
ఆజం ఖాన్‌కు మధ్యంతర బెయిల్.. జైలు నుంచి విడుదల
ఈడీ పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్‌కు ఊరట లభించింది. మనీలాండరింగ్ కేసులో అలహాబాద్ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన ఘజియాబాద్‌లోని దాస్నా జైలు నుంచి విడుదలయ్యారు.
ఈ పరిణామంపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం మరింత బలపడిందని పేర్కొన్నారు. ఆజంఖాన్ కు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ సవాల్ చేస్తూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది.
మొహమ్మద్ అలీ జౌహర్ యూనివర్సిటీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆజం ఖాన్‌ను అరెస్టు చేసింది. నవంబర్ 1న ఆయనను ఘజియాబాద్‌లోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపించింది. అప్పటి నుంచి ఆయన దాస్నా జైలులోనే ఉన్నారు.
నవంబర్ 12న ఈడీ మరోసారి ఆజం ఖాన్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరింది. నాలుగు రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. నవంబర్ 16న కస్టడీ ముగియడంతో ఆజం ఖాన్‌ను తిరిగి కోర్టులో హాజరుపరిచారు. అయితే, ఈడీ మరోసారి కస్టడీ కోరలేదు. దీంతో కోర్టు ఆయనను తిరిగి జ్యుడీషియల్ కస్టడీకి పంపించింది.
ఈ క్రమంలో అలహాబాద్ హైకోర్టు నవంబర్ 17న ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు విడుదల చేయాలని కోరుతూ ఆజం ఖాన్ తరఫు న్యాయవాదులు నవంబర్ 18న ఘజియాబాద్‌లోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు బుధవారం మధ్యాహ్నం విడుదల ఉత్తర్వులు జారీ చేసింది.
రూ. 50 వేల రూపాయల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు షరతు విధించింది. ఆజం ఖాన్ తరఫు న్యాయవాదులు ఆయన వైద్య సంబంధిత వివరాలను కూడా కోర్టుకు అందజేశారు. పూచీకత్తుల పరిశీలన అనంతరం విడుదలకు అనుమతి లభించింది.
దీంతో బుధవారం సాయంత్రం ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. ఆయన కుమారులు మొహమ్మద్ అబ్దుల్లా ఆజం ఖాన్, మొహమ్మద్ అదీబ్ ఆజం ఖాన్ రాంపూర్ నుంచి దాస్నా జైలుకు చేరుకుని తండ్రిని తీసుకెళ్లారు. విడుదల అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు ఆజం ఖాన్ స్పందించలేదు.
మరోవైపు, ఈ పరిణామంపై అఖిలేశ్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆజం ఖాన్ విడుదల న్యాయంపై విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసిందని పేర్కొన్నారు. అణచివేత, అధికార దుర్వినియోగం హద్దులు దాటినప్పుడు అధికారంలో ఉన్నవారి పతనం ప్రారంభమైందని భావించాలని వ్యాఖ్యానించారు.
ఆజం ఖాన్‌కు సంబంధించిన కేసులో తదుపరి విచారణను అలహాబాద్ హైకోర్టు డిసెంబర్ 10కు వాయిదా వేసింది. దీంతో ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. తదుపరి న్యాయపరమైన పరిణామాలు ఎలా ఉంటాయన్నది డిసెంబర్ 10న జరిగే విచారణ తర్వాత స్పష్టత రానుంది.
ఏజెన్సీపై విమర్శలు..
ఈడీని తనపై నమోదు చేసిన కేసులపై ఆజంఖాన్ ఎద్దేవా చేశారు. కోళ్లు, మేకలు, గేదెలు, దొంగిలించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఎదుర్కొని కూడా ఒక విశ్వ విద్యాలయాన్ని స్థాపించగలిగితే ప్రతి వీధిలోనూ ఒక విద్య సంస్థను నిర్మించగల కోడి దొంగ ఉండాలని తాను ప్రార్థిస్తున్నానని అన్నారు.
క్షీణిస్తున్న ప్రజా విశ్వాసం ఇటీవలి న్యాయపరమైన వ్యాఖ్యలపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతను ఆయన ప్రశ్నించారు. చారిత్రక విద్యావేత్తలను వ్యంగ్యంగా ప్రస్తావిస్తూ మదన్ మోహన్ మాలవ్య, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ల కాలంలో ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖ, అభివృద్ధి సంస్థలు ఉండి ఉంటే, ఆ ఇద్దరు మార్గదర్శకులు జైలు పాలయ్యారని ఖాన్ పేర్కొన్నారు.
వేరొక క్రిమినల్ కేసులో రాంపూర్ జైలు నుంచి విడుదలైన వెంటనే ఈడీ అరెస్ట్ చేసిన ఒకరోజు తరువాత నవంబర్ 1 నుంచి ఖాన్ దాస్నా జైలులో ఉన్నారు. నవంబర్ 1న ఘజియాబాద్ పీఎంఎల్ కోర్టులో హాజరుపర్చగా, అతడిని మొదట 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీకి పంపారు. ఆ తరువాత ఏజెన్సీ అతడిని నవంబర్ 12 నుంచి నవంబర్ 16 వరకూ కస్డడీ రిమాండ్ కు తీసుకుంది. బుధవారం విడుదలయ్యే వరకూ అతడిని తిరిగి జ్యూడిషియల్ కస్టడీకి అప్పగించారు.
Next Story

