స్వీట్ బాక్స్ అడిగితే వందల కోట్ల విలువైన వస్తువుల రాక
x

స్వీట్ బాక్స్ అడిగితే వందల కోట్ల విలువైన వస్తువుల రాక

సోషల్ మీడియాలో తన ఇంటి అడ్రస్ చెప్పిన ఇన్ ఫ్లూయెన్సర్, ఆడుకున్న ఆకతాయిలు


Click the Play button to hear this message in audio format

పండగ సందర్భంగా ఒక తనకు ఓ స్వీట్ బాక్స్ పంపాల్సిదిగా ఓ సోషల్ మీడియా ఇన్ ప్లూయెన్సర్ తన అభిమానులకు చేసిన చిన్న అభ్యర్థన అతనికి పీడకలను మిగుల్చింది. ఏకంగా ఇంటిని వదిలి పారిపోయేలా చేసింది. తమిళనాడులోని మదురైకి చెందిన వీరమణి అనే కంటెంట్ క్రియేటర్‌కు ఎదురైన ఈ అనుభవం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మదురైలోని వెస్ట్ అనుప్పనాడికి చెందిన వీరమణి.. స్థానిక యాసలో హాస్యభరితమైన వీడియోలు, పోస్టులతో సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్నారు. దీపావళి సందర్భంగా తనకు ఎవరైనా స్వీట్ల బాక్స్ పంపిస్తారనే ఆశతో ఇటీవల తన ఇంటి చిరునామాను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
అయితే, కొందరు ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేశారు. ఆయన పేరు మీద క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిలో భారీగా ఆర్డర్లు పెట్టడం మొదలుపెట్టారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ డెలివరీ సిబ్బంది వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్‌లు, స్మార్ట్‌ఫోన్లు, టీవీల వంటి ఖరీదైన వస్తువులను ఆయన ఇంటికి తీసుకొచ్చారు. వీటిలో ఓ టీవీ ధర ఏకంగా రూ.1.69 లక్షలుగా ఉంది.
ఆ వస్తువులను తాను ఆర్డర్ చేయకపోవడంతో వాటికి డబ్బులు చెల్లించే పరిస్థితి వీరమణికి లేకుండా పోయింది. డెలివరీ తీసుకోవడానికి అవసరమైన ఓటీపీలను కూడా ఆయన ఇవ్వలేకపోయారు. మరోవైపు, స్విగ్గీ, జొమాటో నుంచి కూడా ఆహార పదార్థాల డెలివరీలు రావడంతో ఇబ్బందులు మరింత పెరిగాయి.
ఇంతటితో ఆగకుండా, కొందరు భారీ యంత్రాలు, జేసీబీ ఎక్స్‌కవేటర్లు, రూ.70 కోట్ల విలువైన సైనిక ట్యాంకులు కూడా ఆర్డర్ చేసినట్లు స్క్రీన్‌షాట్లను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు. అయితే, వీటికి సంబంధించిన ఆర్డర్లు నిజంగా పెట్టారా లేదా అనేది స్పష్టంగా లేదు.
వరుసగా వస్తున్న డెలివరీలతో తీవ్ర ఒత్తిడికి గురైన వీరమణి.. తన ఇంటి నుంచి ఓ వీడియో విడుదల చేసి, ఈ ప్రాంక్స్ ఆపాలని ఫాలోవర్లను వేడుకున్నారు. స్వీట్ల బాక్స్ అడిగినందుకు తాను తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నానని, తన పరిస్థితిని అర్థం చేసుకుని ఆర్డర్లు పెట్టడం ఆపాలని విజ్ఞప్తి చేశారు.
అయినా డెలివరీలు ఆగలేదు. పగలు, రాత్రి తేడా లేకుండా డెలివరీ సిబ్బంది ఇంటికి వస్తుండటంతో వీరమణి తన నివాసాన్ని విడిచి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు.
ఆయన ఇంటిని సందర్శించిన మీడియా ప్రతినిధులు, ఇతర సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు తాళం వేసి ఉన్న ఇల్లు కనిపించింది. మరోవైపు, తాను ప్రయాణంలో ఉన్నానని, ఇక తన చిరునామాను ఎవరూ కనుగొనలేరని వీరమణి తన తాజా సోషల్ మీడియా వీడియోల్లో పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారనే విషయం తెలియరాలేదు. ఆయన పబ్లిక్ ఫోన్ నంబర్‌కు చేసే కాల్స్ కూడా బ్లాక్ చేసినట్లు సమాచారం. సరదాగా చేసిన ఓ విజ్ఞప్తి, కొందరి ప్రాంక్స్ కారణంగా వీరమణి ఎదుర్కొన్న ఈ పరిస్థితి.. సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలను పంచుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తుచేస్తోంది.
Read More
Next Story