ఎస్పీ, కాంగ్రెస్ పార్టీని అవమానించిందా?
x

ఎస్పీ, కాంగ్రెస్ పార్టీని అవమానించిందా?

130 సీట్లు అడిగితే 26 మాత్రమే ఆఫర్ చేయడంలో అర్థమేంటీ?


Click the Play button to hear this message in audio format

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ మధ్య సీట్ల పంపకాల వివాదం ముదురుతోంది. 2027 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని భావిస్తున్న ఈ రెండు పార్టీల మధ్య పొత్తు చర్చలు అనుకున్న దిశలో సాగడం లేదు.

కాంగ్రెస్ పార్టీ 130 అసెంబ్లీ స్థానాలు కావాలని కోరితే.. సమాజ్‌వాదీ పార్టీ మాత్రం కేవలం 26 స్థానాలే ఇస్తామని ప్రతిపాదించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అంతేకాదు.. ఆ 26 స్థానాల్లో కూడా కాంగ్రెస్‌కు గత ఎన్నికల్లో పెద్దగా బలం లేని నియోజకవర్గాలే ఎక్కువగా ఉండటంతో ఆ పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఎస్పీ బృందానికి నాయకత్వం వహిస్తున్న ప్రొఫెసర్ రామ్ గోపాల్ యాదవ్ 26 సీట్ల జాబితాను కాంగ్రెస్ యూపీ ఇన్ చార్జ్ రాజేంద్ర పాల్ గౌతమ్, రాష్ట్ర యూనిట్ చీఫ్ ఆరాధన మిశ్రా, సహరన్ పూర్ ఎంపీ ఇమ్రాన్ మసూద్, ఫరేందా ఎమ్మెల్యే వీరేందర్ చౌదరికి ఇచ్చారు.
‘‘ఈ జాబితాలో 2022 లో జరిగిన ఎన్నికలలో గెలిచిన రెండు సీట్లు, రెండో స్థానంలో నిలిచిన నాలుగు సీట్లు, 2000 ఓట్లు పొందిన మరో 20 సీట్లు ఉన్నాయి’’ అని యాదవ్ అన్నారు.
ఎస్పీ ప్రతినిధి బృందంలోని ఒక సభ్యుడు ‘ది ఫెడరల్’ తో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ కు మా సందేశం స్పష్టం చేశాం. అసమంజసమైన డిమాండ్లపై చర్చలు జరిపి సమయాన్ని వృథా చేసుకోవాలనుకోవడం లేదు. మేము వారికి ఏ ఫార్ములా ఆధారంగా సీట్లు ఇవ్వడానికి సిద్దంా ఉన్నామో స్పష్టంగా చెప్పాము. ఇప్పుడు వారు ఏ ప్రాతిపదికన 130 సీట్లు డిమాండ్ చేస్తున్నారో వివరించాలి’’ అని అన్నారు.

181 నుంచి 130కి తగ్గిన కాంగ్రెస్ డిమాండ్

వాస్తవానికి కాంగ్రెస్ మొదట ఉత్తరప్రదేశ్‌లోని 403 అసెంబ్లీ స్థానాల్లో 181 స్థానాలు కావాలని సమాజ్‌వాదీ పార్టీ ముందు ప్రతిపాదన ఉంచింది. అయితే ఎస్పీ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో తన డిమాండ్‌ను 130 స్థానాలకు తగ్గించింది.
నవంబర్ 23న రెండు పార్టీల మధ్య జరిగిన తొలి విడత చర్చలు కేవలం 20 నిమిషాల్లోనే ముగిశాయి. కాంగ్రెస్ తనకు కావాల్సిన 130 స్థానాల జాబితాను ఎస్పీ నేతలకు అందించింది. అయితే ఆ ప్రతిపాదనపై ఇరు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.
మరుసటి రోజు సమాజ్‌వాదీ పార్టీ తన ప్రతిపాదనను కాంగ్రెస్ ముందుంచింది. కాంగ్రెస్‌కు 26 స్థానాలు మాత్రమే కేటాయించగలమని స్పష్టం చేసింది.

26 స్థానాల వెనుక ఎస్పీ లెక్కలివే..

ఎస్పీ తరఫున చర్చల బృందానికి నాయకత్వం వహిస్తున్న సీనియర్ నేత రామ్ గోపాల్ యాదవ్ ఈ 26 స్థానాల ప్రతిపాదనను ధ్రువీకరించారు.
2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన రెండు స్థానాలు, రెండో స్థానంలో నిలిచిన నాలుగు నియోజకవర్గాలు, మిగిలిన 20 స్థానాల్లో కాంగ్రెస్‌కు కేవలం 2 వేల ఓట్లు మాత్రమే వచ్చాయని ఆయన వివరించారు.
అంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన ఓట్ల ఆధారంగానే సీట్ల కేటాయింపు ప్రతిపాదన చేసినట్లు ఎస్పీ చెబుతోంది. 130 స్థానాలు కావాలని కాంగ్రెస్ కోరడానికి సరైన కారణాలు ఏమిటో చెప్పాలని ఎస్పీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

చర్చల్లో వాగ్వాదం.. ఇదేమైనా హాస్యమా?

