కాంగ్రెస్ తగ్గినా ఎస్పీ వెనక్కి తగ్గడం లేదా?
x

కాంగ్రెస్ తగ్గినా ఎస్పీ వెనక్కి తగ్గడం లేదా?

యూపీలో కూటమి సీట్ల పంచాయితీ.. అడిగినన్నీ ఇవ్వడం కుదరదని చెబుతున్న అఖిలేష్..


Click the Play button to hear this message in audio format

2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. విపక్ష కూటమిలో అప్పుడే సీట్ల పంపకాల వేడి మొదలైంది. కాంగ్రెస్ పార్టీ తొలుత 181 స్థానాలు కావాలని పట్టుబట్టగా, ఇప్పుడు ఆ డిమాండ్‌ను 130 స్థానాలకు తగ్గించింది.

అయినప్పటికీ సమాజ్‌వాదీ పార్టీ మాత్రం కాంగ్రెస్ అడిగినన్ని స్థానాలు ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. గెలిచే సత్తా ఉన్న అభ్యర్థులు, నియోజకవర్గాల్లో పార్టీల బలాబలాల ఆధారంగానే సీట్ల కేటాయింపు జరగాలని ఎస్పీ స్పష్టం చేస్తోంది. దీంతో రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్ మధ్య కూటమి కొనసాగింపుపై చర్చలు కీలక దశకు చేరుకున్నాయి.

ఎస్పీ ఏం చెబుతోంది..

నిజానికి ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు కలిసి పోటీ చేయాలన్న నిర్ణయం కొత్తదేమీ కాదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఇండి కూటమిలో భాగంగా పోటీ చేసి మంచి ఫలితాలు సాధించాయి. మొత్తం 80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో ఈ కూటమి 43 స్థానాలను గెలుచుకుంది. ఇందులో సమాజ్‌వాదీ పార్టీ 37, కాంగ్రెస్ ఆరు స్థానాలు దక్కించుకున్నాయి. ఈ ఫలితాలే 2027 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేయాలన్న ఆలోచనకు బలాన్నిచ్చాయి.
అయితే అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపకాల దగ్గరకు వచ్చేసరికి రెండు పార్టీల మధ్య లెక్కలు మారిపోయాయి. కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ ఇన్‌ఛార్జి రాజేంద్ర పాల్ గౌతమ్ తొలుత 181 నియోజకవర్గాలతో కూడిన జాబితాను సమాజ్‌వాదీ పార్టీ నాయకత్వానికి పంపించారు.
ఈ డిమాండ్‌పై ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ అధిష్ఠానం అనుమతితోనే ఇంత పెద్ద సంఖ్యలో సీట్లు అడుగుతున్నారా అని ఆయన ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా రాష్ట్ర నాయకత్వం సీట్ల డిమాండ్‌ను అదుపులో పెట్టాలని కోరినట్లు కథనం పేర్కొంది.
ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ కూడా రాష్ట్ర నాయకత్వానికి తన డిమాండ్‌ను తగ్గించుకోవాలని సూచించినట్లు సమాచారం. దీంతో 181 స్థానాల డిమాండ్ నుంచి కాంగ్రెస్ వెనక్కి తగ్గి, సుమారు 130 స్థానాలతో చర్చలకు సిద్ధమైంది.
ఈ క్రమంలో నవంబర్ 23న ఢిల్లీలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ నాయకులు సమావేశమయ్యారు. కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ నివాసంలో జరిగిన ఈ భేటీలో కాంగ్రెస్ తరఫున రాజేంద్ర పాల్ గౌతమ్, ఆరాధనా మిశ్రా మోనా, ఇమ్రాన్ మసూద్, వీరేంద్ర చౌధరి పాల్గొన్నారు. సమాజ్‌వాదీ పార్టీ తరఫున రాంగోపాల్ యాదవ్, రాజీవ్ రాయ్, ఇక్ఱా హసన్, శ్యాంలాల్ పాల్ హాజరయ్యారు.
అయితే ఈ సమావేశం 20 నిమిషాల లోపే ముగిసింది. కాంగ్రెస్ 130 నియోజకవర్గాల జాబితాను ఎస్పీ నాయకులకు అందించినప్పటికీ, ఏయే స్థానాలు ఎవరికి ఇవ్వాలన్న అంశంపై చర్చ జరగలేదు. ఎస్పీ కూడా ఎలాంటి ప్రత్యామ్నాయ ప్రతిపాదన చేయలేదు.
సమావేశంలో ఇరు పార్టీల నాయకుల మధ్య కొంత అసహనం కనిపించినప్పటికీ, బయటకు వచ్చిన తర్వాత మాత్రం చర్చలు సానుకూలంగా జరిగాయని ప్రకటించారు. కూటమిపై ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చేయకూడదని, సీట్ల సంఖ్యపై బహిరంగంగా మాట్లాడకూడదని రెండు పార్టీల నాయకులు అంగీకరించినట్లు సమాచారం.
ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు కోరుకుంటుంటే, సమాజ్‌వాదీ పార్టీ మాత్రం ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో ఉన్న బలాన్ని బట్టి మాత్రమే సీట్లు కేటాయించాలని భావిస్తోంది. ఎస్పీ వర్గాల సమాచారం ప్రకారం, అఖిలేశ్ యాదవ్ కాంగ్రెస్‌కు సుమారు 55 నుంచి 60 స్థానాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, ఆయా నియోజకవర్గాల్లో గెలిచే అభ్యర్థులు ఉన్నారో లేదో పరిశీలించాలనుకుంటున్నారు.
అభ్యర్థుల గెలుపు అవకాశాలు, నియోజకవర్గాల్లో కుల సమీకరణాలు, ఎన్నికల్లో బలంగా పోటీ చేసే ఆర్థిక, రాజకీయ సామర్థ్యం వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే సీట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకోవాలని ఎస్పీ భావిస్తోంది. కేవలం ఎక్కువ స్థానాలు కావాలని అడిగినంత మాత్రాన వాటిని కేటాయించలేమన్నది ఆ పార్టీ వాదన.

సీట్ల డిమాండ్ ను తగ్గించుకున్న కాంగ్రెస్..

మరోవైపు కాంగ్రెస్ కూడా తన డిమాండ్ విషయంలో కొన్ని మెట్లు దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. 130 స్థానాలు కోరుతున్నప్పటికీ, చివరకు 80 నుంచి 85 స్థానాలకు అంగీకరించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కాంగ్రెస్‌కు కేటాయించే నియోజకవర్గాలు బీజేపీకి సంప్రదాయంగా బలమున్న స్థానాలు కాకూడదన్నది ఆ పార్టీ ప్రధాన అభ్యంతరం.
సీట్ల పంపకం విషయంలో ఎస్పీ నాయకుడు రాంగోపాల్ యాదవ్ కాంగ్రెస్ ప్రతినిధులతో కటువుగా మాట్లాడారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న మిశ్రా, ఎస్పీ ఎంపీలు రాజీవ్ రాయ్, ఇఖ్రా హసన్ లు జోక్యం చేసుకుని ఈ చర్చలు వాగ్వాదంగా మారకుండా నివారించారు.
కాంగ్రెస్ పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్న 130 నియోజకవర్గాల జాబితాను గౌతమ్, ఎస్పీ నాయకులైన యాదవ్, రాయ్, హసన్, శ్యామ్ లాల్ పాల్ కు అందజేయగలిగినప్పటికీ సీట్లపై ఎలాంటి చర్చ జరగలేదు. ఎస్పీ నుంచి ప్రతిపాదన రాలేదని కాంగ్రెస్ నాయకులు కూడా బయటకు వచ్చాక తెలిపారు.
అయితే ఇరువురు నాయకులు అంగీకరించిన విషయం ఏంటంటే..బయట వేచి ఉన్న మీడియాతో చర్చలో జరిగిన విషయాల గురించి మాట్లాడేటప్పుడూ ఏ పక్షం కూడా విభేదాలు సృష్టించకూడదు. ఇరుపక్షాలు పోటీ చేయాలనుకుంటున్న సీట్ల సంఖ్యను గానీ, తమ మిత్రపక్షానికి వదులుకోవాలనుకుంటున్న సీట్ల సంఖ్యను గానీ మీడియాతో ప్రస్తావించకుండా ఉండాలని అలాగే పొత్తుకు భంగం కలిగించే ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని ఎస్పీ, కాంగ్రెస్ నాయకులు అంగీకరించారు.
ముస్లింలు, దళితులు, బ్రాహ్మణుల్లో తమకు మద్దతు ఉందని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగా సామాజిక సమీకరణాలు అనుకూలంగా ఉన్న నియోజకవర్గాలను తమకు కేటాయించాలని కోరుతోంది. గతంలో ఎస్పీ కూడా గెలవలేకపోయిన స్థానాలను తమకు అప్పగించడం వల్ల ప్రయోజనం ఉండదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
2017లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు కాంగ్రెస్‌కు 105 స్థానాలు కేటాయించారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ స్థానాలు కావాలని కాంగ్రెస్ కోరుతోంది. అయితే గత మూడు దశాబ్దాలుగా ఉత్తరప్రదేశ్‌లో పార్టీ పునరుద్ధరణ ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో ఫలించలేదని ఎస్పీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి.
ఇదిలా ఉంటే, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాల ఆలస్యం కారణంగా కొన్ని నియోజకవర్గాల్లో ఉమ్మడి అభ్యర్థులను నిలబెట్టలేని పరిస్థితి ఏర్పడింది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కూడా సీట్ల ఒప్పందం కుదరకపోవడంతో అక్కడ ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో అలాంటి పరిస్థితి పునరావృతం కాకూడదని కాంగ్రెస్, ఎస్పీ నాయకత్వాలు భావిస్తున్నాయి.
అందుకే డిసెంబర్ మధ్య నాటికి సీట్ల పంపకాల ఒప్పందాన్ని ఖరారు చేయాలని రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్ భావిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఒప్పందం పూర్తయిన తర్వాత అభ్యర్థుల ఎంపిక, ఉమ్మడి ప్రచార కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని రెండు పార్టీలు యోచిస్తున్నాయి.
‘‘బీహార్ లో జరిగినది పునరావృతం కావాలని ఎస్పీ గానీ, మేము గానీ కోరుకోవడం లేదు. రాహుల్, అఖిలేష్ ఒకరితో ఒకరు సంప్రదింపులు జరుపుకుంటున్నారు. ఏవైనా ఆటంకాలు ఎదురైతే ప్రియాంక వాటిని పరిష్కరిస్తారు. ఆశాజనకంగా డిసెంబర్ మధ్యకల్లా లేదా ఆ తరువాత కొద్ది రోజుల్లో సంఖ్యాబలం ఖరారు అవుతుంది. ఆ తరువాత మేము అభ్యర్థులను ఖరారు చేసి ఉమ్మడి ప్రచార ప్రణాళికలు రచించడం ప్రారంభిస్తాము’’ అని కాంగ్రెస్ నాయకుడు అన్నారు.
మొత్తానికి ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ మధ్య సీట్ల పంపకాల చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఒకవైపు కాంగ్రెస్ తన రాజకీయ ప్రాధాన్యతను పెంచుకోవాలని చూస్తుంటే, మరోవైపు ఎస్పీ క్షేత్రస్థాయి బలాన్ని, గెలుపు అవకాశాలను ప్రాతిపదికగా తీసుకోవాలని పట్టుబడుతోంది.
బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం చేయాలన్న లక్ష్యం రెండు పార్టీలకు ఉన్నప్పటికీ, ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు సీట్ల విషయంలో ఏకాభిప్రాయానికి రావడం ఇప్పుడు కీలకంగా మారింది. రాబోయే సమావేశాల్లో చర్చలు ఏ దిశగా సాగుతాయన్నది ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.


Read More
Next Story