
సహాయక చర్యల్లో నిమగ్నమైన పోలీసులు, ఫైర్ సిబ్బంది
ఢిల్లీ అగ్ని ప్రమాదంలో పెరుగుతున్న మృతులు
ఇప్పటి వరకూ 21 మంది మృతి, విదేశీయులు ఉన్నట్లు సమాచారం
ఈ రోజు ఉదయం ఢిల్లీలోని మాల్వీయా నగర్‌లో ఒక ఒక రెస్టారెంట్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 21 మంది మరణించారు. ఇందులో పలువురు విదేశీయులు కూడా ఉన్నట్లు తెలిసింది. అగ్నిప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు.
మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఉదయం 8.50 గంటల ప్రాంతంలో తమకు మంటల గురించి సమాచారం అందిందని అగ్నిమాపక దళ అధికారులు తెలిపారు. వెంటనే, మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రమాదం జరిగిన లెమన్ గ్రీన్ రెస్టారెంట్‌లోని సంఘటనా స్థలానికి 10 ఫైర్ టెండర్లను పంపారు.
మాల్వీయా నగర్‌లోని రద్దీ ప్రాంతమైన హౌజ్ రాణిలో ఉన్న ఫ్లోరిష్ స్టే బి&బిలో ఈ మంటలు చెలరేగాయి. ఢిల్లీ ఫైర్ సర్వీస్ (డిఎఫ్ఎస్) అధికారి ప్రకారం, ప్రాథమిక స్పందనలో భాగంగా రెండు వాటర్ టెండర్లు, రెండు వాటర్ బౌజర్లు, ఒక క్విక్ రెస్పాన్స్ వాహనం, అనేక ఇతర అగ్నిమాపక యూనిట్లు రంగంలోకి దిగాయి.
సహాయక చర్యలు ప్రారంభం..
భవనంలో ప్రజలు చిక్కుకున్నారని నివేదికలు రావడంతో సహాయక బృందాలు ఆపరేషన్ ప్రారంభించాయి. అగ్నిమాపక చర్యల సమయంలో, డీఎఫ్ఎస్ సిబ్బంది రెస్టారెంట్ బేస్‌మెంట్‌లోకి ప్రవేశించి, లోపల చిక్కుకుపోయిన ముగ్గురిని బయటకు తీశారు. బాధితులను వైద్య చికిత్స కోసం క్యాట్స్ అంబులెన్స్‌ల ద్వారా ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి తెలియరాలేదు.
"మాకు కాల్ వచ్చిన వెంటనే మేము డీడీఎంఏ సెల్‌ను అప్రమత్తం చేశాము. ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక రెస్టారెంట్ నడుస్తోందని మాకు తెలిసింది. అగ్నిప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెలికితీశారు.
గాయపడిన వారితో సహా 7-8 మందిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పై అంతస్తులలోని కొందరు, స్థానికులు రోడ్డుపై పరిచిన పరుపులపై భవనం నుంచి దూకారు," అని దక్షిణ జిల్లా డీడీఎంఏ ఎస్డీఎం జితేంద్ర కుమార్ ఈ రోజు ఉదయం మీడియాకు తెలిపారు. మృతులలో చాలామంది విదేశీయులు, ప్రధానంగా మధ్య ఆసియా, ఆఫ్రికా దేశాలకు చెందినవారని అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.
దిగ్భ్రాంతికరమైన దృశ్యాలు
దట్టమైన పొగ, మంటల కారణంగా బయటపడే మార్గం లేకపోవడంతో ఒక మహిళ తన చిన్న బిడ్డను పట్టుకుని భవనం మూడో అంతస్తు నుంచి కిందకు దూకినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అత్యవసర సేవల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకనే లోపే, పరుపుల దుకాణాల యజమానులతో సహా స్థానికులు కిందకు పరుగెత్తుకొచ్చి పరుపులను నేలపై పరిచారు.
"ఆమె బిడ్డను గట్టిగా పట్టుకుని ఉంది, బయటపడటానికి మరో మార్గం లేకపోవడంతో దూకేసింది. అప్పటికే ప్రజలు భవనం కింద పరుపులు పరిచి ఉంచారు. ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు, కానీ ఆమెకు గాయాలైనట్లు కనిపించింది," అని ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పాడు.
ఆ మహిళ బిడ్డతో పాటు పరుపుల్లో ఒకదానిపై పడగా, ఇద్దరినీ వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. విలేకరులతో మాట్లాడుతూ, మరో ప్రత్యక్ష సాక్షి తాను ఆ ప్రాంతం గుండా వెళుతున్నప్పుడు ఉదయం 9.30 గంటల ప్రాంతంలో భవనం నుంచి మంటలు, పొగ దట్టంగా రావడం గమనించానని చెప్పాడు.
"మంటల నుంచి తప్పించుకోవడానికి నలుగురు నుంచి ఆరుగురు వ్యక్తులు అద్దాలు పగలగొట్టి భవనం నుంచి దూకడం నేను చూశాను. కింద పడటంతో ఒక వ్యక్తి కాలు విరిగినట్లు కనిపించింది" అని అతను చెప్పాడు. ఈ ఘటనపై స్పందిస్తూ, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్-గ్రేషియా ప్రకటించారు.
"ఢిల్లీలోని మాల్వీయా నగర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. ప్రియమైన వారిని కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. బాధితులకు అధికారులు అన్ని విధాలా సాయం అందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్-గ్రేషియా అందజేయబడుతుంది. గాయపడిన వారికి రూ. 50,000 ఇస్తామని పీఎంఓ కార్యాలయం ట్వీట్ చేసింది. ఈ ఘటనపై ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ కూడా స్పందించారు.
ప్రభుత్వం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది..
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ, ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే ఢిల్లీ ఫైర్ సర్వీసెస్, ఢిల్లీ పోలీస్, డిడిఎంఏ, క్యాట్స్ అంబులెన్స్ సర్వీసెస్, ఇతర అత్యవసర సహాయక సంస్థల బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని, ప్రభుత్వం పరిస్థితిని పర్యవేక్షిస్తోందని తెలిపారు.
"ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే, ఢిల్లీ ఫైర్ సర్వీసెస్, ఢిల్లీ పోలీస్, డిడిఎంఏ, క్యాట్స్ అంబులెన్స్ సర్వీసెస్, ఇతర అత్యవసర సహాయక సంస్థల బృందాలను సమీకరించి, సహాయక చర్యలు చేపట్టారు. వారి వేగవంతమైన స్పందన వల్ల ప్రభావిత ప్రాంతాల నుంచి పలువురిని రక్షించి, సురక్షిత ప్రాంతాలకు తరలించడం సాధ్యమైంది. ఢిల్లీ ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని వైద్య సహాయ సహకారాలు అందిస్తున్నారు," అని ఆమె ఎక్స్ లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.
Next Story