26 స్థానాల ప్రతిపాదనతో కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఎస్పీ నేత రామ్ గోపాల్ యాదవ్ ఈ జాబితాను కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ ముందు ఉంచారు.
ఈ సందర్భంగా ఇరు పార్టీల నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం. కాంగ్రెస్‌కు గౌరవప్రదమైన సీట్ల వాటా ఉండాలని పట్టుబడుతున్న ఇమ్రాన్ మసూద్.. ఎస్పీ ప్రతిపాదనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రతిపాదన చేస్తే చర్చలు కొనసాగించడంలో అర్థం ఏముందని ప్రశ్నించారు.
కాంగ్రెస్ కు కేటాయించడానికి ఎస్పీ సిద్దంగా ఉన్న 26 సీట్ల జాబితాను యాదవ్ ముందుంచిన వెంటనే సమావేశంలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుందని రెండు పార్టీలకు చెందిన ఒక్కో నాయకుడు ‘ది ఫెడరల్’ కు ధృవీకరించారు. కాంగ్రెస్ కు గౌరవప్రదమైన వాటా సీట్లు దక్కాలని గట్టిగా వాదించే గౌతమ్, మసూద్ ఇద్దరూ ఆగ్రహంగా స్పందించారు. ఎస్పీకి చెందిన యాదవ్, ఘోసీ ఎంపీ రాజీవ్ రాయ్ లతో మసూద్ ‘‘ఏం జోక్ చేస్తున్నారా’’ ఇలాంటి ఆఫర్లు ఇస్తే చర్చలు జరపడంలో అర్థం లేదు’’ అని అన్నారని సదరు వర్గాలు తెలిపాయి.
దీనికి రామ్ గోపాల్ యాదవ్ కూడా ఘాటుగానే స్పందించారు. కాంగ్రెస్‌కు 26 స్థానాల కంటే ఎక్కువ కేటాయించాల్సిన అవసరం లేదని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్‌కు చేసిన సహాయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ఆ ఎన్నికల్లో ఎస్పీతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేసి ఆరు స్థానాలను గెలుచుకుంది. అందులో రాయ్‌బరేలీ, అమేథీ కూడా ఉన్నాయి.

కాంగ్రెస్ కంచుకోటలకు ఒక్కటే సీటు!

ఎస్పీ ప్రతిపాదించిన 26 స్థానాల్లో కాంగ్రెస్‌కు మరో అభ్యంతరం కూడా ఉంది. రాయ్‌బరేలీ, అమేథీ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో కనీసం ఎనిమిది స్థానాలు తమకు కేటాయించాలని కాంగ్రెస్ కోరినట్లు సమాచారం.
కానీ ఎస్పీ ఇచ్చిన 26 స్థానాల జాబితాలో ఈ రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధి నుంచి కేవలం జగదీశ్‌పూర్ ఒక్కటే ఉంది. 2022 ఎన్నికల్లో ఈ స్థానంలో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది.
హర్చంద్‌పూర్, గౌరీగంజ్, అమేథీ వంటి స్థానాలను కూడా కాంగ్రెస్ కోరుతోంది. అయితే ఈ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు.
రాంపూర్ ఖాస్, ఫరెండా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆరాధనా మిశ్రా, వీరేంద్ర చౌదరి 2022లో గెలిచారు. వీటితో పాటు మథుర, ఖేరాగఢ్, జగదీశ్‌పూర్, కిద్వాయ్ నగర్ స్థానాలను కూడా ఎస్పీ తన జాబితాలో చేర్చింది. ఈ నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచారు.

బీజేపీ బలంగా ఉన్న స్థానాలే కాంగ్రెస్‌కు ఆఫర్!

మరో పది స్థానాలు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో ఉన్నాయి. మోదీనగర్, ఫతేపూర్ సిక్రీ, బాగ్‌పత్, జేవర్, హాపూర్, స్యానా, మాంట్, ఇగ్లాస్, ఖుర్జా, ఆగ్రా నార్త్ నియోజకవర్గాలను కాంగ్రెస్‌కు కేటాయించేందుకు ఎస్పీ ప్రతిపాదించింది.
ఈ పది స్థానాలూ ప్రస్తుతం బీజేపీ ఆధీనంలోనే ఉన్నాయి. 2022 ఎన్నికల్లో ఖుర్జా మినహా మిగిలిన స్థానాలను అప్పట్లో తమ మిత్రపక్షంగా ఉన్న జయంత్ చౌదరి నేతృత్వంలోని ఆర్‌ఎల్డీకి ఎస్పీ కేటాయించింది.
మిగిలిన పది స్థానాల్లో కూడా ఎస్పీకి గత ఎన్నికల్లో పెద్దగా విజయాలు లేవు. బిల్గ్రామ్ మల్లన్‌వాన్, నాన్‌పారా, పడ్రౌనా, గోవింద్‌నగర్, ఖజానీ, ఫాజిల్‌నగర్, వారణాసి కంటోన్మెంట్, పింద్రా, గోరఖ్‌పూర్ సిటీ వంటి నియోజకవర్గాలు ఈ జాబితాలో ఉన్నాయి.
ముఖ్యంగా గోరఖ్‌పూర్ సిటీ నియోజకవర్గం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం కావడం గమనార్హం.
ఈ స్థానాలను తమకు కేటాయించడంపై కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. యూపీలో తామే బలమైన పార్టీ అని చెప్పుకుంటున్న ఎస్పీ.. గత ఎన్నికల్లో గెలవలేకపోయిన స్థానాలను కాంగ్రెస్‌కు ఎందుకు కేటాయిస్తోందని ప్రశ్నిస్తున్నారు.

