
బద్రీనాథ్ ఆలయం
బద్రీనాథ్ లోనూ విరాళాల వివాదం
విచారణకు ఆదేశించిన ఆలయ కమిటీ
అయోధ్య రామమందిరంలో విరాళాలు దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు రావడంతో బద్రీనాథ్ ధామ్- కేదార్ నాథ్ ఆలయ ధామ్ కమిటీ(బీకేటీసీ) శుక్రవారం విచారణకు ఆదేశించింది. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఆరోపణలను ఆలయ కమిటీ తీవ్రంగా పరిగణించిందని, ఈ విషయంపై విచారణ జరిపేందుకు ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించిందని బీకేటీసీ అధ్యక్షుడు హేమంత్ ద్వివేది తెలిపారు. ఈ ఆరోపణలు చేసిన సంబంధిత ఉద్యోగుల నుంచి వివరణలు కూడా కోరినట్లు ఆయన తెలిపారు. ఒక నిర్దిష్ట ఉద్యోగిని తన 'వ్యక్తిగత కార్యదర్శి'గా పేర్కొంటూ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వాదనను కూడా ద్వివేది ఖండించారు.
సదరు వ్యక్తి తన వ్యక్తిగత కార్యదర్శి కాదని, బీకేటీసీకి చెందిన సాధారణ ప్రభుత్వ ఉద్యోగి అని ఆయన స్పష్టం చేశారు. విచారణలో ఆరోపణలు నిజమని రుజువైతే, దోషులెవరినీ వదిలిపెట్టబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఉద్ఘాటించారు.
అందుబాటులో ఉన్న ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్, సంబంధిత పక్షాల వాంగ్మూలాల ఆధారంగా విచారణ కమిటీ తన నివేదికను సమర్పిస్తుందని బీకేటీసీ ముఖ్య కార్యనిర్వహణాధికారి సోహన్ సింగ్ రంగడ్ పేర్కొన్నారు.
ఏవైనా అవకతవకలు వెలుగులోకి వస్తే, శ్రీ బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ చట్టం, 1939 -ఉద్యోగుల ప్రవర్తనా నియమాల ప్రకారం దోషులపై చట్టపరమైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని రంగడ్ పేర్కొన్నారు. దర్యాప్తు ముగిసే వరకు ఎలాంటి నిరాధారమైన లేదా తప్పుదోవ పట్టించే ఆరోపణలను వ్యాప్తి చేయవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Next Story

