ఢిల్లీలో సీజేపీ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం..
x

ఢిల్లీలో సీజేపీ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం..

వందలాది మంది నిర్బంధం, ఖాళీగా జంతర్ మంతర్ పరిసరాలు


Click the Play button to hear this message in audio format

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ జంతర్ మంతర్ వద్ద సీజేపీ తలపెట్టిన ఆందోళన విఫలమైంది. నిరసనకారులను పోలీసులు వరుసగా అదుపులోకి తీసుకోవడంతో నిరసన ప్రదేశం మొత్తం బోసిపోయింది. ఎటూ చూసిన వందలాది మంది పోలీసులే అక్కడ దర్శనమిచ్చారు.

నిరసనకు నాయకత్వం వహించిన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేతో పాటు సౌరవ్ దాస్, అశుతోశ్ రాంగా వంటి పలువురు కీలక నేతలను విమానాశ్రయంలోనే నిర్బంధించారు. ఇదే సమయంలో, అధికారుల చర్యలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా దాఖలైంది.

ఈ రోజు ఉదయం పదిగంటల ముప్పై నిమిషాలకు నిరసన ప్రారంభం కావాల్సి ఉండగా, పోలీసులు విపక్ష నాయకులతో పాటు పలువురు యూట్యూబర్లను సైతం అదుపులోకి తీసుకుని, జంతర్ మంతర్ రాకుండా చేయగలిగారు.

ఓటర్ల జాబితాలో మార్పులపై నిరసన

ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని కాక్రోచ్ జనతా పార్టీ ఆరోపిస్తోంది. ఓటరు నమోదు కోసం ఉపయోగించే ఫామ్-6కు సంబంధించిన అంశాల్లోనూ అక్రమాలు జరిగాయని పేర్కొంటోంది. ఈ వ్యవహారంపై ఎన్నికల ప్రధాన కమిషనర్ గ్యానేశ్ కుమార్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద నిరసనకు పిలుపునిచ్చింది. అయితే వీటిని ఎన్నికల సంఘం తోసిపుచ్చింది.
ఓటర్ల జాబితాల సవరణలో సుమారు 13 కోట్ల ఎంట్రీలు తొలగించడంపై ఇప్పటికే ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ మార్పులు కొన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపాయని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, ఎన్నికల సంఘం మాత్రం ఓటర్ల జాబితాల సవరణను సాధారణ ధ్రువీకరణ ప్రక్రియలో భాగంగా సమర్థిస్తోంది.

విమానంలోనే నేతల నిర్బంధం

నిరసనకు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు ముందుగానే ప్రకటించారు. అయినప్పటికీ, ఆందోళనలో పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకున్న సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలను విమానం దిగిన వెంటనే పోలీసులు నిర్బంధించారు.
జంతర్ మంతర్‌కు చేరుకునేందుకు ప్రయత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. పలువురిని బస్సుల్లో తరలించగా, మరికొందరిని అక్కడి నుంచి వెనక్కి పంపించారు. నిరసనకారులు ఇతర ప్రాంతాల్లో గుమిగూడేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీ అంతటా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కీలక రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేసి, తనిఖీలు చేపట్టారు. జంతర్ మంతర్ పరిసరాలను పూర్తిగా భద్రతా వలయంలోకి తీసుకున్నారు. మొబైల్ ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించడంతో పాటు పలు మెట్రో స్టేషన్లను మూసివేశారు. దేశ రాజధానికి వచ్చే పలు రైళ్లను దారి మళ్లించారు.

రాజకీయ నేతలు, కార్యకర్తలూ అదుపులోకి

ఈ నిరసన సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా పలువురు ప్రతిపక్ష నేతలు కూడా నిర్బంధానికి గురయ్యారు. రాజకీయ పార్టీలకే అనుబంధంగా ఉండే విద్యార్థి సంఘాల కార్యకర్తలు, న్యాయవాదులు, జర్నలిస్టులనూ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అనంతరం కొందరిని విడుదల చేసినట్లు సమాచారం.
మరోవైపు, నిరసనను అడ్డుకునేందుకు విధించిన ఆంక్షలు, ప్రజా రవాణా సేవలపై ప్రభావాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఢిల్లీలో మెట్రో, రైల్వే సేవల రాకపోకలను పూర్తిగా నిలిపివేయకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాలను అధికారులు ఉల్లంఘించారని పిటిషనర్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో సంబంధిత అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరారు.
మొత్తంగా, ఓటర్ల జాబితాల సవరణపై మొదలైన వివాదం ఇప్పుడు నిరసన హక్కు, పోలీసుల చర్యలు, ప్రజా రవాణాపై ఆంక్షల చుట్టూ చర్చకు దారితీసింది. ఈ ఆరోపణలపై సంబంధిత సంస్థల స్పందన, న్యాయస్థానంలో తదుపరి పరిణామాలు కీలకంగా మారనున్నాయి.

ముంబైలోనూ..

ముంబైలోని ఆగష్ట్ క్రాంతి మైదాన్ లో జరగనున్న ప్రదర్శనకు ముందు, కార్యకర్త తుషార్ గాంధీని అతని సంస్థ ‘హమ్ భారత్ కే లోగ్’ కు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీజేపీ జంతర్ మంతర్ నిరసనగా సంఘీభావంగా ఈ ప్రదర్శనను ప్రణాళిక చేశారు. తుషార్ గాంధీ బాంద్రాలో అదుపులోకి తీసుకుని డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఆ సంస్థ మధ్యాహ్నం 3.30 నిమిషాలకు క్రాంతి మైదాన్ లో జరిగే నిరసనల్లో పాల్గొనాలని పౌరులను కోరుతూ ఒక పోస్టర్ విడుదల చేసింది. కార్యకర్త ఫిరోజ్ మిథిబోర్వాలాను కూడా అతని నివాసం నుంచి అదుపులోకి తీసుకున్నారు.


Read More
Next Story