రైహాన్ వాద్రా ఎగ్జిబిషన్ ను అడ్డుకున్నారు: ప్రియాంక గాంధీ
x

రైహాన్ వాద్రా ఎగ్జిబిషన్ ను అడ్డుకున్నారు: ప్రియాంక గాంధీ

నో ఐడియా ఈజ్ ఫైనల్ అంటూ ఓ కార్యక్రమాన్ని నిర్వహించిన వాద్రా దంపతుల కుమారుడు


Click the Play button to hear this message in audio format

ఢిల్లీలో కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ కుమారుడు రైహాన్ వాద్రా ఫొటో ఎగ్జిబిషన్‌లో చోటుచేసుకున్న పరిణామం రాజకీయ వివాదానికి దారితీసింది. ఢిల్లీలో గత ఆరు నెలలుగా జరిగిన యువత నిరసనలకు సంబంధించిన 70కి పైగా ఫొటోలను ప్రదర్శన నుంచి తొలగించడంతో, ఇది కళాకారుల భావప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడమేనని రైహాన్ ఆరోపించారు. ఈ ఘటనపై ప్రియాంకా గాంధీ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

రైహాన్ వాద్రా ఢిల్లీలోని బికనీర్ హౌస్‌లో ‘నో ఐడియా ఈజ్ ఫైనల్’ పేరుతో తన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో వన్యప్రాణుల ఫొటోలు, అబ్‌స్ట్రాక్ట్ చిత్రాలతో పాటు ఇటీవల దేశంలో జరిగిన యువత ఉద్యమాలకు సంబంధించిన ఫొటోలను కూడా చేర్చారు. మొత్తం 100కు పైగా ఫొటోలను ప్రదర్శనలో ఉంచాలని భావించారు.
అయితే, ప్రదర్శన ప్రారంభానికి ముందు రోజు నుంచే నిరసనలకు సంబంధించిన ఫొటోలపై బికనీర్ హౌస్ యాజమాన్యం అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు రైహాన్ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు తనకు ఫొటోలను తొలగించాలని సమాచారం ఇచ్చారని, సాయంత్రం 5 గంటల్లోగా వాటిని తీసివేయకపోతే ప్రదర్శనను రద్దు చేస్తామని హెచ్చరించినట్లు వెల్లడించారు. దీంతో సుమారు 74 ఫొటోలను ప్రదర్శన నుంచి తొలగించాల్సి వచ్చిందని చెప్పారు.
ఈ ఫొటోలు ఎలాంటి రాజకీయ సందేశాన్ని ప్రచారం చేయడానికి ఉద్దేశించినవి కావని, గత ఆరు నెలల్లో జరిగిన నిరసనలను దృశ్యరూపంలో నమోదు చేయడమే తన లక్ష్యమని రైహాన్ స్పష్టం చేశారు. ప్రదర్శనకు సంబంధించిన ప్రతిపాదన, ఫొటోల అమరిక వివరాలను ముందుగానే యాజమాన్యానికి అందించినప్పటికీ, చివరి నిమిషంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. తొలగించిన ఫొటోల్లో భారత జాతీయ జెండాకు సంబంధించిన చిత్రం కూడా ఉందని పేర్కొన్నారు.
మరోవైపు, ఈ ఘటనపై ప్రియాంకా గాంధీ స్పందిస్తూ, యువత గొంతును అణచివేసే ప్రయత్నంగా ఈ చర్యను అభివర్ణించారు. ఒక కళాకారుడి ప్రదర్శనలో ఇలా జరిగితే, భవిష్యత్తులో ఇతర కళాకారులకూ ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నేత పవన్ ఖేరా కూడా ఈ వ్యవహారంపై విమర్శలు చేశారు. నిరసనలను చిత్రీకరించిన ఫొటోల్లో అభ్యంతరకరమైన అంశాలు ఏమున్నాయని ప్రశ్నించారు. అయితే, ఈ ఆరోపణలపై బికనీర్ హౌస్ అధికారులు తక్షణమే అధికారిక వివరణ ఇవ్వలేదు.
ఫొటోలను తొలగించినప్పటికీ, ఎగ్జిబిషన్‌ను యథావిధిగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం సుమారు 40 ఫొటోలు మాత్రమే ప్రదర్శనలో ఉన్నాయి. తొలగించిన చిత్రాలను మరో వేదికపై ప్రదర్శించే ఆలోచనలో ఉన్నట్లు రైహాన్ తెలిపారు. ఈ ఘటనతో కళాత్మక భావప్రకటన స్వేచ్ఛ, ప్రభుత్వ ఆధ్వర్యంలోని సాంస్కృతిక వేదికల బాధ్యతలపై చర్చ మొదలైంది.
Read More
Next Story