బీజేపీలో పాత కాపులకు పెద్ద పీట ఎందుకు?
x

బీజేపీలో పాత కాపులకు పెద్ద పీట ఎందుకు?

యూపీలో మూడోసారి అధికార పీఠం దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్న కమలనాథులు


Click the Play button to hear this message in audio format

2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. ఇప్పటి నుంచే రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ సంస్థాగతంగా భారీ మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగా గతంలో పక్కన పెట్టిన సీనియర్ నేతలు మురళీ మనోహర్ జోషి, వినయ్ కటియార్‌లకు మళ్లీ ప్రాధాన్యం కల్పించింది. మొత్తం 712 మందితో రాష్ట్ర కార్యవర్గ కమిటీని ఏర్పాటు చేయడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది.

లక్నోలో ఇటీవల జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు అంతర్గత విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఐక్యతతోనే పార్టీ విజయాన్ని సాధించగలదని స్పష్టం చేశారు. విడిపోతే.. పడిపోతామని మరోసారి కార్యకర్తలను హెచ్చరించారు. తమ అసంతృప్తిని గోమతి నదిలో కలపాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. పార్టీ నాయకులంతా ఐక్యంగా పనిచేయాలని కోరారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన ఎదురుదెబ్బలు, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల నేపథ్యంలో పార్టీ నాయకత్వం ఐక్యతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.
2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏర్పాటు చేసిన రాష్ట్ర కార్యవర్గంలో 445 మంది ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్యను మరో 267 మందికి పెంచి 712కు చేర్చారు. ఇందులో 548 మంది సాధారణ సభ్యులు, 30 మంది శాశ్వత ఆహ్వానితులు, 134 మంది ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యోగి ఆదిత్యనాథ్, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులకు శాశ్వత ఆహ్వానితులుగా చోటు కల్పించారు. మురళీ మనోహర్ జోషి, వినయ్ కటియార్‌లతో పాటు జితిన్ ప్రసాద, హర్దీప్ సింగ్ పురి, బీఎల్ వర్మ, స్మృతి ఇరానీ, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ వంటి నేతలకూ ప్రాతినిధ్యం కల్పించారు.
అయితే ఈ విస్తరణ వెనుక పార్టీ అంతర్గత అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2025 ఆరంభం నుంచే పార్టీ సంస్థాగత నియంత్రణ, మంత్రి పదవుల కేటాయింపు, నాయకత్వ ప్రాధాన్యతల విషయంలో విభేదాలు కొనసాగుతున్నాయి.
జిల్లా అధ్యక్షుల ఎంపిక సమయంలోనూ వర్గపోరు బయటపడింది. పంకజ్ చౌధరీని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడంపై కొందరు అగ్రవర్ణ నేతల్లో అసంతృప్తి వ్యక్తమైంది. ఇవన్నీ కూడా పార్టీలో పరిస్థితి సవ్యంగా లేవని సూచిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు.
వరుస ఎదురుదెబ్బలు, జిల్లా యూనిట్లలో అంతర్గత ఘర్షణలు, పార్టీ ప్రధాన ఓటర్లలో పెరుగుతున్న అసంతృప్తులు మూడోసారి అధికారం చేజిక్కించుకోవాలనుకుంటున్న కమలనాథులపై కాస్త కలవరాన్ని పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలో, తమ మద్దతుదారులలో పుట్టిన అసంతృప్త వర్గాలను శాంతింపజేయడానికి బీజేపీ చేపట్టిన ప్రయత్నమే ఈ సంస్థాగత పునర్ వ్యవస్థీకరణగా చెప్పవచ్చు.
‘‘మూడోసారి అధికారాన్ని దక్కించుకోవడానికి సీఎం యోగీ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. పార్టీకంటే ఎక్కువగా ఆయనక రాజకీయ ఆశయాలకు ఇవి ఒక ప్రజాభిప్రాయ సేకరణలా ఉన్నాయి. ఎందుకంటే తదుపరి తాను జాతీయ రాజకీయాలకు కేంద్రం ఉంటానని ఆయన భావిస్తున్నారు. బహుశా అందరూ తన పక్షాన ఉండాలని కోరుకుంటున్నారు. అందులో అమిత్ షా కూడా’’ అని సీనియర్ రాజకీయ విశ్లేషకుడు రతన్ మణిలాల్ ‘ది ఫెడరల్’ తో అన్నారు.
సంస్థాగత నియంత్రణ, మంత్రి పదవుల ప్రాతినిధ్యం, నాయకత్వ ప్రాధాన్యతల విషయంలో 2025 ఆరంభం నుంచి పార్టీలో అసంతృప్తి రాజుకుంటూ వస్తోంది. జిల్లా యూనిట్ నాయకుల ఎన్నికల విషయంలో తీవ్రమైన వర్గపోరాటాల దానికి తోడు పంకజ్ చౌదరిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడంపై అగ్రవర్ణ నాయకుల్లో నెలకున్న అసంతృప్తి, పార్టీ శ్రేణుల్లో తలెత్తుతున్న చీలికలను బట్టబయలు చేశాయి.అందువల్ల కీలకమైన అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీని క్రమబద్ధంగా ఉంచడానికి ఒక భారీ రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఒక రాజకీయ అవసరంగా మారిందని పార్టీ కార్యకర్తలు అంటున్నారు.

