
భోజ్ శాల వద్ద నిర్వహించిన మహా హారతి కార్యక్రమానికి వచ్చిన భక్తులు
‘‘హైకోర్టు తీర్పుతో భోజ్ శాలకు వచ్చేసిన వందలాది హిందువులు’’
శుక్రవారం మహాహారతి భజనల నిర్వహణ, ఇళ్లలోనే నల్లబ్యాడ్జీలతో ముస్లింల నిర్వహణ
మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో గల భోజ్ శాల కాంప్లెక్స్ లో శుక్రవారం వందలాది హిందువులు మహా హారతి కోసం వచ్చేశారు. మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ భోజ్ శాల కాంప్లెక్స్ వాగ్దేవి ఆలయమని తీర్పు ప్రకటించడంతో ఇక్కడ భారీ ఎత్తున మహా హారతి కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ నెల 15న మధ్యప్రదేశ్ హైకోర్టు చారిత్రాత్మక తీర్పులో ఇది భోజరాజు నిర్మించిన వాగ్దేవి ఆలయమని పేర్కొంది. ఇంతకుముందు శుక్రవారాల్లో ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ ఇచ్చిన ఉత్తర్వూలను రద్దు చేసింది. ఈ తీర్పుకు ముందు ఇక్కడ కేవలం మంగళవారం మాత్రమే హిందువులకు పూజలు చేసుకునే అవకాశం ఉండేది. కోర్టు తీర్పు తరువాత తొలిసారిగా శుక్రవారం హిందువులు భారీ ఎత్తును ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. దీనికి పోలీసులు భారీ ఎత్తున భద్రత కల్పించారు.
భోజ్ ఉత్సవ సమితి, భోజ్ శాల ముక్తి యాగ సమితి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కాంప్లెక్స్ లో మతపరమైన కార్యక్రమాలు, భజన- కీర్తన,మహా ఆరతి నిర్వహించాయి.ధార్ తో పాటు చుట్టపక్కల ప్రాంతాల నుంచి వేలసంఖ్యలో భక్తులు రోజంతా శాంతియుతంగా పూజలు, ప్రార్థనలు చేశారని భోజశాల ముక్తి యజ్ఞ సమితి కన్వీనర్ గోపాల్ శర్మ తెలిపారు. భక్తులు దర్శనం ప్రార్థనల కోసం రోజంతా గర్భగుడి ఆవరణలో నిల్చున్నారు. ఆలయంలోని కొన్ని భాగాలను రంగోలి, పూలతో అలంకరణలు చేశారు.
నల్ల బ్యాడ్జీలతో ముస్లింలు...
భోజ్ శాల తమ మత కట్టమైన కమల్ మౌలానా మసీద్ అని వాదిస్తున్నారు. అయితే ఈ వాదలను హైకోర్టు కొట్టివేసింది. దీనికి ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవని, ఇది వాగ్దేవి ఆలయమని హిందువులకు అప్పగించింది. ఈ తీర్పుకు నిరసనగా శుక్రవారం వారు నల్లబ్యాడ్జీలతో ఇళ్లలోనే శుక్రవారం జుమ్ము ప్రార్థనలు నిర్వహించారు. హైకోర్టు తీర్పును సమాజం గౌరవిస్తుందని, అయితే ఈ నిర్ణయంతో తాము సంతృప్తిగా లేమని స్థానిక ముస్లిం నాయకుడు అబ్ధుల్ సమద్ అన్నారు. ‘‘మేము మా ఇళ్లలోనే జుమ్మ నమాజ్ చేసి నల్లబ్యాండ్లు ధరించి శాంతియుతంగా నిరసన తెలియజేశాం’’ అని ఆయన అన్నారు. హైకోర్టు తీర్పును తాము సుప్రీంకోర్టులో సవాల్ చేశామని తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు.
భోజ్ శాల పరిసరాల్లో కొన్ని కార్యకలాపాలు హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా లేవని ఆరోపిస్తూ ముస్లిం సమాజానికి చెందిన ఒక ప్రతినిధి బృందం ఇటీవల పరిపాలనా యంత్రాంగాన్ని కలిసి వినతి పత్రం అందజేసిందని సమద్ చెప్పారు.
సున్నితమైన పరిస్థితి దృష్ట్యా ధార్ జిల్లా అధికారులు జిల్లా వ్యాప్తంగా దాదాపు 2 వేల మంది పోలీసులను మోహరించారు. డ్రోన్ నిఘా, సీసీటీవీ పర్యవేక్షణ, వాహనాల తనిఖీలు, మొబైల్ పెట్రోలింగ్ వంటివి నిర్వహించారు. హైకోర్టు ఆదేశాలను అక్షరాల అమలు చేశామని జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ధార్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ సచిన్ శర్మ వెల్లడించారు.
Next Story

