
జి. పరమేశ్వర
‘‘పదివేల భారత్ జోడో యువ సంఘాలు ఏర్పాటు’’
కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం
కర్ణాటకలో పదివేల ‘భారత్ జోడో యువ సంఘాలు(యువజన క్లబ్బులు) ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం జి. పరమేశ్వర తెలిపారు. నాయకత్వం, క్రీడలు, సంస్కృతి, శాస్త్రీయ దృక్పథం, సామాజిక సామరస్యాన్ని పెంపొందించే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
జూన్ 3న రాష్ట్ర పాలనా బాధ్యతలు స్వీకరించిన వెంటనే డీకే శివకుమార్ నేతృత్వంలోని మంత్రివర్గం ప్రకటించిన తొలి కొన్ని కార్యక్రమాలలో ఇది ఒకటి. "యువతలో క్రీడలు, సంస్కృతి, శాస్త్రీయ దృక్పథం, సామాజిక సామరస్యాన్ని ప్రోత్సహించడానికి గ్రామ పంచాయతీలు, పట్టణ వార్డుల వ్యాప్తంగా 10,000 భారత్ జోడో యువ సంఘాలను ఏర్పాటు చేయడానికి మేము అధికారిక ఉత్తర్వు జారీ చేశాము" అని పరమేశ్వర సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రకటించారు.
"ప్రతి గ్రామ పంచాయతీలో ఒక సంఘం, పట్టణ పంచాయతీలలో ప్రతి 4,000 మందికి ఒకటి, మున్సిపాలిటీలలో ప్రతి 6,000 మందికి ఒకటి, నగర మున్సిపల్ కౌన్సిళ్లలో ప్రతి 8,000 మందికి ఒకటి, మున్సిపల్ కార్పొరేషన్, జీబీఏ పరిధిలో ప్రతి 10,000 మందికి ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తాం," అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమాన్ని యువజన సాధికారత, క్రీడల శాఖ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, పట్టణాభివృద్ధి, రెవెన్యూ, విద్యా శాఖల సహకారంతో అమలు చేస్తుందని ఆయన తెలిపారు.
ప్రతి సంఘానికి ఏటా రూ.10 లక్షల గ్రాంటు లభిస్తుందని పేర్కొంటూ, ప్రతి సంఘం నుంచి ఒక శిక్షకుడికి ఏటా రూ.24,000 గౌరవ వేతనం అందిస్తామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. "భారత్ జోడో యువ సంఘాల ద్వారా యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, వారికి సాధికారత కల్పించి, బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం," అని ఆయన అన్నారు.
Next Story

