‘వందేమాతరం’ కేవలం పదం కాదు.. మంత్రం..’
x

‘వందేమాతరం’ కేవలం పదం కాదు.. మంత్రం..’

1937లో 'వందేమాతరం' గీతంలోని కొన్ని చరణాలను తొలగించడమే దేశ విభజన దారితీసిందన్న ప్రధాని మోదీ..


Click the Play button to hear this message in audio format

జాతీయ గీతం ‘వందేమాతరం’(Vande Mataram) 2025 నాటికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. బంకించంద్ర ఛటర్జీ 1875 నవంబర్ 7న ఈ గేయాన్ని రాశారు. ఈ సందర్భంగా శుక్రవారం (నవంబర్ 7న) ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటుచేసిన వేడుకలకు ప్రధాని మోదీ(Narendra Modi) ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్‌(Congress)పై పరోక్షంగా దాడి చేశారు. వందేమాతరంలోని కీలక చరణాలను 1937లో తొలగించడం వల్లే దేశ విభజనకు దారితీసిందని వ్యాఖ్యానించారు.


‘నేటి యువత ఆలోచించాలి..’

"వందేమాతరం భారత స్వాతంత్ర్య పోరాట స్వరంగా మారింది. ప్రతి భారతీయుడి భావాలను వ్యక్తపరిచింది. దురదృష్టవశాత్తూ 1937లో ‘వందేమాతరం’ ముఖ్యమైన చరణాల్లో కొన్నింటిని తొలగించారు. అదే దేశ విభజనకు బీజం వేసింది. జాతి నిర్మాణం అనే ఈ మహా మంత్రానికి ఎందుకు ఇంత అన్యాయం జరిగిందో? ప్రస్తుత తరం తెలుసుకోవాలి. ఈ విభజన మనస్తత్వం దేశానికి ఒక సవాలుగా మిగిలిపోయింది" అని మోదీ పేర్కొన్నారు.


‘వందేమాతరం ఒక పదం కాదు. మంత్రం..’

వందేమాతరం యుగయుగాలుగా ఔచిత్యాన్ని కొనసాగిస్తుందన్న ప్రధాని, ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావిస్తూ.. "ఉగ్రవాదం ద్వారా మన భద్రత, గౌరవంపై శత్రువులు దాడి చేయాలని చూసినపుడు, మనదేశం దుర్గా రూపాన్ని ప్రపంచానికి చూపింది" అని అన్నారు.

"వందేమాతరం అనేది కేవలం ఒక పదం కాదు. అది ఒక మంత్రం, ఒక శక్తి, ఒక కల. ఒక సంకల్పం. భారతమాత పట్ల భక్తిని ప్రతిబింబిస్తుంది. మనల్ని మన చరిత్రతో అనుసంధానిస్తుంది, " అని పేర్కొన్నారు ప్రధాని.


స్టాంపు, నాణేం విడుదల..

వందేమాతర గీతం 150 సంవత్సరాల వేడుకలు 2025 నవంబర్ 7 నుంచి 2026 నవంబర్ 7 వరకు ఏడాది పొడవునా దేశవ్యాప్తంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని పోస్టల్ స్టాంపు, నాణేన్ని ఆవిష్కరించారు.

Read More
Next Story