
అయోధ్య రామాలయం
నేడు అయోధ్య ట్రస్ట్ కీలక సమావేశం
విరాళాల వివాదాల నేపథ్యంలో అందరి చూపు సమావేశం పైనే
అయోధ్య రామాలయం విరాళాల విషయంలో వివాదాల వస్తున్న నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సోమవారం సమావేశం కానుంది. ఈ సమావేశంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రాలు సమర్పించిన రాజీనామాల భవితవ్యం ప్రధాన ఎజెండాగా ఉండే అవకాశం ఉంది. ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ ఆశ్రమమైన మణి రామ్ ఛావనిలో జరగనున్న ఈ సమావేశం, నిధుల దుర్వినియోగం ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా జరుగుతోంది.
ఈ చర్చలకు సాధారణ, పదవీరీత్యా సభ్యులందరూ హాజరు కావాలని ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి కోరారు. పదవీరీత్యా సభ్యులలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ప్రశాంత్ లోఖండే, యూపీ ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి సంజయ్ ప్రసాద్, అయోధ్య జిల్లా మేజిస్ట్రేట్ శశాంక్ త్రిపాఠి, ప్రధానమంత్రి మాజీ ముఖ్య కార్యదర్శి నృపేంద్ర మిశ్రా ఉన్నారు.
కీలక పాలనా నిర్ణయాలు..
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ట్రస్ట్ అధ్యక్షుడు, 89 ఏళ్ల దాస్ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అయోధ్య వర్గాలు తెలిపాయి. మూత్రనాళ ఇన్ఫెక్షన్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో దాస్ జూన్ 29న ఆసుపత్రిలో చేరారని, శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారని లక్నోలోని ఆసుపత్రి వర్గాలు పీటీఐకి తెలిపాయి.
వయసు సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా ప్రయాణించలేని సీనియర్ ట్రస్టీ కె. పరాశరన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొనే అవకాశం ఉందని వర్గాలు పీటీఐకి తెలిపాయి. విరాళాల దొంగతనం వివాదంతో సంబంధం ఉన్నట్లు తేలడంతో రాజీనామా చేసిన చంపత్ రాయ్, అనిల్ మిశ్రాల రాజీనామాలపై ట్రస్ట్ చర్చించే అవకాశం ఉందని వర్గాలు ఇంకా తెలిపాయి.
వారి రాజీనామాలను ఆమోదిస్తే, ట్రస్ట్ కార్యకలాపాల కోసం కొత్త పరిపాలనా నిర్మాణ ప్రణాళికలను కూడా సమావేశంలో పరిశీలించే అవకాశం ఉంది. ప్రత్యేక ఆహ్వానితుడు గోపాల్ రావు పాత్రపై కూడా చర్చించే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.
అదనంగా నిధుల దుర్వినియోగం కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మధ్యంతర నివేదికపై సమావేశంలో వివరణ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే రామ మందిర భవిష్యత్ నిర్వహణ ప్రణాళికపై కూడా చర్చించే అవకాశం ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ చేయని ఆదాయ వ్యయాల నివేదిక, బ్యాలెన్స్ షీట్, ఇతర ఆర్థిక వివరాలను ఆమోదం కోసం సమర్పించనున్నారని వర్గాలు తెలిపాయి.
అంతేకాకుండా, రామ మందిర నిర్వహణను పర్యవేక్షించేందుకు ఒక ముఖ్య కార్యనిర్వహణాధికారి నియామకానికి సంబంధించిన చర్చలు కూడా ఈ సమావేశంలో జరిగే అవకాశం ఉందని వర్గాలు పీటీఐకి తెలిపాయి.
విచారణల నడుమ ట్రస్ట్ సమావేశం “సమావేశానికి 14 మంది ట్రస్టీలందరినీ ఆహ్వానించాం. వారందరూ పాల్గొంటారని ఆశిస్తున్నాం,” అని ప్రత్యేక ఆహ్వానితుడు గోపాల్ రావు విలేకరులతో అన్నారు. ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి వారందరికీ సమాచారం పంపారని ఆయన తెలిపారు.
ప్రస్తుతం ట్రస్ట్‌లో అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్, వాసుదేవానంద్ సరస్వతి, విశ్వప్రసన్నతీర్థ, పరమానంద్ గిరి, కోశాధికారి గోవింద్ దేవ్ గిరి, కృష్ణ మోహన్, దినేంద్ర దాస్, కె పరాశరన్‌లతో సహా 11 మంది సాధారణ సభ్యులు ఉన్నారు.
చంపత్ రాయ్, అనిల్ మిశ్రాల రాజీనామాలు, ఇటీవల ట్రస్టీ బిమ్లేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా మరణంతో, అధ్యక్షుడి గైర్హాజరీలో సమావేశాలకు అధ్యక్షత వహించడానికి ట్రస్ట్‌లో ప్రస్తుతం ఉపాధ్యక్షుడు లేరని వర్గాలు చెబుతున్నాయి.
ఆరోపిత నిధుల దుర్వినియోగంపై రెండు సమాంతర విచారణలు జరుగుతున్న తరుణంలో ఈ సమావేశం జరుగుతోంది. ట్రస్ట్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, సిట్ పరిపాలనా విచారణ జరుపుతోంది. ఈ విచారణను జూలై నెలాఖరు వరకు పొడిగించారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, చంపత్ రాయ్, అనిల్ మిశ్రా, ప్రత్యేక ఆహ్వానితుడు గోపాల్ రావుల వాంగ్మూలాలను సిట్, పోలీసులు ఇద్దరూ నమోదు చేశారు. అయినప్పటికీ, ట్రస్ట్‌కు చెందిన ఈ ముగ్గురు కార్యకర్తలలో ఎవరిపైనా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు.
Next Story

