
గంగానదిలో పడవబోల్తా, పదమూడు మంది పిల్లల మృతి
రాత్రి ప్రమాదం జరిగిందని వెల్లడించిన అధికారులు
బీహార్ లోని వైశాలి జిల్లాలో మంగళవారం సాయంత్రం గంగానదిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 20 మంది ప్రయాణీకులతో వెళ్తున్న పడవ గంగానదీలో బోల్తా పడటంతో 13 మంది మరణించారు. వీరి అందరి వయస్సు 15 ఏళ్ల లోపే అని అధికారులు ప్రకటించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ప్రతి బాధిత కుటుంబానికి రూ. 4 లక్షలు అందిస్తామని తెలిపారు. వైశాలి జిల్లా మేజిస్ట్రేట్ వర్షా సింగ్ ప్రకారం.. జిల్లా కేంద్రానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాఘోపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి 8.30 నిమిషాలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ప్రధానంగా రాంపూర్ శ్యామ్ చంద్ గ్రామానికి చెందిన ప్రయాణీకులు, నదీకి అవతల ఉన్న గ్రామంలో జరిగే విందుకు హాజరయ్యేందుకు పడవలో వెళ్తున్నారు.
‘‘పడవలో 15 నుంచి 20 మంది ప్రయాణిస్తున్నారు. వారిలో ఎక్కువ మంది పిల్లలే ఉన్నారు. కచ్చితమైన సంఖ్య ఇంకా తెలియదు. ఇప్పటి వరకూ పదమూడు మృతదేహాలు వెలికి తీశారు. మృతులందరూ 15 ఏళ్ల లోపే ఉన్నారు’’ అని విలేకరులతో చెప్పారు.
‘‘గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. స్థానిక డైవర్లకు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం సహకరిస్తోంది. ఇప్పటివరకూ ఏడుగురు పిల్లలను రక్షించారు. వీరికి పాట్నాలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అంతా సురక్షితంగా ఉన్నారు’’ అని సింగ్ తెలిపారు.
రాఘోపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ ఎక్స్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘‘నేను స్థానిక యంత్రాంగం తో మాట్లాడాను. ఇప్పటి వరకూ 14 మృతదేహాలు లభ్యం అయినట్లు తెలిసింది’’ అని పేర్కొన్నారు. బీహార్ పడవ దుర్ఘటనన తీవ్రంగా బాధాకరమైనదిగా అభివర్ణించారు. బాధితులను పరామర్శిస్తానని ఆయన ప్రకటించారు.
Next Story

