బడి పిల్లల ప్రాణాలతో చెలగాటం.. ఈ పాపంలో ఎవరి వాటా ఎంత..?
వీధి గుమ్మం ముందాగిన ఆటో శబ్దం. ఆ వెంటనే.. ఆటో హారన్ వినిపించడంతో నేను వంటగది కిటికీలోంచి తొ్ంగిచూస్తే అది మా పిల్లల స్కూల్ ఆటో. వీధిగుమ్మంలో నిలబడింది.

వీధి గుమ్మం ముందాగిన ఆటో శబ్దం. ఆ వెంటనే.. ఆటో హారన్ వినిపించడంతో నేను వంటగది కిటికీలోంచి తొ్ంగిచూస్తే అది మా పిల్లల స్కూల్ ఆటో. వీధిగుమ్మంలో నిలబడింది. వెంటనే పిల్లలిద్దర్నీ ఆటో ఎక్కించి ఇంట్లోకి వచ్చేశా. ఇద్దరికీ లంచ్ బాస్కులు కట్టి పంపించేశా. అక్కడక్కడా చిన్నచిన్న పనులు మిగిలి ఉన్నాయి. కాస్తంత టీ తాగిన ఆ పనులన్నీ చేసుకుందాంలే అనుకుంటూ... పొయ్యిమీద టీ పెట్టుకున్నా. టీ మరగడానికి కాస్త టైం పడుతుందని పొద్దున్నుండీ పనులు చేసి చేసి అలసిపోయి ఉన్నానేమో అలసట తీర్చుకోవడానికి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నా. అలా కూర్చున్నానో లేదో నాఫోన్ ఒకటే మోగుతోంది . ఎవరానా అని చూస్తే.. కొత్త నెంబర్. ఇంత పొద్దున్నే ఎవరబ్బా నాకు ఫోన్ చేస్తున్నారు..? ఎవరై ఉంటారు..? అన్న ప్రశ్నల మద్యే ఫోన్ లిఫ్ట్ చేశా.. మేడం.. హాసిని ప్రియి మీ అమ్మాయేనే... అన్నాడు అవతలి వ్యక్తి.. అవును మీరెవరు..? అని అడిగా ఏదో కంగారనిపించింది. మీ పాప స్కూలుకు వెళ్తున్న ఆటో యాక్సిడెంట్ అయ్యింది. పాప తలకి దెబ్బతగిలింది. మీ పాపే మీకు ఫోన్ చేయమని నెంబరు ఇచ్చింది. నాపేరు కిషోర్ అంటూనే పిల్ల ఆటో యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందో వివరాలు చెప్పేసి ఫోన్ పెట్టేశాడు. పిడుగులాంటి వార్త.. పిల్లకు ఏమైందో తెలీదు. కళ్లు బైర్లు కమ్మాయి. కాళ్లు ఒణనుకుతున్నాయి.. ఆ వార్త విన్నెంటనే అలా ఆకుర్చీలోనే కుప్పకూలిపోయా... అంటూ బోరున ఏడుస్తూ... విశాఖపట్నంలోని స్కూలు పిల్లల ఆటో యాక్సిడెంట్ గురించి చెబుతోంది హాసిని ప్రియ తల్లి. అసలు విషయం ఏంటంటే.. సంఘం శరత్ ధియేటర్ సమీపంలో ఇటీవల స్కూలు పిల్లలు ప్రయాణిస్తున్న ఆటోను వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఎనిమిది మంది స్కూలు పిల్లలకు బాగా దెబ్బలు తగిలాయి. తీవ్రగాయాలైన హాసిన ప్రియ తల్లి ఫెడరల్తో ఏడుస్తూనే మాట్లాడింది. రోడ్డు ప్రమాదంలో హాసిని ప్రియ, గాయత్రి, వాణి జయ రమ్య, భావేష్, లక్ష్య, చార్విక్, కుశాల్కేజీ, కేయూష్ ఉంటే... వాళ్లలో హాసిన ప్రియకు తలకుబలమైన దెబ్బ తగిలింది.
ఆటో ప్రమాదంలో తప్పెవరిది..?
