
నిరసన తెలియజేసే హక్కు అందరికి ఉంది: అన్నామలై
కేంద్రం అణచివేత విధానాలు పాటిస్తోందని విమర్శ
ఢిల్లీ ఆందోళనకారులపై పోలీసుల చర్యలను ప్రశ్నిస్తూ కేంద్ర ప్రభుత్వంపై మాజీ బీజేపీ నేత, తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉందని స్పష్టం చేశారు. 2011లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ, ఇప్పుడు అదే తరహా నిరసనలపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరును అన్నామలై ప్రశ్నించారు.
ఢిల్లీలో సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ (సీజేపీ) నిరసనకారులను అదుపులోకి తీసుకున్న తీరుపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశాల జాబితా నుంచి తొలగించడం, ముందస్తు నిర్బంధం, బెయిల్‌కు హామీ ఇచ్చే వ్యక్తుల పూచీకత్తులను తిరస్కరించడం, ఢిల్లీ పోలీసులు పెల్లెట్ గన్స్ ఉపయోగించారనే ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.
2011లో ఢిల్లీలోని రాంలీలా మైదానంలో అవినీతి వ్యతిరేక ఉద్యమకారులపై పోలీసులు అర్ధరాత్రి చర్యలు తీసుకున్నప్పుడు, అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారని అన్నామలై గుర్తుచేశారు. తన చేతులు కట్టేయకపోతే ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వంపై పోరాడేవాడినని మోదీ అప్పట్లో వ్యాఖ్యానించిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ సమయంలో మోదీ చెప్పింది సరైనదేనని తాను భావిస్తున్నట్లు అన్నామలై పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రజాస్వామ్యంలో చట్టపరమైన ప్రక్రియలను ప్రశ్నించినా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని, నిరసనకారులను విదేశీ ఏజెంట్లుగా ముద్ర వేస్తున్నారని ఆయన ఆరోపించారు. నీట్ పరీక్షకు సంబంధించిన నిరసనల సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆందోళనకారులతో చర్చలు జరపాలని తాను కోరినప్పటి నుంచీ తనపై విమర్శలు వస్తున్నాయని తెలిపారు.
సీజేపీ అనుసరిస్తున్న అన్ని పద్ధతులతో తాను ఏకీభవించకపోయినా, తమకు ముఖ్యమైన సమస్యలపై నిరసన తెలిపే హక్కు ఆ సంస్థ సభ్యులకు ఉందని అన్నామలై స్పష్టం చేశారు. విమర్శలకు బదులుగా కేంద్ర ప్రభుత్వం ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని కోరారు.
జంతర్ మంతర్‌ను నిరసన స్థలంగా ఎందుకు తొలగించారని, ముందస్తు నిర్బంధానికి సంబంధించిన వ్యవహారాల్లో ఢిల్లీ పోలీసు అసిస్టెంట్ కమిషనర్‌కు ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అధికారాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
అక్టోబర్ 13న జంతర్ మంతర్ వద్ద అరెస్టయిన వారి బెయిల్ విచారణ సందర్భంగా అక్టోబర్ 19న మేజిస్ట్రేట్ ఆలస్యంగా రావడం, ఆ తర్వాత తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ విచారణ నుంచి తప్పుకోవడం వెనుక కారణాలను వెల్లడించాలని కోరారు. ఎనిమిది పూచీకత్తులను ఎందుకు తిరస్కరించారని, పూచీకత్తు ఇచ్చేందుకు వచ్చిన వ్యక్తిని ఎందుకు ప్రశ్నించారని కూడా ఆయన నిలదీశారు.
నీట్ నిరసనల సమయంలో పోలీసులు నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై, పెల్లెట్ గన్స్ వినియోగంపై ఏమైనా చర్యలు తీసుకున్నారా అని అన్నామలై ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాల సమయంలో నిరసనకారులు నిబంధనలు ఉల్లంఘించినప్పుడు పోలీసులు ఎలా వ్యవహరించారో కూడా వివరించాలని కోరారు.
ఇదే సమయంలో నిరసనలను దేశవ్యతిరేక చర్యలుగా చిత్రీకరించడం, విదేశీ శక్తుల నిధులతో జరుగుతున్నాయని ఆరోపించడం సరికాదని అన్నామలై అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య సంస్థల్లో కొందరు వ్యక్తులు తప్పులు చేసినంత మాత్రాన మొత్తం వ్యవస్థను తప్పుబట్టకూడదని రాజకీయ పార్టీలకు సూచించారు.
కాగా, అన్నామలై ఈ ఏడాది జూన్ 5న బీజేపీకి రాజీనామా చేశారు. సీజేపీ నిరసనలపై ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మళ్లీ విమర్శలు మొదలయ్యాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిరసనకారులపై తీసుకున్న చర్యలపై సమాధానాలు ఇవ్వాలని, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును గౌరవించాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story

