
ఏపీ మద్యం కుంభకోణం: రాజ్ కేసీరెడ్డి బెయిల్ రద్దు చేయండి
తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఈడీ
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్‌రెడ్డికి మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఆయనను తిరిగి జ్యుడీషియల్ కస్టడీకి పంపించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి.. రాజ్‌రెడ్డికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. నోటీసులను వ్యక్తిగతంగా అందజేసేందుకు ఈడీకి అనుమతించారు. తదుపరి విచారణను డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేశారు.
రాజ్‌రెడ్డికి ఈ ఏడాది సెప్టెంబర్ 24న హైదరాబాద్‌లోని నాంపల్లి సెషన్స్ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఈడీ క్రిమినల్ పిటిషన్ నంబర్ 18923/2026ను హైకోర్టులో దాఖలు చేసింది. బెయిల్ ఉత్తర్వులను రద్దు చేయడంతోపాటు, రాజ్‌రెడ్డి సంబంధిత కోర్టు ఎదుట లొంగిపోయేలా ఆదేశించాలని, అనంతరం ఆయనను తిరిగి జ్యుడీషియల్ కస్టడీకి పంపించాలని ఈడీ కోరింది.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో మద్యం రవాణా టెండర్ల ప్రక్రియను ప్రభావితం చేయడంలో రాజ్‌రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు ఈడీ ఆరోపిస్తోంది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ఐటీ సలహాదారుగా పనిచేశారు.
ఈడీ దర్యాప్తు ప్రకారం.. అప్పటి ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) మేనేజింగ్ డైరెక్టర్ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, ఆయన అనుచరులతో కలిసి రాజ్‌రెడ్డి మద్యం రవాణా టెండర్ల విధానంలో మార్పులు చేయించారని ఆరోపణలున్నాయి. ఈ మార్పుల ద్వారా తమకు అనుకూలమైన కొన్ని సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరించినట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది.
ఈ వ్యవహారంలో సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆ తర్వాత ప్రసాద్ ట్రాన్స్పోర్ట్స్ సంస్థలను ముందుపెట్టి కార్యకలాపాలు నిర్వహించినట్లు ఈడీ ఆరోపించింది. అయితే వాటి వెనుక అసలు ఆర్థిక, నిర్వహణపరమైన నియంత్రణ మాత్రం నిందితులకు సంబంధం ఉన్న వ్యక్తుల చేతుల్లోనే ఉందని పేర్కొంది.
సాధారణంగా ఒక్కో కార్టన్ మద్యం రవాణాకు సగటున రూ.19.68గా ఉన్న ధరను కృత్రిమంగా పెంచి, గరిష్ఠంగా రూ.35.57 వరకు చెల్లించేలా చేశారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ విధంగా టెండర్ల ప్రక్రియలో అక్రమాలకు పాల్పడి, సిండికేట్‌కు భారీగా అక్రమ లాభాలు సమకూర్చినట్లు పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారంలో రాజ్రెడ్డే ప్రధాన కుట్రదారుగా, తెరవెనుక కీలక నియంత్రణాధికారిగా వ్యవహరించినట్లు దర్యాప్తు సంస్థ అభియోగాలు మోపింది.
ఈ కేసులో ఈడీ 2026 జూన్ 11న రాజ్‌రెడ్డితో పాటు అప్పటి ఏపీఎస్‌బీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవరెడ్డిని మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద అరెస్టు చేసింది.మద్యం రవాణా వ్యవహారానికి సంబంధించి సీఐడీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ వ్యవహారం వల్ల రాష్ట్ర ఖజానాకు రూ.195.33 కోట్ల నష్టం వాటిల్లినట్లు సీఐడీ కేసులో ఆరోపణలు ఉన్నాయి.
మరోవైపు మద్యం కొనుగోళ్లు, సరఫరా, పంపిణీలోనూ భారీ అక్రమాలు జరిగినట్లు ఈడీ వేరుగా దర్యాప్తు చేస్తోంది. సరఫరా ఆర్డర్లలో అవకతవకలు, ముడుపుల వ్యవహారాలు కూడా ఇందులో భాగంగా ఉన్నట్లు ఆరోపణలున్నాయి.
అయితే తెలంగాణ హైకోర్టులో ప్రస్తుతం విచారణకు వచ్చిన పిటిషన్ మాత్రం మద్యం రవాణా టెండర్లకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో రాజ్‌రెడ్డికి మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలన్న ఈడీ అభ్యర్థనకే పరిమితమైంది. డిసెంబర్ 2న ఈ వ్యవహారంపై తదుపరి విచారణ జరగనుంది.
Next Story

