
‘సర్‘ పై అసంతృప్తి ఉన్నా.. యూపీలో నిరసనలు ఎందుకు లేవు?
యోగీ ఆదిత్యనాథ్ చర్యలు, చొరవ తీసుకోని ఎస్పీ
దేశ రాజధానిలో ‘సర్’ను వ్యతిరేకిస్తూ విపక్షాలు ఉధృతంగా ఉద్యమాలు చేస్తున్నసంగతి తెలిసిందే. దేశంలో జనాభాపరంగా, రాజకీయంగా ఎంతో ముందున్న ఉత్తరప్రదేశ్ లోనూ సర్ పూర్తయింది. ఈ తుది జాబితా నుంచి దాదాపు రెండు కోట్ల ఓట్లు తొలగిపోయాయి.
వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. కానీ ఇక్కడ ఓటు చోరి అంటూ ఎలాంటి ఆందోళనలు కనిపించడం లేదు. అధికార బీజేపీని ఎదుర్కొనేందుకు సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్మించలేకపోతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన తుది ఓటరు జాబితాలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన దాదాపు రెండు కోట్ల మంది పేర్లు తొలగిపోయాయి. మరోవైపు ఉద్యోగాల కొరత, పరీక్షా పేపర్ల లీకులు, పెరుగుతున్న ధరలు ప్రజల్లో అసంతృప్తిని పెంచుతున్నాయి. ఈ పరిస్థితులను రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశం ప్రతిపక్షాలకు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆ ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో జరగడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఢిల్లీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు ఇండి కూటమి నేతలు ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొంటున్నారు. వామపక్షాలు, విద్యార్థి సంఘాలు కూడా ఆందోళనలను ముందుకు తీసుకెళ్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సైతం ఢిల్లీలో జరిగిన నిరసనల్లో పాల్గొన్నారు. అయితే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించే ఉద్యమాన్ని చేపట్టలేదనే విమర్శలు వస్తున్నాయి.
అయితే రాష్ట్రంలో ఎస్ఐఆర్పై నిరసనలు పూర్తిగా లేవని చెప్పలేం. అక్టోబర్ మొదటి వారంలో సమాజ్‌వాదీ పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షణ వారోత్సవాలు, ఓటును కాపాడుకుందాం.. దేశాన్ని రక్షించుకుందాం అనే ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. ఢిల్లీలో నిరసన సందర్భంగా తమ సీనియర్ నేతల పట్ల దురుసుగా వ్యవహరించారనే ఆరోపణలతో కాంగ్రెస్ బ్లాక్ డే పాటించింది. ప్రయాగ్‌రాజ్, వారణాసి వంటి ప్రాంతాల్లోనూ స్థానిక నాయకులు, పౌర సంఘాలు ఈ అంశంపై ఆందోళనలు చేపట్టాయి.
ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా గత ఏడాది డిసెంబర్ నుంచే నిరసనలు నిర్వహిస్తున్నామని సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అభిషేక్ బజ్పాయ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ కూడా ఈ అంశాన్ని నిరంతరం లేవనెత్తుతున్నామని చెబుతోంది. అయినప్పటికీ, ఈ కార్యక్రమాలన్నీ విడివిడిగానే సాగుతున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ జాతీయ స్థాయిలో కలిసి పనిచేస్తున్నా.. ఉత్తరప్రదేశ్‌లో మాత్రం ఉమ్మడి కార్యాచరణ కనిపించడం లేదని విమర్శకులు అంటున్నారు.
లక్నోకు చెందిన సామాజిక కార్యకర్త అరుంధతి ధురు అభిప్రాయం ప్రకారం, ఎన్నికలు సమీపిస్తున్నా ప్రతిపక్షాల స్పందన పరిమిత నిరసనలు, ప్రచార కార్యక్రమాలకే పరిమితమవుతోంది. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని విస్తృత ఉద్యమంగా మార్చేందుకు అవసరమైన క్షేత్రస్థాయి సమీకరణ కనిపించడం లేదని ఆమె పేర్కొన్నారు.
