
జర్నలిస్ట్ పై ఎఫ్ఐఆర్ నమోదుపై లక్నో బెంచ్ ‘స్టే‘
పాఠశాలలో కనీస వసతులు లేవని వార్త ప్రచురణ, కక్షపూరితంగా వ్యవహరించారన్న బెంచ్
ప్రభుత్వ పాఠశాలలో లోపాలు ఉన్నాయనే వార్తలు ప్రచురించిన జర్నలిస్ట్ పై నమోదైన ఎఫ్ఐఆర్ పై లక్నో హైకోర్టు బెంచ్ స్టే విధించింది. పోలీసుల చర్య ప్రతీకార చర్యగా కనిపిస్తోందని బెంచ్ వ్యాఖ్యానించింది. ప్రభుత్వ పాఠశాలలోని లోపాలను ప్రజల దృష్టిని తీసుకువచ్చినందుకు ఒక జర్నలిస్ట్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వార్తను చంపడం లాంటిదని జస్టిస్ అబ్దుల్ మోయిన్, జస్టిస్ ప్రమోద్ కుమార్ శ్రీవాస్తవలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
లక్నోలోని గోసైనిగంజ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైన జర్నలిస్ట్ అమిత్ యాదవ్ దాఖలు చేసిన పిటిషన్పై ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. యాదవ్ తరఫు న్యాయవాది ప్రకారం, ఆ జర్నలిస్ట్ తన వృత్తిపరమైన హోదాలో గోసైనిగంజ్లోని బెగరియామౌలో ఉన్న అప్పర్ ప్రైమరీ పాఠశాలను సందర్శించి, అక్కడి మరుగుదొడ్లు శిథిలావస్థలో ఉన్నాయని వార్తలు రాశారు.
విద్యార్థులకు తాగునీరు అందుబాటులో లేదని కూడా ఆయన ఆరోపించారు. పాఠశాల పరిస్థితి గురించి ఉపాధ్యాయులను ఇంటర్వ్యూ చేశారు. ఆగష్టు 24న తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నాలుగు రోజుల ముందు ఆ నివేదిక ప్రచురించబడిందని పిటిషనర్ సమర్పించారు.
విచారణ సందర్భంగా, ప్రభుత్వ పాఠశాలలోని లోపాలను ఎత్తిచూపుతూ జర్నలిస్ట్ ఇచ్చిన నివేదికకు ప్రతీకార చర్యగా ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయబడినట్లుగా ప్రాథమికంగా కనిపిస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది. పాఠశాల ప్రస్తుత పరిస్థితిని వెల్లడిస్తూ వ్యక్తిగత అఫిడవిట్ దాఖలు చేయాలని, దాని ప్రాంగణ ఛాయాచిత్రాలను జతచేయాలని ప్రాథమిక విద్యాశాఖ అదనపు ప్రధాన కార్యదర్శిని ధర్మాసనం ఆదేశించింది. జర్నలిస్ట్పై నమోదైన ఎఫ్ఐఆర్కు సంబంధించి తదుపరి విచారణను కోర్టు నిలిపివేసింది.
Next Story