మా ఆరు ఎంపీ స్థానాలను గుర్తించాలి..

కాంగ్రెస్‌కు చెందిన మరో నేత మాత్రం ఈ పరిణామాలను కొంత సంయమనంతో విశ్లేషించారు. చర్చల్లో ఇలాంటి ప్రతిపాదనలు సహజమేనని చెబుతూనే.. ఎస్పీ ఇచ్చిన తొలి ఆఫర్ అవమానకరంగా ఉందని వ్యాఖ్యానించారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన ఆరు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లోనూ తమ పార్టీ మంచి ఆధిక్యం సాధించిందని ఆయన గుర్తు చేశారు.
రాయ్‌బరేలీ, సహరన్‌పూర్, అలహాబాద్, బారాబంకీ, సీతాపూర్ వంటి నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాలను కూడా తమకు కేటాయించాలని కాంగ్రెస్ కోరుతోంది. కానీ ఎస్పీ ఇచ్చిన జాబితాలో ఈ ప్రాంతాలకు ప్రాధాన్యం లేదని ఆ పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

చర్చలకు ఇంకా అవకాశం ఉందా?

ప్రస్తుతానికి ఇరు పార్టీల మధ్య తదుపరి విడత చర్చలు ఎప్పుడు జరుగుతాయనే దానిపై స్పష్టత లేదు. అయితే చర్చలు పూర్తిగా నిలిచిపోయినట్లు భావించాల్సిన అవసరం లేదని ఎస్పీ వర్గాలు చెబుతున్నాయి.
‘‘చర్చలు ఇలాగే జరుగుతాయి. మేము ఒక డిమాండ్ చేస్తాము. వారు తాము ఏమి ఇవ్వాలనుకుంటున్నారో చెబుతారు. ఆ తరువాత చర్చలు ప్రారంభిస్తాము. వాస్తవానికి వారు మరింత సహేతుకంగా వ్యవహరించి సులభమైన, కష్టమైన సీట్ల మిశ్రమంతో కూడిన జాబితాను పంచుకోవాలని మేము కోరుకున్నాము. మాకు ఆరుగురు ఎంపీలు ఉన్నారు.
2024 లోక్ సభ ఎన్నికలలో ఈ సీట్ల పరిధిలోని నియోజకవర్గాలలో బీజేపీకి వ్యతిరేకంగా మేము అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆధిక్యంలో ఉన్నాము. కాబట్టి ఆ 30 సీట్లు అన్ని కాకపోయినా కనీసం సగమైన మాకు ఇవ్వాలని ఆశించాము. కానీ వారు మాకు అమేథీలోని ఒక్క జగదీష్ పూర్ స్థానం మాత్రమే ఇచ్చారు. రాయ్ బరేలీ, సహరన్ పూర్, ప్రయాగ్ రాజ్, బారాబంకీ, సీతాపూర్ నుంచి ఒక్క సీటు ఇవ్వలేదు. వారు ఏమి ఆశిస్తున్నారో పునరాలోచించి, ఒక న్యాయమైన ప్రతిపాదనలతో తిరిగి వస్తారని మాత్రమే మేము ఆశించగలము’’ అని మరో కాంగ్రెస్ నాయకుడు అన్నారు.
కాంగ్రెస్‌తో కలిసి ముందుకు వెళ్లాల్సిన అవసరం తమకు తెలుసని, అందుకే మరిన్ని చర్చలు కొనసాగిస్తామని ఎస్పీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ తన సీట్ల డిమాండ్ విషయంలో వాస్తవికంగా వ్యవహరించాలని కోరుతున్నారు.
26 స్థానాల ప్రతిపాదనతో కాంగ్రెస్‌కు ఒక షాక్ ఇవ్వడం అవసరమైందని, అసలు చర్చలు ఇప్పుడు మొదలవుతాయని ఎస్పీ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
మొత్తానికి 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, పొత్తులో సీట్ల పంపకాల అంశం ఇప్పుడే రెండు పార్టీల మధ్య విభేదాలకు కారణమవుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పనిచేసిన కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే ఐక్యతను కొనసాగిస్తాయా? లేక సీట్ల విషయంలో తమ తమ పట్టుదలకు ప్రాధాన్యం ఇస్తాయా? అన్నది రాబోయే చర్చల్లో తేలనుంది.
Read More
Next Story