మరోవైపు వామపక్షాలు, విద్యార్థి సంఘాలు ఉత్తరప్రదేశ్‌లోనూ ఢిల్లీ తరహా ఉద్యమాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ రాష్ట్రంలో వాటి సంస్థాగత బలం, వనరులు పరిమితంగా ఉండటంతో పెద్ద సంఖ్యలో ప్రజలను సమీకరించడం కష్టమవుతోందని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ లక్నో జిల్లా కార్యదర్శి రమేశ్ సింగ్ సెంగర్ తెలిపారు.
సోమవారం సెంగర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం లక్నోలో ర్యాలీ నిర్వహించి, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఎస్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించింది. చిన్న పార్టీలే నిరసనలు చేపడుతున్నప్పుడు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలను సమీకరించగల సమాజ్‌వాదీ పార్టీ వంటి పార్టీలు మరింత చొరవ చూపాలని ఆల్ ఇండియా పీపుల్స్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు ఎస్.ఆర్. దారాపురి అభిప్రాయపడ్డారు.
ఉత్తరప్రదేశ్‌లో నిరసనలు పరిమితంగా ఉండటానికి ప్రభుత్వ చర్యలపై ఉన్న భయం కూడా ఒక కారణమని పౌరహక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ హయాంలో నిరసనకారులపై అరెస్టులు, ఆస్తుల జప్తు, బుల్డోజర్ చర్యలు వంటి పరిణామాలు ప్రజల్లో ఆందోళన కలిగించాయని వారు పేర్కొంటున్నారు.
2019 డిసెంబర్లో పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టికకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల సమయంలో ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర నిర్బంధ చర్యలు చోటుచేసుకున్నాయి. ఆ నిరసనల్లో 22 మంది మరణించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వందలాది మందిని అరెస్టు చేయగా, వేలాది మందిని ముందస్తు నిర్బంధంలోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించారనే ఆరోపణలపై కొందరికి పరిహారం చెల్లించాలని కూడా ఆదేశించారు. లక్నోలో 28 మందికి రూ.64 లక్షలకు పైగా పరిహారం చెల్లించాలని ఆదేశించగా, వారి పేర్లు, ఫొటోలు, చిరునామాలను బహిరంగంగా ప్రదర్శించడంపై అలహాబాద్ హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ పరిణామాలు సాధారణ ప్రజల్లో కూడా నిరసనల్లో పాల్గొంటే వ్యక్తిగతంగా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయాన్ని పెంచాయని దారాపురి పేర్కొన్నారు. గృహ నిర్బంధం వంటి చర్యల వల్ల కూడా నిరసన తెలిపే అవకాశం తగ్గుతోందని ఆయన ఆరోపించారు.
ఇదిలా ఉండగా, కొందరు పౌరహక్కుల కార్యకర్తలు ఓటరు జాబితా నుంచి పేర్లు తొలగించిన ఘటనలను నమోదు చేస్తూ, బాధితులు తిరిగి తమ పేర్లను చేర్చుకునేందుకు సహాయం చేస్తున్నారు. అయితే ప్రభుత్వ దృష్టికి వస్తే చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో ఈ పనులను బహిరంగంగా కాకుండా రహస్యంగా కొనసాగిస్తున్నామని లక్నోకు చెందిన కార్యకర్త దీపక్ కబీర్ తెలిపారు.
మొత్తంగా, ఉత్తరప్రదేశ్‌లో ఎస్ఐఆర్పై అసంతృప్తి ఉన్నప్పటికీ, దానిని రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా మార్చడంలో ప్రతిపక్షాలు వెనుకబడినట్లు కనిపిస్తోంది. ప్రజల్లో ఉన్న ఆందోళనలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడం, స్థానిక స్థాయిలో కార్యకర్తలను బలోపేతం చేయడం కీలకమని పౌరహక్కుల సంఘాలు భావిస్తున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ అంశంపై ప్రతిపక్షాలు ఎలాంటి కార్యాచరణ చేపడతాయన్నది రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
Next Story