వేగంగా వచ్చిన లారీ డ్రైవర్ది తప్పా..? లేక మెయిన్ రోడ్డుపైకి చూసీ చూడకుంటూ పోయిన ఆటో డ్రైవర్ దా ? ఈ రెండూ ప్రశ్నలు జవాబు దొరకనివే. తప్పు నాది కాదంటే నాది కాదని తప్పించుకునే వారే తప్ప... గాయపడ్డ చిన్నారు పరిస్థితి గురించి పట్టించుకునేవాడే లేడు. ప్రమాదం జరిగిన సమయంలో అటువైపుగా వెళ్తున్న వారంతా గుమిగూడి ఎవరికి తోచినట్లు వారు సహాయం చేయడానికి తలో చెయ్యి వేసి. బోల్తాపడ్డ ఆటోను లేపి పిల్లల్ని ఒక్కొక్కరిని పక్కన కూర్చోబెట్టారు. పిల్లల ఏడ్పులతో అక్కడి ఒకలాంటి భయానకమైన వాతావరణం. బిక్కుబిక్కుమంటూ ఏడుస్తున్న పిల్లలు. బెదిరిన పిల్లలకు చుట్టుపక్కల చేరిన వారంతా ఎంత ధైర్యం చెప్పినా.. వారింకా ఏడుస్తూనే ఉన్నారు. ఈలోపు ఒక్కొక్కరి పిల్లల తల్లితండ్రులు పెద్దగా ఏడుస్తూ అక్కడికి చేరుకుంటుంటే అక్కడున్న ప్రతీ ఒక్కరి కళ్లలోనుండి తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. ప్రమాదాన్ని చూసిన వారంతా మా పిల్లలు ఎలా వెళ్లారో..? అనుకుంటూ ఆటోల్లో, రిక్షాల్లో వెళ్లిన పిల్లల కొసం కొంతమంది పిల్లల తల్లితండ్రులు అక్కడ్నుంచే వారి స్కూళ్లకు ఫోన్లు చేయడం కనిపించింది.
విశాఖపట్నంలోని బేతని స్కూల్లో హాసిని ప్రియ పదో తరగతి విద్యార్థిని. బాగా చదువుకొని ఉన్నత విద్యాభ్యాసం కోసం కలలు కంటున్న హాసిని ప్రియని ఎప్పటిలాగే స్కూలుకు ఆరోజు ఉదయం ఆటోలో వెళుతోంది. తోటి స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ... నవ్వుకుంటూ... హోంవర్క్ పూర్తి చేశావా..? అంటూ తన క్లాస్మేట్ని అడుతుంటే పెద్ద శబ్దం... ఆటోకి ఏమైందో తెలియదు... కానీ తనకేదో అయ్యిందని మాత్రం చూచాయగా తెలుస్తోంది. అంతే పక్కడు దొర్లుకుండూ పోతున్న ఆటో... అతి వేగంగా లారీ వచ్చి హాసిన ప్రియ వెళ్తున్న ఆటోని ఎంతో బలంగా ఢీ కొట్టింది. తలకు బలమైన దెబ్బ తగలడంతో కొద్దిసేపు అసలు ఏం జరుగుతుందో తెలీని పరిస్థితి. ఎవరో తనను పైకెత్తి మరో ఆటోలో ఎక్కడికో తీసుకెళ్తున్నారని మాత్రం అర్థమవుతోంది. ఇంత జరుగుతున్నా అక్కడున్న వారికి మాత్రం పిల్లల పరిస్థితి ఏమిటన్నదే భయం. ఆ భయంలో ఎవరెవరి పిల్లలు ఉన్నారో తెలియని మరో ఆందోళన. చెల్లాచెదురుగా పడున్న పుస్తకాల సంచులు... ఎవరిపుస్తకాలేవో కూడా చెప్పలేం. లంచ్బాస్కుల్లోని అన్నం రోడ్డుపాలైంది. అక్కడికి చేరినవారందరిలోనూ ఆటో ప్రమాదంలో గాపడ్డవారిని వెంటనే అసుపత్రికి తీసుకువెళ్లాలన్న ఆతృతే కనిపిస్తోంది. గాయపడ్డ ఏడుగురు పిల్లల్ని చుట్టుపక్కలున్న ఆసుప్రతికి తీసుకువెళ్లడం పూర్తయ్యింది. అప్పుడు మొదలైంది ఆటో ప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై అక్కడున్నవారంతా పోస్టుమార్టం చేస్తున్నారు. అప్పటికే లారీ డ్రైవర్ డోర్ తీసుకొని పరారైయ్యాడు. అక్కడ గుమిగూడున్నవారికి దొరికితే అక్కడే తన ఒళ్లు హూనం చేస్తారని భయపడ్డాడనుకుంటా.. పారిపోయాడు. ఆటోను ఢీకొట్టిన లారీకి కుడి వైపు క్లీనర్ ఉన్నాడు.. తప్పించుకోవడానికి వీలు లేకుండా పోయింది. అంతే అక్కడున్న వారి చిక్కాడు.. అంతే నలుగురూ నాలుగు చేతులు ఝాడించి పొట్టుపొట్టుగా కొట్టారు. క్లైమాక్స్లో పోలీసులు రంగ ప్రవేశం చేస్తున్నట్లు సినిమాల్లోనే చూస్తాం కదా.. ఇక్కడ అదే నిజమైంది. అప్పుడు మొదలైంది. ఈ ప్రమాదానికి కారణం ఎవరు..? అసలు తప్పెవరిది..? మీలో ఎవరైనా ప్రమాదం జరిగినప్పుడు ఇక్కడున్నారా..? అంటూ డాక్యుమెంట్ ఎవిడెన్స్ కోసం పోలీసులు పాట్లు మొదలైయ్యాయి. ఖాకీల హడావుడి అంతా ఇంతా కాదు.. పిల్లల్ని ఎవరు ఆసుపత్రికి తీసుకెళ్లారు..? వాళ్లల్లో ఎవరి బాగా దెబ్బలు తగిలాయి..? ఎలాఉన్నారు..? ఒకటే ప్రశ్నల వర్షం. పాపం అక్కడున్న వారికి తెలియదు.. తెలిసింది తెలిసనట్లు చెబితే... వాళ్లను కోర్టుల చుట్టూ తిప్పుతారని. ఎందుకంటే వారే ప్రత్యక్ష సాక్షులుగా పోలీసుల రికార్డుల్లోకి వారికి తెలియకుండానే వెళ్లిపోతారు. అక్కడున్నవారంతా తలోమాట చెప్పడంతో పోలీసులకూ ఏమీ అర్థంకాలేదు. చివరికి ఫ్లైవోర్కు ఉన్న సీసీ ఫుటేజ్ చూసిన తరువాత లారీడ్రైవర్దే తప్పని పోలీసులు ప్రథమిక నిర్ధారణకు వచ్చారు.
చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడం...
ఎప్పుడైనా... ఎక్కడ రోడ్డు ప్రమాదం జరిగనా నిజాలు తెలుసుకోవడానికి రవాణాశాఖ అధికారులు (Regional Transport Authority) రంగంలోకి దూకుతారు. విశాఖపట్నంలో జరిగిన రోడ్డు ప్రమాదంలోనూ అదే జరిగింది. ప్రమాదం జరిగిన మూడు గంటలకు రవాణశాఖ అధికారుల తనిఖీలు మొదలెట్టారు. ఇప్పుడు రంగం ప్రవేశం చేయాల్సింది ప్రభుత్వం. ఇక్కడ సర్కారు పక్షాన మాజీ టీటీడీ చైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి విద్యార్థుల వైద్యఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చేశారు. సుబ్బారెడ్డి హామీతో అక్కడున్నవారెవ్వరూ మరేం నోరెత్తడానికి వీలు లేకుండాపోయింది. లైసెన్స్ లేకుండా ఆటోనడిపే వారికి తప్పుకాదా..? అసలు ఆటోకి ఫిట్నెస్ లేకపోవడం నిబంధనలకు విరుద్ధం కాదా..? అని నిలదీయడానికి నోరుపెగల్లేదు. ఎందుకంటే ప్రమాదంలో దెబ్బలు తగిలిన పిల్లలందరికీ వైద్యం ప్రభుత్వం చేయిస్తుంది కదా..! షరా మామూలే. రొటీన్గా రవాణాశాఖ సిబ్బది విశాఖ నగరమంతా జల్లెడ పట్టి ఆటోల ఫిట్నెస్, లైసెన్స్ లేకుండా నడిపేవారిపై కొరఢా. ఇది ఎప్పుడు జరిగే తంతే. చేతులు కాలాకా... ఆకులు పట్టుకోవడం అంటే ఇదే. 35 ఆటోడ్రైవర్లపై కేసులు... 8 ఆటోలు సీజ్. ఇది అధికారిక ప్రకటన. పైగా ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు. పాడిండే పాట పాసిపళ్లదాస... అంటూ ఆర్టీయే అధికారులు పాత పాట.