అంతర్గత విభేదాలు..

2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏర్పాటు చేసిన పాత కమిటీలో 445 మంది సభ్యులుండగా, ఈసారి పార్టీ 267 మంది కొత్త సభ్యులను చేర్చడంలో మొత్తం సభ్యుల సంఖ్య 712 కు చేరింది. ఈ కమిటీలో 548 మంది సాధారణ సభ్యులు 30 మంది శాశ్వత ఆహ్వానితులు, 134 మంది ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు. కొత్త కమిటీలో ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ముఖ్యమంతి యోగీ, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు శాశ్వత ఆహ్వానితులుగా ఉన్నారు. మురళీ మనోహార్ జోషి, వినయ్ కటియార్ వంటి నేతలకు తిరిగి ప్రాధాన్యం కల్పించారు.
అలాగే ఇతర ప్రముఖల పేర్లలో కేంద్రమంత్రులు జితిన్ ప్రసాద, హార్దీప్ పూరి, బీఎల్ వర్మ, స్మృతి ఇరానీ, రేఖా వర్మ, హారీశ్ ద్వివేదీ, లక్ష్మీకాంత్ బాజ్ పేయ్, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, సాధ్వీ నిరంజన్ జ్యోతి ఉన్నారు.
ఈ తతంగమంతా పార్టీలో అంతా సవ్యంగా ఉందని, పార్టీ ఐక్యంగా ఉందని ఒక రాజకీయ కథనాన్ని నిర్మించే ప్రయత్నం తప్ప మరేమీ కాదు. సంస్థాగత అనైక్యత అసెంబ్లీ ఎన్నికలలో తమకు నష్టం కలిగిస్తుందని బీజేపీ భయపడుతున్న తరుణంలో ఈ రాజకీయ సందేశం ఆ పార్టీకి ప్రత్యేకంగా కీలకం’’ అని రాజకీయ విశ్లేషకుడు శశికాంత్ పాండే అన్నారు.

పూర్వాంచల్ నష్టాలపై బీజేపీ ఆందోళన..

