రెచ్చిపోయిన రేవంత్... జై కొట్టిన ఆంధ్రా జనం!
x
విశాఖసభలో ప్రసంగిస్తున్న రేవంత్ రెడ్డి, పక్కన వైఎస్ షర్మిల

రెచ్చిపోయిన రేవంత్... జై కొట్టిన ఆంధ్రా జనం!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి విశాఖపట్నంలో అనూహ్య స్పందన లభించింది. ఆధ్యంతం చమక్కులు, చెణుకులతో సాగిన రేవంత్ ప్రసంగానికి సభికులు హర్షధ్వానాలతో హోరెత్తించారు


(తంగేటి నానాజీ, విశాఖపట్నం)

విశాఖపట్నం కాంగ్రెస్ సభ కార్యకర్తల్లో కొత్త జోష్ నింపింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగానికి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. తెలంగాణ ముఖ్యమంత్రిని చూసి ఆంధ్రా జనం ఎక్కడ ఈలలేసి కేకలేస్తారో అనుకుంటే అది కాస్తా తలకిందులైంది. ఈ సభను చూసి తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆశ్చర్యచకితులయ్యారు. కాంగ్రెస్ కు ఇంత ఆదరణ ఉందా అని విస్మయం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతున్నంత సేపూ కార్యకర్తలు, నినాదాలతో హోరెత్తించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన ప్రతి మాటకూ ప్రేక్షకులు కేరింతలు కొట్టారు.

నేను విశాఖలో ఉన్నానా, హైదరాబాద్ లోనా...


ఈ సభను చూస్తుంటే నేను విశాఖపట్నంలో ఉన్నట్టు లేదు, హైదరాబాద్ లో ఉన్నట్టుంది. నేనిక్కడకు వద్దామనుకున్నప్పుడు కాంగ్రెస్ ఏపీలో ఏముందన్నా, నువ్వు అక్కడికి వెళ్లడం ఎందుకని నా మిత్రులు అన్నారు. నిజంగానే అంతటి పరిస్థితి ఉందా, అక్కడకు వెళితే కాంగ్రెస్ పరువే పోతుందేమోననుకుని నా మనసులో కూడా అనుకున్నా. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే నిజంగానే నివ్వెరపోతున్నా, వైఎస్ షర్మిల నాయకత్వ పటిమ ఏమిటో అర్థమైంది. కాంగ్రెస్ కు ఏమాత్రం ఆదరణ తగ్గలేదని అనిపించింది. మీ స్పందన చూస్తుంటే నాకు విస్మయం కలుగుతోంది. మనం భౌగోళికంగా విడిపోయి రెండు రాష్ట్రాలైతే అయ్యామేమో కాని మానసింకంగా తెలుగువాళ్లందరం ఒక్కటే అన్నారు రేవంత్ రెడ్డి

ఢిల్లీ నుంచి సుల్తాన్లు, జాగీర్దార్లు వచ్చినా విశాఖపట్నం నుంచి ఒక్క పెళ్ల (ఇటుక)ను కూడా పెకల్చలేరని సీఎం రేవంత్ రెడ్డి అన్నప్పుడు సభ హర్షధ్వానాలతో మార్మోగింది. కొన్ని సెకన్ల పాటు చప్పట్లు, ఈలలతో సభా ప్రాంగణం మార్మోగిపోయింది. ఈ సందర్భంగా ఆయన పురాణకథను కూడా ప్రస్తావించారు. కురుక్షేత్రమహాసంగ్రామంలో పాండవులు, కౌరవులు వేర్వేరు. వాళ్ల జోలికి ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం వాళ్లు వంద ప్లస్ ఐదు. అంటే నూటఐదు అని పరోక్షంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ వారసులు ఎవరనేదానిపై ఇటీవలి కాలంలో చాలామంది ప్రస్తావిస్తున్నారని, వాస్తవానికి వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీ వారసుడని రేవంత్ రెడ్డి చెప్పినప్పుడు కూడా సభికుల నుంచి పెద్దఎత్తున స్పందన వచ్చింది. నిజమైన వారసులు ఎవరనేది ప్రశ్న కాదంటూనే... ఎవరైతే వైఎస్సార్ ఆశయాల్ని, సంకల్పాన్ని నిలబెట్టే వారే నిజమైన వారసులన్నప్పుడు సభికుల నుంచి వైఎస్ షర్మిల, వైఎస్ షర్మిల జిందాబాద్ అంటూ నినాదాలు హోరెత్తాయి. సభ ఆధ్యంతం రేవంత్ రెడ్డి ప్రసంగం కోసమే ఎదురుచూసినట్టనిపించింది. మిగతా నాయకుల ప్రసంగాల కన్నా రేవంత్ రెడ్డి ఆంధ్రాగురించి, వైస్ జగన్, చంద్రబాబు గురించి ఏమి మాట్లాడతారన్నదే విశాఖపట్నంలో చర్చనీయాంశమైంది.