ప్రమాదాల తీరుతెన్నులు..
గత ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ లో 2890 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, వాటిలో 2600 ప్రమాదాలకు కారకులు.. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా (With out Licence) వాహనాలు నడిపేవారే ఉన్నారు. మిగిలినవన్నీ మందుబాబుల చలువ (Drunk & Drive). చాలాచోట్ల మైనర్లు బళ్లు నడపడంతో కూడా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ మైనర్ల అమ్మానాన్న... దెబ్బలు తగిలిన వారి కాళ్లాఏళ్లా పట్టుకొని బ్రతిమలాడి.. కేసులు లేకుండా... వైద్యానికి అయ్యే ఖర్చులు తామే భరిస్తామని చెప్పడంతో బయటకి పొక్కుకండానే ఈ యాక్సిడెంట్స్ ఉంటున్నాయి. కొంపతీసి ఎవరైనా ప్రమాదంలో మరణించారో... ఇక మైనర్ల తండ్రి కోర్టుల చుట్టూ తిరగాల్సిందే. అందేకు రహస్యంగా పెడుతున్నారు మైనర్ డ్రైవర్ల యాక్సిడెంట్స్. ఒకవేళ పోలీసులదాకా వెళ్లిందా... ఠాణాలోనే సెటిల్మెంట్లు. ఖాకీలకు కొంత... గాయపడ్డావారికి పూర్తి వైద్యం ఖర్చులు. అంతే కథ ముగిసినట్లే. ఇక ఎక్కడ రోడ్డు ప్రమాదం జరిగినా.. దాని వెనకాల ఒక స్టోరీ ఉంటుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో స్కూలు బస్సులు, ఆటోలు ఎన్నోసార్లు ప్రమాదాలకు గురయ్యాయి. రవాణాశాఖ నిబంధనలు (Transport Act) చూస్తే... కొత్త రవాణా వాహనాలైతే కొన్న 15 ఏళ్ల వరకూ ఎలాంటి ఫిట్నెస్ (Vehicle Fitness) అవసరం లేదు. 15 ఏళ్లు దాటిన తరువాత ప్రతీ ఏటా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిందే. అది ఆటో అయినా, బస్సుఅయినా... ఏ రవాణా వాహనమైనా (Transport Vehicle) సరే ఇదే నిబంధన. వ్యక్తిగత వాహనాలైతే (Personal Vehicles) ఫిట్నెస్ అవసరం లేదు. కానీ రవాణా వాహనాల్లోని ఆటోలు, చిన్నవాహనాలన్నీ తప్పనిసరిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. ట్రాఫిక్ పోలీసులు కూడా పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాలు కూడా కనుచూపు మేరల్లో లేనే లేవు. అందుకే ఎక్కడబడితే అక్కడ నిర్లక్ష్యంగా ఈ వాహనాలు రోడ్లపై చక్కర్లు కొడుతున్నాయి. ప్రమాదం జరిగితే మాత్రం వాలిపోయి... ఒకటో రెండో రోజులపాటు హడావిడి చేసి, ఆ తరువాత ఇక పట్టించుకోరని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విశ్రాంత ఉద్యోగి చెబుతున్నారు. మందే జాగ్రత్తలు ఉంటే ఇప్పుడీ పరిస్థితి రాదుకదా..? అంటున్నారు.
ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న వాహనాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లెక్కల ప్రకారం 23,45,891 రవాణా వాహనాలన్నాయి. వీటిల్లో సుమారు 12 లక్షలకు పైగా ఆటోలున్నాయి. ఆర్టీయే అధికారుల లెక్కచెప్పున ప్రతీ ఏటా పెద్దసంఖ్యలోనే పెరుగూ వస్తున్నాయి. వాహనాలపై ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకుల నుండి అప్పుచేసి సొంత వాహనాలు కొనేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. అలాగే రవాణావాహనాలు (Commercial Vehicles) సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. పెరుగుతున్న వాహనాలకు తగినట్టుగా వాటిని తనిఖీలు చేపట్టడానికి సిబ్బంది ఆర్టీయేలో లేకపోవడం ఇక్కడ విచిత్రం. రాష్ట్రంలో రోజులకు కనీసం లక్షకు పైగా కొత్త రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉంటున్నాయి. 15 ఏళ్లు పైబడిన వాహనాలను కనిపెట్టెందుకు తగిని సిబ్బంది ఎక్కడ..? అన్న అనుమానం రావలికదా..! అదే జరుగుతోంది ఇక్కడ. సర్కార్ తనకొచ్చే రాబడి కోసం ప్రయత్నాలు చేస్తుంటే... ఇక్కడ ప్రజల జీవితాలు రోడ్డుమీద అర్థాంతరంగా రక్తపుమడుగుల్లో కొట్టుకుంటున్నాయి. ఇలా చెప్పుకోవడానికేం గానీ... చూస్తేనే కళ్లు చెదిరిపోతాయి.. గుండె దడదడలాడుతుంది. ఆ పరిస్థితుల్లో మనవాళ్లెవరైనా ఉంటే..? అనే ఆలోచన వస్తేనా చాలు.. నవనాడులూ కుంగిపోతాయి. రోడ్డు ప్రమాదాల్లో ప్రముఖుల వారసులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎన్టీఆర్ కుమారుడు, మాజీ ఎంపీ, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ, ఆయన కుమారుడు నందమూరి జానకి రామ్, (ఒకే కుటంబం నుండి ఇద్దరు.. తండ్రీ కొడుకు), సినీహాస్య నటుడు బాబూమోహన్ కొడుకు, మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల చైర్మన్ నారాయణ వారసుడు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి చేతికి అందిన కొడుకు, ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు అజారుద్దీన్ ఏకైక వారసుడు, ప్రముఖ కన్నడ, తెలుసు సీనీనటుడు సంచారి విజయ్, నటుడు భరత్ ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కకు మించినంత మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇక్కడ మిగిలిందల్లా ప్రమాదానికి కారణాలేంటి..? ఎవరిది తప్పు..? కానీ ఇటువంటి వాటికి ఇప్పటికీ వీటికి సమాధానాల్లేవు. ఇంకా రోడ్డు ప్రమాదాలు రోజూ రుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా క్షణానికి ఒకరు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని అధికారిక రికార్డులు చెబుతున్నాయి. దీన్ని బట్టి మనం ఆలోచిస్తే అర్థమవుతుంది పరిస్థితి ఎలా ఉందనేది.
ప్రభుత్వం ఏం చేయాలి..?
కచ్చితంగా 15 ఏళ్లు పూర్తయిన రవాణా వాహనాలను అధికారులు గుర్తించి వాటిని సీజ్ చేయాల్సిందే. మన దేశంలో దక్షిణాధి రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు ఉత్తర భారత్ లోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు 15 ఏళ్లకు పైబడిన రవాణా వాహనాలను (Commercial Vehicles) నడిపేందుకు నిషేధాజ్ఞలు కఠినంగా అమలు చేస్తున్నాయి. కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటి వరకూ అలాంటి చర్యలు లేవనే చెప్పాలి. ఇప్పటికీ కాలం చెల్లిన వాహనాలు రోడ్లపైనా రయ్..రయ్ అంటూ పరుగులు పెడుతూ ప్రజల ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నాయి. అసలు కాలం చెల్లిన రవాణా వాహనాలు ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఉన్నాయనేది ప్రభుత్వం దగ్గర లెక్కలే లేకపోవడం విడ్డూరం. రవాణాశాఖ అధికారులు తలచుకుంటేనే తుక్కు వాహనాల తుప్పు వదిలించేయొచ్చు. అంతేకాని సంఘటన జరిగినత తరువాత హడావుడి చేయడం సరికాదని రవాణాశాఖ అదనపు కమిషనర్గా పని చేసి రిటైర్డ్ అయిన సీ.ఎల్.ఎన్.గాంధీ హెచ్చరిస్తున్నారు. ముందు నుండీ ఒక ప్రణాళికాబద్దంగా ఉంటేనే తుప్పు పట్టిన వాహనాలను రద్ద చేయడం సాధ్యమవుతుందే కానీ. ఇలా అప్పటికప్పుడు చర్యలు చేపట్టడం సాధ్యం కాదని గాంధీ చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో... అన్న ప్రశ్న తరతరాలుగా వెంటాడుతుంటే.. రోడ్డు ప్రమాదాలు మాత్రం క్షణానికొకరి ప్రాణాలను బలితీసుకుంటూనే ఉన్నాయి. రోడ్డుప్రమాదాలు శాపమా..? లేక లోపమా..?