మరోవైపు, తూర్పు ఉత్తరప్రదేశ్‌లో పట్టు కోల్పోతుండటం కూడా బీజేపీకి ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు పార్టీకి బలమైన ప్రాంతంగా ఉన్న పూర్వాంచల్‌లో సమాజ్‌వాదీ పార్టీ తన ప్రభావాన్ని పెంచుకుంటోంది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అఖిలేశ్ యాదవ్ అనుసరిస్తున్న PDA వ్యూహం ప్రభావం కనిపించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో కొత్త కమిటీలో పూర్వాంచల్‌కు అత్యధిక ప్రాతినిధ్యం కల్పించారు. గోరఖ్‌పూర్ ప్రాంతానికి 120 మంది, వారణాసి కేంద్రంగా ఉన్న కాశీ ప్రాంతానికి 108 మంది, అవధ్‌కు 104 మంది, కాన్పూర్‌కు 79 మంది, పశ్చిమ యూపీకి 70 మంది, బ్రజ్ ప్రాంతానికి 67 మంది సభ్యులను ఎంపిక చేశారు.
ఇక సీనియర్ నేత మురళీ మనోహర్ జోషికి మళ్లీ ప్రాధాన్యం కల్పించడం కూడా రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ప్రధాని మోదీ విధానాలపై గతంలో విమర్శలు చేసిన ఆయన.. ఇటీవల జెన్-జీ నిరసనల సందర్భంగా పోలీసుల వ్యవహారశైలిపైనా ప్రశ్నలు లేవనెత్తారు. అయినప్పటికీ ఆయనకు కమిటీలో చోటు కల్పించడం ద్వారా బ్రాహ్మణ సామాజిక వర్గంలో పార్టీ పాత మద్దతును తిరిగి పొందాలని బీజేపీ భావిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అదేవిధంగా బజరంగ్ దళ్ సహ వ్యవస్థాపకుడు, రామమందిర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వినయ్ కటియార్‌ను కూడా తిరిగి కమిటీలోకి తీసుకున్నారు. 2024లో అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆయనకు ఆహ్వానం అందలేదు. ఆలయ విరాళాల వ్యవహారంలోనూ ఆయన గతంలో విమర్శలు చేశారు. ఇప్పుడు ఆయనకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా రామమందిర ఉద్యమ వారసత్వంతో మళ్లీ పార్టీని అనుసంధానించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి.

కుల గణనలు..

బ్రాహ్మణులతో పాటు వైశ్య, బనియా సామాజిక వర్గాల్లోనూ పెరుగుతున్న అసంతృప్తిని తగ్గించడం బీజేపీ ముందున్న మరో లక్ష్యం. వ్యాపారులు అధికార యంత్రాంగం, పన్నుల వ్యవహారాల్లో వేధింపులు ఎదుర్కొంటున్నారని ఫిర్యాదు చేస్తున్నారు. గోరఖ్‌పూర్‌లో అభివృద్ధి పనుల వల్ల రవాణాకు ఆటంకాలు ఏర్పడి వ్యాపారాలు దెబ్బతింటున్నాయని కొందరు వ్యాపారులు నిరసనలు కూడా చేపట్టారు.
ఈ అసంతృప్తిని సమాజ్‌వాదీ పార్టీ తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల వారణాసిలో నిర్వహించిన PDA వ్యాపారుల సదస్సుకు నాలుగు జిల్లాల నుంచి 2 వేల మందికి పైగా వ్యాపారులు హాజరయ్యారు. మరోవైపు, వైశ్య సామాజిక వర్గానికి చెందిన గోరఖ్‌పూర్ మాజీ ఎమ్మెల్యే రాధా మోహన్ దాస్ అగర్వాల్‌కు కూడా బీజేపీ కమిటీలో చోటు కల్పించింది.
మొత్తంగా చూస్తే, 2027 ఎన్నికలకు ముందు పార్టీ వర్గాల మధ్య విభేదాలను తగ్గించడం, పూర్వాంచల్‌లో పట్టు తిరిగి సాధించడం, సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకోవడమే లక్ష్యంగా బీజేపీ ఈ భారీ కార్యవర్గ విస్తరణ చేపట్టినట్లు కనిపిస్తోంది. అయితే ఈ సంస్థాగత మార్పులు ఎన్నికల్లో పార్టీకి ఎంతవరకు ప్రయోజనం చేకూరుస్తాయన్నది వేచి చూడాలి.
Read More
Next Story