రేవంత్ ఇంకా ఏమన్నారంటే...

'వైఎస్సార్ నిజమైన వారసురాలు వైఎస్ షర్మిలా రెడ్డి, నవ్యాంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుక ఆమె.. .ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిలా రెడ్డి త్వరలో ప్రమాణ స్వీకారం చేస్తుందంటున్నారు’ తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి. షర్మిలమ్మకి అండగా నేనుంటా. ఏ అవసరం వచ్చినా ముందుట. షర్మిలమ్మ ఇక్కడకు అధికారం కోసం రాలే. ఆంధ్ర ప్రజల పక్షాన పోరాటం కోసం వచ్చింది' అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. విశాఖ స్టీల్ ప్లాంట్ గ్రౌండ్లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన చేసిన ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది. ఓవైపు కాంగ్రెస్ ను మరోవైపు షర్మిలమ్మను పొగడ్తలతో ముంచెత్తారు. ఒకింత ఉద్వేగం మరింత ఉత్తేజ భరిత ప్రసంగంతో ప్రజలను ఆకట్టుకున్నారు. షర్మిలమ్మే ఏపీ సీఎం అంటూ జోస్యం చెప్పారు.

తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఢిల్లీకి తాకట్టు...

విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికార, ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి పదేళ్లయినా రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరలేదు. 10 ఏళ్లు అయినా పోలవరం కట్టలేదు.. 10 ఏళ్లు దాటినా రాజధాని కట్టలేదు... తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టారు... రాష్ట్రానికి చెందిన అధికార ప్రతిపక్ష నేతలు ఢిల్లీలో వంగి వంగి దండాలు పెడుతున్నారు అని మండిపడ్డారు రేవంత్ రెడ్డి.


బీజేపీ అంటే ఇవ్వాళ బాబు, జగన్, పవన్. వీళ్ళు మోడీ బలం, బలగం. వీళ్లకు ఓటేస్తే మోడీకి ఓటు వేసినట్లే. ఢిల్లీలో మోదీనీ నిలదీసే దమ్ము లేదు. వీళ్లంతా ముత్యాల ముగ్గు బ్యాచ్' అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.

విశాఖ ఉక్కు పై రాజీలేని పోరాటం...

విశాఖ ఉక్కు ప్రైవేటుకరణ పై కాంగ్రెస్ పార్టీ రాజీలేని పోరాటం సాగించేందుకు సిద్ధంగా ఉందనే సంకేతాన్ని స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో జరిగిన సభ ద్వారా ప్రజల్లోకి పంపించారు. దీని ప్రభావం సార్వత్రిక ఎన్నికల్లో ఏవిధంగా ఉండబోతుందో చూడాలి. విశాఖ ఉక్కు, పోలవరం ప్రాజెక్ట్, రాష్ట్రానికి ప్రత్యేక హోదా... ఈ అంశాలను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రజారాయుధాలుగా ఉపయోగిస్తుంది. ఈ సభలో ఇదే అంశంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆదానీ కోసం ప్రధాని విశాఖ ఉక్కునే తెగ నమ్ముతాం అంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని రేవంత్ హెచ్చరించారు. వేలాది మంది కాంగ్రెస్ అభిమానులతో సభా ప్రాంగణం నిండిపోయింది.


Read More
Next Story