ప్రమేయం ఉండవచ్చని భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. గత జూలైలో షోపియాన్‌లో జరిగిన భద్రతా ఆపరేషన్ నుంచి అతను తప్పించుకున్నట్లు అధికారులు గుర్తుచేస్తున్నారు.
మరోవైపు, ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి ముందుగానే నిఘా వర్గాల నుంచి నిర్దిష్ట సమాచారం అందినట్లు అధికారులు తెలిపారు. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతో పాటు వెంటనే స్పందించారని, దీంతో ఉగ్రవాదులు భారీ ప్రాణనష్టం కలిగించే ప్రయత్నంలో విఫలమయ్యారని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా బుధవారం కుల్గాం జిల్లాలో పర్యటించారు. అయితే ఆయన దాడి జరిగిన ప్రాంతానికి సమీపంలో లేరు. ఈ ఘటనపై జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా స్పందించారు. గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అదే సమయంలో కేంద్ర పాలిత ప్రాంతంలో శాంతిభద్రతల పరిస్థితిపై లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలనా యంత్రాంగాన్ని ప్రశ్నించారు.
ఉగ్రవాదం పూర్తిగా అంతమైందన్న అధికారిక ప్రకటనలకు, వరుస హింసాత్మక ఘటనలకు మధ్య వ్యత్యాసం ఉందని పేర్కొంటూ భద్రతా వ్యూహాన్ని మరోసారి సమీక్షించాలని సూచించారు. స్థానిక ప్రజలను కూడా భద్రతా వ్యవస్థలో భాగస్వాములను చేయాలని కోరారు.
పీడీపీ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. సమాజంలో హింసకు తావు లేదని, గాయపడిన జవాన్లు పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కుల్గాం జిల్లాలో ఇటీవల కూడా పలు ఉగ్రవాద ఘటనలు చోటుచేసుకున్నాయి. జూలై 31న ఇటుక బట్టీలో పనిచేస్తున్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఇద్దరు కార్మికులు హత్యకు గురయ్యారు. అదే నెలలో పొరుగున ఉన్న అనంత్‌నాగ్‌లో ఓ పోలీసు కానిస్టేబుల్‌పై కూడా కాల్పులు జరిగాయి. తాజా దాడితో ఆ ప్రాంతంలో భద్రతాపరమైన ఆందోళనలు మరోసారి తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాల గాలింపు కొనసాగుతోంది.
మరో వైపు నిన్న అపహరణకు ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతదేహాలు అటవీ ప్రాంతంలో లభ్యం అయ్యాయి. వీరి మృతదేహాలపై బుల్లెట్ గాయాలు ఉన్నాయని తేలింది. వీరి సర్వీస్ ఆయుధాలు కూడా మిస్ అయినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు ఉగ్రవాద కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
Next Story

