
‘‘అయోధ్యకి రా.. అక్కడే ఇద్దరం పోటీ చేద్దాం’’
సమాజ్ వాదీ పార్టీకి యూపీ సీఎం యోగీ సవాల్
అయోధ్య కేంద్రంగా ఇద్దరు అగ్ర నాయకులు పోటీ పడబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి యూపీ వర్గాలు. 2027 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం యోగీ ఆదిత్యనాథ్, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు జరుగుతున్నాయి.
బలరాంపూర్ జిల్లాలో రూ. 800 కోట్లకు పైగా విలువైన 78 ప్రాజెక్ట్ లను ప్రారంభించారు. శంకుస్థాపన సందర్భంగా యోగీ ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ‘‘అఖిలేష్ జీ.. మీ కోసం నాదొక ప్రతిపాదన. మీరు కూడా శ్రీ అయోధ్య ధామ్ నుంచి నామినేషన్ దాఖలు చేయండి.. నేను కూడా అక్కడే నామినేషన్ దాఖలు చేస్తాను’’ అని ఆయన అన్నారు.
అయోధ్య సవాల్..
రామ మందిరానికి వచ్చిన విరాళాలను అక్రమంగా తరలించారన్న వివాదాన్ని ఆయన ప్రస్తావించారు. అయోధ్యలో బీజేపీని ఓడించడానికి తమ పార్టీ నుంచి ఒక యువ అభ్యర్థి సరిపోతారని యాదవ్ అన్నారు. ఆ నియోజక వర్గం నుంచి సమాజ్ వాదీ పార్టీ ఇప్పటికే తేజ్ నారాయణ్ పాండేను తమ అభ్యర్థిని ప్రకటించింది.
కొన్నేళ్లుగా బీజేపీ ఆలయ రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉన్న అయోధ్య నియోజకవర్గం నుంచి 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని యాదవ్ గురువారం ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు.
‘‘మేము మా అభ్యర్థిని ప్రకటించినప్పటి నుంచి బీజేపీ వరుసగా సర్వేలు నిర్వహిస్తూనే ఉంది. కానీ ప్రతి సర్వేలోనూ వెనకబడిపోతోంది. అయోధ్యకు కొత్త అభ్యర్థిని కనుగొనలేకపోయారని ఇప్పుడు మేము వింటున్నాము. గొప్ప గొప్ప వాగ్ధానాలు చేసే ముఖ్యమంత్రికి అంత నమ్మకం ఉంటే.. ఆయనే స్వయంగా అయోధ్యనుంచి ఎన్నికల్లో పోటీ చేసి నిరూపించుకోవాలి’’ అని సమాజ్ వాదీ అధినేత అన్నారు.
విరాళాల వివాదం..
ఈ సవాల్ కు స్పందిస్తూ అయోధ్య బీజేపీకి కేవలం ఎన్నికల పోరాట క్షేత్రం మాత్రమే కాదని, అది ఒక పవిత్ర స్థలమని యోగీ ఆదిత్య నాథ్ అన్నారు.
‘‘సమాజ్ వాదీ పార్టీ కలవరపడింది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఆయన(యాదవ్) ఇక చూడలేకపోతున్నారు. దానిని గుర్తించే సామర్థ్యం ఆయనకు లేదు. అయోధ్య నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన నాకు సవాల్ విసురుతున్నాడు. మీరు అయోధ్య నుంచి నామినేషన్ దాఖలు చేయండి. నేను కూడా అక్కడి నుంచి పోటీ చేస్తాను. ఒక్కసారి మన అదృష్టాన్ని పరీక్షించుకుందాం.. మీ అనుచరుల ద్వారా ఎందుకు పోరాడుతున్నారు? పోటీ ముఖాముఖిగా జరగాలి’’ అని సీఎం అన్నారు.
అయితే ఈ సవాల్ నుంచి అఖిలేష్ యాదవ్ పక్కకు తప్పుకున్నారు. అయోధ్య లో విరాళాల దొంగలను ఓడించడానికి మా పీడీఏ కాపలాదారు ఒకరు చాలు.. దొంగలకు క్లీన్ చిట్ ఇచ్చేవారు నేరంలో భాగస్వాములే.. ప్రజలు వారి అహంకారాన్ని అంతం చేస్తారు. మీరు లోక్ సభను మర్చిపోయారా? అని ఆయన ఎక్స్ పోస్ట్ లో పేర్కొన్నారు.
Next Story

